గాయపడిన షేక్ గొరెబుడే హుసేన్, షేక్ కారంపూడి జానీ బాసా
ఓటమి భయంతో రెచ్చిపోయిన టీడీపీ నేతలు.. ఓటర్లు, వైఎస్సార్‌సీపీ నేతలు, ఏజెంట్లపై దాడులు
మాచర్ల ఎమ్మెల్యే పీఆర్కే తనయుడు గౌతమ్, డ్రైవర్‌పై దాడి
తంగెడలో పెట్రోలు బాంబులతో దాడి.. 8 మందికి తీవ్ర గాయాలు
పాల్వాయి, తుమృకోటల్లో ఈవీఎంలు ధ్వంసం
ముప్పాళ్లలో మంత్రి అంబటి అల్లుడు కారు అద్దాలు ధ్వంసం
నూజెండ్ల మండలంలో దళితులపై అరాచకం
కేశానుపల్లిలో ఇళ్లకు వెళ్లి వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపై దాడి.. చోద్యం చూసిన పోలీసులు
సాక్షి, నరసరావుపేట/రెంటచింతల/నరసరావుపేట/మాచర్ల: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పల్నాడులో పచ్చ మూక పేట్రేగింది. ఓటమి ఖాయమని ముందే తెలిసిపోవడంతో ఓటర్లు, వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, పోలింగ్ ఏజెంట్లు, దళితులను లక్ష్యంగా చేసుకుని టీడీపీ నేతలు, కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు. దీంతో పల్నాడు జిల్లా రణరంగాన్ని తలపించింది. యథేచ్ఛగా టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ఇదేంటని ప్రశ్నించినవారిని, అడ్డుకోవడానికి ప్రయత్నించినవారిని టీడీపీ నేతలు, కార్యకర్తలు చితకబాదారు. చివరకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను కూడా విడిచిపెట్టలేదు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తనయుడు, డ్రైవర్‌పై, ముప్పాళ్లలో మంత్రి అంబటి రాంబాబు అల్లుడి కారుపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు.
నూజెండ్ల మండలంలో దళితులను చితకబాదారు. దాచేపల్లి మండలం కేశానుపల్లిలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఇళ్లకు వెళ్లి మరీ వారిని టీడీపీ నేతలు చావగొట్టారు. పాల్వాయి, తుమృకోటల్లో ఈవీఎంలను ధ్వంసం చేశారు. తంగెడలో టీడీపీ నేతలు పెట్రోలు బాంబులతో దాడులు చేయడంతో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంత జరుగుతున్నా పోలీసులు, ఎన్నికల సంఘం అధికారులు చేష్టలుడిగి వేడుక చూశారు.
దీంతో టీడీపీ మూక పల్నాడులో భయానక వాతావరణం సృష్టించింది. ముందస్తు ప్లాన్‌లో భాగంగా పెట్రోల్ బాంబ్‌లు, కర్రలు, రాళ్లు సమకూర్చుకొని టీడీపీ నేతలు, కార్యకర్తలు మూకుమ్మడి దాడులు చేశారు. నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్లలలో బయటి ప్రాంతాల నుంచి బౌన్సర్లు, గూండాలను తీసుకువచ్చి దాడులు చేయించారు.
మాచర్లలో భయానక వాతావరణం సృష్టించిన బ్రహ్మారెడ్డి..
మాచర్ల టీడీపీ ఇన్‌చార్జిగా ఫ్యాక్షన్ నేత జూలకంటి బ్రహ్మారెడ్డిని తెచ్చిన చంద్రబాబు పోలింగ్ రోజు ఆయనతో బీభత్సం సృష్టించి.. ఓటర్లను భయాందోళనకు గురిచేశారు. రెంటచింతల మండలం పాల్వాయి వద్ద వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను కొట్టి లాగేశారని తెలిసి అక్కడికి వెళ్లిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాన్వాయ్‌పై బ్రహ్మారెడ్డి ఫ్యాక్షన్ మూక దాడులు చేసింది. విచక్షణారహితంగా కత్తులు, రాళ్లతో దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఎమ్మెల్యే పీఆర్కే తనయుడు గౌతం రెడ్డి, డ్రైవర్ అంజిరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అదే మండలంలోని తుమృకోటలో ఏజెంట్లుగా ఉన్న షేక్ సైషావలీ, షేక్ జానీబాషాలపై విచక్షణారహితంగా దాడి చేసి వారిని తీవ్రంగా గాయపరిచారు. తుమృకోటలో 5 ఈవీఎంలు, పాల్వాయి, జెట్టిపాలెంలలో ఒక్కో ఈవీఎంను ధ్వంసం చేశారు.
కారంపూడి మండలం ఒప్పిచర్లలో పోలింగ్ కేంద్రంలో ఎన్నికల ఏజెంట్లుగా ఉన్న వైఎస్సార్‌సీపీ నేత పాలకీర్తి నరేంద్ర, అతడి తమ్ముడిపై టీడీపీ మూకలు హత్యాయత్నానికి పాల్పడ్డాయి. పొట్టి శ్రీరాములు కాలనీలో బూత్ వద్ద రాళ్ల దాడిలో వైఎస్సార్‌సీపీ నాయకుడు ఇరికెదిండ్ల లాజర్‌తో పాటు పలువురికి తలలు పగిలాయి. వెల్దుర్తిలో పలు బూత్‌ల్లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బయటకు లాగి పడేసి టీడీపీ రౌడీ మూకలు రిగ్గింగ్‌లకు పాల్పడ్డాయి.
