ఇంకా ఉత్కంఠే.. నీటి మట్టం 60 అడుగుల వరకూ.. | Sakshi
Sakshi News home page

ఇంకా ఉత్కంఠే.. నీటి మట్టం 60 అడుగుల వరకూ..

Published Sun, Jul 30 2023 1:00 AM

- - Sakshi

ఖమ్మం: గోదావరి నదికి వరద ప్రవాహం పెరుగుతుండడంతో తీర ప్రాంత వాసుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. స్థానికంగా వర్షాలు తగ్గినా ఎగువ నుంచి వరద వస్తుండడంతో గోదావరి శాంతించడం లేదు. అయితే అంతే స్థాయిలో వరద దిగువకు వెళుతుండడంతో భద్రాచలం వద్ద నీటిమట్టం నెమ్మదిగా పెరుగుతోంది.

వరద తీవ్రత, తీసుకోవాల్సిన చర్యల గురించి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, కలెక్టర్‌ ప్రియాంక ఆల ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఐఏఎస్‌ అధికారి దురిశెట్టి అనుదీప్‌, ఎస్పీ డాక్టర్‌ జి.వినీత్‌, ఏఎస్పీ పరితోశ్‌ పంకజ్‌, ఐటీడీఏ పీఓ ప్రతీక్‌ జైన్‌ తదితరులు సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.

నేడూ వరద పోటు..

శనివారం రాత్రి 12 గంటల సమయంలో భద్రాచలం వద్ద గోదావరి 15,96,899 క్యూసెక్యుల నీటి ప్రవాహం దిగువకు వెళుతుండగా నీటి మట్టం 56.10 అడుగులుగా ఉంది. గోదావరికి ఎగువ ప్రాంతాన ఉన్న సమ్మక్క బ్యారేజీ వద్ద నీటిమట్టం శనివారం రాత్రి 9 గంటలకు 13 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది.

సమ్మక్క బ్యారేజీ భద్రాచలనికి ఎగువన 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ శనివారం మధ్యాహ్నం వదిలిన గరిష్ట వరద భద్రాచలం చేరేందుకు 24 గంటల సమయం పడుతుంది. దీంతో ఆదివారం మధ్యాహ్నం వరకు వరద పోటు కొనసాగే అవకాశం ఉంది.

గరిష్ట వరద భద్రాచలం చేరుకునే సమయానికి నీటి మట్టం 60 అడుగుల వరకు చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి భద్రాచలం దగ్గర నీటి మట్టం 53 అడుగుల దిగువకు తగ్గి, ఎగువ నుంచి వరద రాకుంటే పునరావాస శిబిరాల నుంచి ఇళ్లకు వెళ్లేందుకు ముంపు బాధితులకు అనుమతి ఇస్తామని అధికారులు చెబుతున్నారు.

Advertisement
Advertisement