బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే అబ్రహం..? | Sakshi
Sakshi News home page

బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే అబ్రహం..?

Published Thu, Apr 18 2024 10:25 AM

- - Sakshi

అలంపూర్‌: మాజీ ఎమ్మెల్యే అబ్రహం బీజేపీలో చేరుతున్నారనే పోస్టులు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈమేరకు బీజేపీ రాష్ట్ర పెద్దలు ఆయనకు ఫోన్‌ చేసి సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. బీఆర్‌ఎస్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న తనను కాదని మరొకరికి టికెట్‌ కేటాయించడంతో అసంతృప్తికి గురైన ఆయన అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరి అందరికి అశ్చర్యానికి గురి చేశారు. తాజాగా బీజేపీలో చేరుతున్నారనే వార్తలకుతోడు ఎంపీ పోతుగంటి రాములుతో ఉన్న ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయమై ఆయన సన్నిహితులను ఆరా తీయగా.. పార్టీ మార్పు వార్తల్లో నిజం లేదని, కావాలని కొందరు పాత ఫోటోలను పోస్టు చేస్తున్నారని తెలిపారు. నోటిఫికేషన్‌ వెలువడనున్న ఈ తరుణంలో పార్టీల మార్పు అంశం ఏ మేరకు ఉంటుందో వేచి చూడాలి.

అలరించినవసంత కవితోత్సవం

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: శ్రీరామ నవమిని పురస్కరించుకొని తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక భారత్‌ స్కౌట్స్‌, గైడ్స్‌ భవనంలో వసంత కవితోత్సవం నిర్వహించారు. ఈకార్యక్రమానికి అవధాని చుక్కాయపల్లి శ్రీదేవి అధ్యక్షత వహించగా.. ప్రముఖ వక్త డా.పొద్దుటూరి ఎల్లారెడ్డి మాట్లాడారు. పితృవాక్య పాలకుడైన శ్రీరాముడి జగత్‌ ప్రసిద్ధమైన కల్యాణాన్ని వీక్షిస్తే, మంచి ఫలితం ఉంటుందన్నారు. రామాయణం అనేది కుటుంబ బంధమని అన్నారు. ప్రవచనకర్త డా.పల్లెర్ల రామ్మోహనరావు మాట్లాడుతూ రామాయణాన్ని మించిన వ్యక్తిత్వ వికాస గ్రంథం ప్రపంచంలో మరొకటి లేదన్నారు. రామనామస్మరణలో గొప్ప శక్తి దాగి ఉందని.. మానవాళి అనుసరించాల్సిన ఎన్నో విషయాలు రామాయణంలో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు రావూరి వనజ, జి.శాంతారెడ్డి సమన్వయ కర్తలుగా వ్యవహరించగా.. కవులు బాదేపల్లి వెంకటయ్య, లక్ష్మణ్‌గౌడ్‌, గుముడాల చక్రవర్తి గౌడ్‌, జగపతిరావు, వెంకటేశ్వర్‌రావు, కమలేకర్‌ శ్యాంప్రసాద్‌రావు, అనురాధ, పులి జమున, సుజాత, రజని, మధుసూదన్‌ జోషి, మహేష్‌, రమేశ్‌, బసవ రాజప్ప, ప్రాణేష్‌, కృష్ణకుమార్‌ తదితరులు కవితలు వినిపించి ఆకట్టుకున్నారు.

నేటినుంచి యథావిధిగా మార్కెట్‌ లావాదేవీలు

దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం సెలవు దినం కావడంతో వారానికి ఒక సారి జరిగే ఉల్లి వేలం జరగకపోవడంతో పాటు ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. గురువారం నుంచి మార్కెట్‌లో యథావిధిగా లావాదేవీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

సివిల్స్‌ ర్యాంకర్‌ అనన్యరెడ్డికి సన్మానం

అడ్డాకుల: యూపీఎస్సీ ఫలితాల్లో జాతీయస్థాయి మూడవ ర్యాంక్‌ సాధించిన పొన్నకల్‌ గ్రామవాసి దోనూరు అనన్యరెడ్డిని బుధవారం హైదరాబాద్‌లో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి శాలువాతో సత్కరించి అభినందించారు. జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించి, పాలమూరు జిల్లాకే కాకుండా రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. మహిమూద్‌, విజయకుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement