జూన్ 5 నుంచి 11 మధ్య రాష్ట్రమంతటా విస్తరించే అవకాశం
ఈలోగా మరింతగా దంచికొట్టనున్న ఎండలు
మూడు రోజులపాటు రాష్ట్రంలో తీవ్రం కానున్న ఉష్ణోగ్రతలు.. ఈ సీజన్‌లోనే అత్యధికంగా
మంచిర్యాల జిల్లా భీమారంలో గురువారం 47.2 డిగ్రీల సెల్సియస్ నమోదు
సాక్షి, హైదరాబాద్: కేరళలోకి గురువారం ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు క్రమంగా ముందుకు సాగుతూ జూన్ 5 నుంచి 11 మధ్య తెలంగాణలోకి ప్రవేశించి విస్తరించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈలోగా పగటి ఉష్ణోగ్రతలు మరికొంత పెరగొచ్చని పేర్కొన్నారు. శుక్ర, శని, ఆదివారాల్లో ఎండలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని వివరించారు. ప్రస్తుతం పశ్చిమ, వాయవ్య దిశల నుంచి వడగాడ్పులు వీస్తుండటంతో గురువారం రాష్ట్రంలో చాలాచోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మంచిర్యాల జిల్లా భీమారంలో అత్యధికంగా 47.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతగా నమోదైంది. ఇప్పటివరకు ఈ వేసవిలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత కావడం గమనార్హం. అలాగే భద్రాద్రి కొత్తగుడెం జిల్లా గరిమెల్లపాడులో 47.1 డిగ్రీల సెల్సియస్, కమాన్‌పూర్‌లో 46.7, కుంచవల్లిలో 46.6, కాగజ్‌నగర్, పమ్మిలో 46.5, పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 46.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగత నమోదైంది. చాలాచోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే ఖమ్మంలో 44.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయింది.
Comments
Please login to add a commentAdd a comment