ఉపాధి అడుగులు.. పారిశ్రామిక పరుగులు | Sakshi
Sakshi News home page

ఉపాధి అడుగులు.. పారిశ్రామిక పరుగులు

Published Thu, May 9 2024 8:55 AM

ఉపాధి

పిఠాపురం: ఉపాధి అవకాశాలు మెరుగు పడితేనే ఏ ప్రాంతమైనా అభివృద్ధి సాధిస్తుందని గట్టిగా నమ్మిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న పారదర్శక, వేగవంతమైన పారిశ్రామిక విధానాల కారణంగా కాకినాడ జిల్లా తీర ప్రాంతంలో పరిశ్రమలు పరుగులు పెడుతున్నాయి. తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న పారిశ్రామిక విధానాలతో కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (కేఎస్‌ఈజెడ్‌) పెట్టుబడులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 6,440 ఎకరాల్లో విస్తరించి ఉన్న కేఎస్‌ఈజెడ్‌కు రోడ్డు, రైలు, నౌకాయాన మార్గాల నిర్మాణం చురుగ్గా జరుగుతోంది. ఇప్పటికే పలు రొయ్యల శుద్ధి కర్మాగారాలు నెలకొల్పడంతో వేలాది మంది యువతకు, మహిళలకు ఉపాధి కలిగింది.

నాడు బొమ్మలాట

నాటి టీడీపీ హయాంలో సుమారు 12 ఏళ్ల పాటు రైతుల నుంచి సేకరించిన భూములను ఖాళీగా వదిలేశారు. ఊళ్లకు ఊళ్లను ఖాళీ చేయించి పునరావాస కాలనీకి తరలించి చేతులు దులుపుకున్నారు. ఆర్భాటంగా చైనాకు చెందిన ఒక కంపెనీతో బొమ్మల ఫ్యాక్టరీ ఒకటి పెట్టి పారిశ్రామికీకరణ అంటూ బాకాలు ఊదారు. తీరా చూస్తే అది కొంత కాలంలోనే మూత పడింది. అది తప్ప ఎస్‌ఈజెడ్‌లో ఏ ఒక్క పరిశ్రమ రాకుండా పోయింది. అటు భూములు కోల్పోయిన రైతులను నట్టేటముంచి ఇటు ఎటువంటి పరిశ్రమలు రాకుండా యువతకు ఉపాధి లేకుండా చేసిన ఘనత ఒక్క టీడీపీకే చెందుతుంది.

నేడు పారిశ్రామిక బాట

2019 ఎన్నికలకు ముందు ప్రజా సంకల్పయాత్రలో జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్థానికుల విన్నపం మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే సెజ్‌లో పారిశ్రామికీకరణ వేగవంతం చేస్తానని, ఉపాధి అవకాశాలు మెరుగు పరుస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఒక పక్క సెజ్‌ రైతుల సమస్యను తీర్చడంతో పాటు మరో పక్క అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి పరిశ్రమల స్థాపనకు విశేష కృషి చేశారు. దాని ఫలితంగా కేవలం నాలుగేళ్లలోనే సెజ్‌ ప్రాంతం పరిశ్రమలతో కళకళలాడుతోంది. ఇప్పటికే ఇక్కడ 10 వరకు రొయ్య శుద్ధి కర్మాగారాలు నెలకొల్పడంతో సుమారు 10 వేల మంది మహిళలకు ఉపాధి కలిగింది. రోడ్డు, రైలు, పోర్టు సౌకర్యాలు ఉండడంతో పారిశ్రామిక వేత్తలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. పక్కనే తీర ప్రాంతం ఉండడంతో విదేశీ ఎగుమతులకు అనువుగా ఉంది. దీనికితోడు ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో ఇక్కడ పరిశ్రమలు పరుగులు పెడుతున్నాయి.

● 6,440 ఎకరాల్లో అరబిందో

కాకినాడ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌

● పారదర్శక విధానాలతో

పెరిగిన పెట్టుబడులు

● రెండు వేల ఎకరాల్లో బల్క్‌ డ్రగ్‌ పార్కు

● రూ.2,500 కోట్ల వ్యయంతో

శరవేగంగా గ్రీన్‌ ఫీల్డు పోర్టు నిర్మాణం

● 410 ఎకరాల విస్తీర్ణంలో

రూ.4 వేల కోట్లతో పెన్సిలిన్‌,

క్యూలే ఔషధాల తయారీ పరిశ్రమలు

● కాకినాడ నుంచి అన్నవరం వరకు

రూ.1,480 కోట్ల వ్యయంతో

భారత్‌మాల రోడ్డు మార్గం

● రూ.260 కోట్లతో అన్నవరం నుంచి

కాకినాడకు 15 కిలోమీటర్ల

ప్రత్యేక రైల్వే లైన్‌

● ఉప్పునీటి నుంచి మంచినీటిని

తయారు చేసే డిశాలినేషన్‌

వాటర్‌ ప్లాంట్‌ నిర్మాణం

● రూ.359 కోట్లతో 64 ఎకరాల్లో

400 కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణం

● పలు రొయ్య శుద్ధి కర్మాగారాలు

● ప్రస్తుతం ఉపాధి పొందుతున్న

కుటుంబాలు 10 వేలు

15 ఏళ్ల తరువాత తీరంలో

పారిశ్రామికీకరణ

కేఎస్‌ఈజెడ్‌లో వేలాది మందికి ఉపాధి

అభివృద్ధి బాటలో తీర ప్రాంత గ్రామాలు

పరిశ్రమల ప్రగతికి వీలుగా

సూపర్‌ కనెక్టివిటీ

రోడ్డు, రైలు, నౌకాయాన మార్గాల నిర్మాణం

బారులు తీరుతున్న పారిశ్రామిక వేత్తలు

వలస అనే ఊసు లేకుండా చేశారు

నా పేరు బండి రాణి. మాది కొత్తపల్లి మండలం పొన్నాడ శివారు శీలంవారిపాలెం. నేను పొన్నాడ సర్పంచ్‌గా పని చేస్తున్నాను. మా పంచాయతీలో 19 శివారు గ్రామాలు ఉన్నాయి. వాటిలో కొన్ని సెజ్‌ భూసేకరణలో ఖాళీ చేసేశారు. మా గ్రామాల్లో వ్యవసాయ పనులు తప్ప వేరే ఉపాధిఉండేది కాదు. తీర ప్రాంతం కావడం వల్ల వ్యవసాయ పనులు కేవలం సీజన్‌లోనే ఉండేవి. దీంతో కేవలం మగవారు తప్ప ఆడవారికి ఉపాధి అనేది ఉండేది కాదు. ఉన్న భూములు సెజ్‌కు ఇవ్వడం వల్ల ఎస్‌ఈజెడ్‌ వచ్చినా ఒక్క పరిశ్రమ రాక నిరాశతో ఉండేవాళ్లం. ఉపాధి కోసం వలసలు వెళ్లాల్సి వచ్చేది. కాని సీఎం వైఎస్‌ జగన్‌ వచ్చాక సెజ్‌లో పరిశ్రమలు వచ్చేశాయి. మా గ్రామాల్లో మహిళలతో పాటు ఇతర ప్రాంతాల మహిళలకు ఉపాధి కలిగింది. ఇంటి పక్కనే పరిశ్రమలు రావడంతో మా గ్రామాల్లో మహిళలు ఇంటి, వంట పనితో పాటు ఉపాధి పొంది చేతి నిండా సంపాదించుకోవడం వల్ల వలసలు వెళ్లే పని లేకుండా పోయింది. గత టీడీపీ హయాంలో ఏవిధమైన ఆసరా లేక అల్లాడిన మా ప్రాంతం ప్రజలు ఇప్పుడు సుభిక్షంగా ఉంటున్నారు అంటే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పారిశ్రామికీకరణ వల్లే అని బల్లగుద్ది చెబుతాం.

– బండి రాణి, సర్పంచ్‌ పొన్నాడ, కొత్తపల్లి మండలం

ఉపాధి నిచ్చే పరిశ్రమలే పెడుతున్నారు

నా పేరు కంబాల మౌనిక. మాది కొత్తపల్లి మండలం మూలపేట. నేను మూలపేట గ్రామ సర్పంచ్‌గా పని చేస్తున్నాను. మా గ్రామస్తులు వ్యవసాయంతో పాటు చేపల వేట మీద ఆధారపడి బతుకుతారు. సెజ్‌ భూసేకరణ తరువాత మా గ్రామాల్లో ఉపాధి లేకుండా పోయింది. టీడీపీ హయాంలో భూములు తీసుకున్నారు తప్ప ఏ ఒక్క పరిశ్రమ స్థాపించలేక పోయారు. ఏళ్ల తరబడి భూములు ఖాళీగా వదిలేశారు. దీంతో మత్స్యకార కుటుంబాలు వలసలకు పోవాల్సి వచ్చేది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇక్కడ పరిశ్రమల స్థాపన ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఏ పరిశ్రమ పెట్టినా వేలాది మందికి ఉపాధి కలిగేలా చూస్తున్నారు. మా గ్రామాల్లో ప్రజలకు చేతి నిండా పని దొరికింది. ఏ మత్స్యకార కుటుంబం వలస వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ఇంత మార్పు వస్తుందని అనుకోలేదు. ఇది కేవలం జగన్‌ వల్లే సాధ్యమైందని ఘంటాపథంగా బెబుతాం.

– కంబాల మౌనిక, సర్పంచ్‌, మూలపేట, కొత్తపల్లి మండలం

ఉపాధి అడుగులు.. పారిశ్రామిక పరుగులు
1/5

ఉపాధి అడుగులు.. పారిశ్రామిక పరుగులు

ఉపాధి అడుగులు.. పారిశ్రామిక పరుగులు
2/5

ఉపాధి అడుగులు.. పారిశ్రామిక పరుగులు

ఉపాధి అడుగులు.. పారిశ్రామిక పరుగులు
3/5

ఉపాధి అడుగులు.. పారిశ్రామిక పరుగులు

ఉపాధి అడుగులు.. పారిశ్రామిక పరుగులు
4/5

ఉపాధి అడుగులు.. పారిశ్రామిక పరుగులు

ఉపాధి అడుగులు.. పారిశ్రామిక పరుగులు
5/5

ఉపాధి అడుగులు.. పారిశ్రామిక పరుగులు

Advertisement
 
Advertisement
 
Advertisement