Police Commemoration Day: ఉగ్రవాదమే అతిపెద్ద హక్కుల ఉల్లంఘన | Sakshi
Sakshi News home page

Police Commemoration Day: ఉగ్రవాదమే అతిపెద్ద హక్కుల ఉల్లంఘన

Published Sat, Oct 22 2022 5:55 AM

Interpol General Assembly: Terrorism is biggest violation of human rights - Sakshi

న్యూఢిల్లీ: ఉగ్రవాదమే అతిపెద్ద మానవ హక్కుల ఉల్లంఘన అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నొక్కి చెప్పారు. విదేశీ గడ్డ నుంచి ఆన్‌లైన్‌ ద్వారా జరిగే ఉగ్ర భావజాల ప్రచారాన్ని రాజకీయ సమస్యగా గుర్తించలేమని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం అమిత్‌ షా 90వ ఇంటర్‌పోల్‌ జనరల్‌ అసెంబ్లీ ముగింపు సమావేశంలో ప్రసంగించారు. ‘ఉగ్రవాదం, ఉగ్రవాదులకు సంబంధించిన స్పష్టమైన ఉమ్మడి నిర్వచనం ఇచ్చేందుకు అన్ని దేశాలు కలిసి రావాలి. అలా జరిగినప్పుడే ఉగ్రవాదులపైనా, ఉగ్రవాదంపైన అంతర్జాతీయంగా కలిసికట్టుగా పోరాడగలం.

ఉగ్రవాదంపై చిత్తశుద్ధితో పోరాటం సాగించడం, మంచి, చెడు ఉగ్రవాదాల మధ్య తేడాను గుర్తించడం, ఉగ్ర దాడులను చిన్నవి, పెద్దవి అంటూ వర్గీకరించడం ముందుగా జరగాలి’అని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా సాగే ఉగ్రవాద సిద్ధాంతాల ప్రచారాన్ని రాజకీయ సమస్యగా భావించలేమంటూ ఆయన...ఉగ్రవాదంపై దీర్ఘకాలంలో నిబద్ధత, సమగ్రతతో కూడిన పోరాటం సాగించేందుకు కట్టుబడి ఉండాలన్నారు. ‘చాలా దేశాల్లో ఇంటర్‌పోల్‌ ఏజెన్సీ, ఉగ్రవాద వ్యతిరేక సంస్థలు వేర్వేరుగా ఉంటున్నాయి.

ఈ పరిస్థితుల్లో ఉగ్రవాదంపై పోరాటం కొనసాగాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉగ్రవాద వ్యతిరేక సంస్థలన్నీ ఏకతాటిపైకి రావాలి’అని అమిత్‌ షా అభిప్రాయ పడ్డారు. దీనికోసం ఇంటర్‌పోల్‌ శాశ్వత కమ్యూనికేషన్‌ వ్యవస్థ ద్వారా నిఘా సమాచారాన్ని సభ్య దేశాలతో పంచుకుంటూ ఉండాలన్నారు. అంతర్జాతీయ ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్‌ అవసరమైన సాంకేతిక, మానవ వనరులను ఇంటర్‌పోల్‌తో పంచుకుంటుందని హామీ ఇచ్చారు. కాగా, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు  ప్రపంచ దేశాల మధ్య ఉమ్మడి, పరస్పర సహకారం అవసరమని సీబీఐ డైరెక్టర్‌ సుబోధ్‌ జైశ్వాల్‌ అన్నారు.

జాతి వ్యతిరేక కార్యకలాపాలు తగ్గుముఖం
దేశంలో జాతి వ్యతిరేక కార్యకలాపాలకు హాట్‌స్పాట్లుగా పేరున్న చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడ్డాయని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. అశాంతికి నెలవైన ఈశాన్య రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు నేడు 70% వరకు తగ్గుముఖం పట్టాయన్నారు. నక్సల్‌ ప్రభావిత ప్రాంతాలతోపాటు జమ్మూకశ్మీర్‌లోనూ భద్రతాపరంగా ఇదే రకమైన పురోగతి కనిపిస్తోందని పేర్కొన్నారు. పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

Advertisement
 
Advertisement