మర్సపెంటలో పుల్లారెడ్డి అనే అధికారిపై దాడి చేశారు. దుర్గి మండలం ముట్టుకూరులో టీడీపీ మూకల రాళ్లదాడిలో ఇద్దరు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. నరసరావుపేట నియోజకవర్గం పమిడిపాడులో టీడీపీ, జనసేన కార్యకర్తలు.. వైఎస్సార్‌సీపీ ఓటర్లును పోలింగ్ కేంద్రానికి రాకుండా కర్రలు, రాళ్లు, రాడ్‌లతో దాడి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. దొండపాడులో టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలోకి వచ్చిన ఆయన వైఎస్సార్‌సీపీ ఏజెంట్ల పట్ల దురుసుగా ప్రవర్తించారు.
గురజాలలో గూండాగిరి
దాచేపల్లి మండలం కేశానుపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న బొల్లా శ్రీనివాసరావు, ఆయన కుమారులు దిలీప్, మధు, పలువురు వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ నేతలు పిడిగుద్దులు కురిపించారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఇళ్లకు వెళ్లి మరీ దాడులు చేశారు. తంగెడలో పెట్రోల్ బాంబులతో విరుచుకుపడ్డారు. దీంతో రెండు దుకాణాలు, నాలుగు బైకులు దగ్ధం కావడంతోపాటు 8 మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి.
సత్తెనపల్లిలో మంత్రి అంబటితో సీఐ దురుసు ప్రవర్తన
ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెం పోలింగ్ కేంద్రం వద్ద మహిళలను సీఐ అన్యాయంగా కొట్టాడని ప్రశ్నించడానికి వెళ్లిన మంత్రి అంబటి రాంబాబుతో సీఐ రాంబాబు దురుసుగా ప్రవర్తించారు. రివాల్వర్‌తో బెదిరించే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ వర్గీయులు 20 మంది గూండాలతో దాడులకు పాల్పడ్డారు. ముప్పాళ్లలో మంత్రి అంబటి అల్లుడు కారు అద్దాలను ధ్వంసం చేశారు. నకరికల్లు మండలం రూపనగుంట్ల, కుంకలగుంటలలో 8 మందికి గాయాలయ్యాయి.
రాజుపాలెం మండలం గణపవరంలో టీడీపీ కార్యకర్తలు రాడ్డులు, కర్రలతో వైఎస్సార్ కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు. పెదకూరపాడు మండలం లగడపాడు, క్రోసూరు మండలం ఎర్రబాలెం, బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెం, అచ్చంపేట మండలం మాదిపాడులో టీడీపీ మూకల రాళ్లదాడిలో పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. నూజెండ్ల మండలం పాతచెరుకుంపాలెం, జంగాలపల్లిలో టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడుతుండగా అడ్డుకోవడానికి వెళ్లిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై దాడి చేయడానికి ప్రయత్నించారు.
పోలీసుల ‘పచ్చ’పాతం
ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ చేయాల్సిన పోలీసు శాఖ పచ్చపాతంతో పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా రౌడీలు, గూండాలతో టీడీపీ బీభత్సకాండ సృష్టించినా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. సాక్షాత్తూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు, పోలింగ్ ఏజెంట్లు, ఓటర్లపై దాడి చేస్తున్నా పట్టించుకోలేదు. వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉన్న గ్రామాల్లో పదుల సంఖ్యలో పోలీసులు, ఆర్మ్‌డ్ సిబ్బంది నియమించి టీడీపీ రిగ్గింగ్ చేసే గ్రామాల్లో మాత్రం ఒకరిద్దరు సిబ్బందితోనే సరిపెట్టారు.
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వగ్రామం కుంకులగుంటలో డీఎస్పీ స్థాయి అధికారి అక్కడే ఉండి టీడీపీ ఏజెంట్లకు రక్షణ కల్పించారు. మాచర్ల చుట్టుపక్కలే ఉన్న ఐజీ, ఎస్పీ స్థాయి అధికారులు వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులను నిలవరించలేకపోయారు. పోలింగ్ రెండు మూడు రోజుల ముందు టీడీపీ అరాచకాలను అడ్డుకుంటారని భావించిన పలువురు సీఐ, ఎస్‌ఐలను అక్కడి నుంచి బదిలీ చేయించారు. దీంతో టీడీపీ మూకలకు మరింత స్వేచ్ఛనిచ్చినట్టయింది. పోలింగ్‌కు ముందు 48 గంటల నుంచి జిల్లాలో ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఉండటానికి వీల్లేదు.
అయితే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ రౌడీలు, బౌన్సర్లు ఉన్నా పోలీసుశాఖ వారిని చూసిచూడనట్టు వదిలేసింది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు తమ కార్యకర్తల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని పలుమార్లు జిల్లా ఎస్పీ, కలెక్టర్‌లకు విన్నవించుకొన్నా సరిగా స్పందించలేదని వాపోతున్నారు. తాను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎస్పీ బిందుమాధవ్ స్పందించలేదని వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్‌కుమార్ యాదవ్ మీడియాతో వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment