USA: ‘అతివాదం’తో తలనొప్పులు.. హక్కుల కార్యకర్త అరెస్టు | Sakshi
Sakshi News home page

USA: హక్కుల కార్యకర్త ‘అతివాదం’.. షాకిచ్చిన పోలీసులు

Published Sat, Apr 13 2024 3:49 PM

Pro Palastine Rights Activist Face Arrest For Her Extremist Remarks - Sakshi

కాలిఫోర్నియా: ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధంలో చిధ్రమవుతున్న గాజా పరిస్థితి మానవతావాదుల హృదయాలను ద్రవింపజేస్తోంది.  ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది హక్కుల కార్యకర్తలు పాలస్తీనాకు మద్దతుగా తమ గళం విప్పుతున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా బేకర్స్‌ఫీల్డ్‌ నగర కౌన్సిల్‌లో హక్కుల కార్యకర్త రిద్ది పటేల్‌ పాలస్తీనాకు మద్దతుగా గొంతు వినపించారు. అయితే గీత దాటి అతివాదం వైపు వెళ్లి కష్టాలు కొనితెచ్చుకున్నారు. 

గాజాలో కాల్పుల విరమణ తీర్మానంపై హియరింగ్‌ సందర్భంగా ఓపిక నశించిన రిద్ది ఏకంగా మేయర్‌, కౌన్సిల్‌ సభ్యులనే బెదిరించారు. ‘ఏదో ఒక రోజు మీ ఇంట్లోనే మిమ్మల్ని చంపే పరిస్థితి వస్తుంది’ అని వారిని హెచ్చరించారు. గాజాలో ఇజ్రాయెల్‌ కాల్పుల విరమణ తీర్మానానికి ఎవరూ మద్దతు పలకకపోవడం..తీర్మానంపై సుదీర్ఘంగా చర్చ కొనసాగుతుండడంతో నిరాశ నిస్పృహలకు లోనైన రిద్ది పటేల్‌ తనలోని అతివాది బయటికి తీశారు.

కౌన్సిల్‌ సభ్యులను బెదిరించినందుకుగాను రిద్దిపై 16 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. పటేల్‌ తీరును హిందూ అమెరికన్‌ ఫౌండేషన్‌లు ఖండించాయి. బెదిరింపుల సందర్భంగా  మహాత్మాగాంధీ పేరతో పాటు చైత్ర నవరాత్రిలను రిద్ది ప్రస్తావించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఎంతటి తీవ్రత కలిగిన అంశంపై పోరాడాల్సిన సందర్భంలోనైనా హక్కుల కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించాల్సిందేనని రిద్ది పటేల్ ఎదుర్కొంటున్న పరిణామాలే తెలియజేస్తున్నాయని ప్రజాస్వామ్యవాదులు అభిప్రాయపడుతున్నారు.  

ఇదీ చదవండి.. సౌదీ జైలులో భారతీయుడు

Advertisement
Advertisement