Lok Sabha Election 2024: బీజేపీ అభ్యర్థుల్లో... నాలుగోవంతు ఫిరాయింపుదారులే | Lok Sabha Election 2024: Nearly a quarter of BJP candidates are defectors | Sakshi
Sakshi News home page

Lok Sabha Election 2024: బీజేపీ అభ్యర్థుల్లో... నాలుగోవంతు ఫిరాయింపుదారులే

Published Tue, May 21 2024 3:47 AM | Last Updated on Tue, May 21 2024 3:47 AM

Lok Sabha Election 2024: Nearly a quarter of BJP candidates are defectors

దేశవ్యాప్తంగా 435 స్థానాల్లో బీజేపీ పోటీ

వారిలో ఏకంగా 106 మంది వలస పక్షులే 

నేతలు పార్టీలు మారడం, సిద్ధాంతాలు మార్చుకోవడం రాజకీయాల్లో పరిపాటే. చాలా ఏళ్లుగా ఉన్న ధోరణే. కానీ సిద్ధాంతాలు, విలువలకు పెద్దపీట వేస్తామని చెప్పుకునే బీజేపీ కొన్నాళ్లుగా ఫిరాయింపు నేతలకు పెద్దపీట వేస్తుండటం విశేషం. 

ఈ లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బరిలో ఉన్న 435 మంది బీజేపీ అభ్యర్థులను గమనిస్తే ఆశ్చర్యకరమైన వివరాలు తెలుస్తాయి. వీరిలో ఏకంగా 106 మంది, అంటే నాలుగో వంతు అభ్యర్థులు గత పదేళ్లలో కమలం గూటికి వలస వచి్చనవాళ్లే! అందులోనూ 90 మంది గత ఐదేళ్లలో బీజేపీలోకి ఫిరాయించారు! 

ఈసారి ఎలాగైనా 2019 కంటే ఎక్కువ లోక్‌సభ స్థానాలు సాధించాలని అధికార బీజేపీ ప్రయతి్నస్తోంది. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తోంది. ప్రాంతీయ పారీ్టల్లో టికెట్లు రాని వారు, మోదీ మేనియా కలిసొస్తుందని భావించిన వాళ్లు ఎన్నికల ముందే బీజేపీలో చేరారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఆరు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయగా వారిలో ఏకంగా ఐదుగురు 2019 తర్వాతే పార్టీ తీర్థం తీసుకోవడం విశేషం! తెలంగాణలోనూ 17 మంది బీజేపీ అభ్యర్థుల్లో 11 మంది 2014 తర్వాత వచ్చి చేరిన వారే. వీరిలో చాలామంది మాజీ కాంగ్రెస్, టీడీపీ, బీఆర్‌ఎస్‌ నేతలే. 

ఇతర రాష్ట్రాల్లోనూ అంతే.. 
ఏపీ వంటి చోట్ల బీజేపీ బలహీనంగా ఉంది గనుక వలస నేతలకు పెద్దపీట వేసిందనుకుంటే పార్టీ అత్యంత బలోపేతంగా ఉన్న యూపీ, హరియాణా తదితర చోట్లా ఇదే బాట పట్టడం ఆశ్చర్యం కలిగించేదే! హరియాణాలోని 10 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ తరఫున బరిలో ఉన్నవారిలో ఆరుగురు 2014 తర్వాత పారీ్టలో చేరినవారే. ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్‌ జిందాల్‌ అయితే లోక్‌సభ ఎన్నికల ముందే బీజేపీ కండువా కప్పుకున్నారు.

 పీసీసీ మాజీ చీఫ్‌ అశోక్‌ తన్వర్‌ కూడా అంతే. ఇక యూపీలో బీజేపీ సొంతంగా పోటీ చేస్తున్న 74 లోక్‌సభ స్థానాలను చూస్తే 23 చోట్ల బరిలో ఉన్నవాళ్లు బయటి నుంచి వచి్చనవారే. అంటే ఏకంగా 31 శాతం! పంజాబ్‌లోని 13 స్థానాల్లో ఏకంగా ఏడుగురు బీజేపీ అభ్యర్థులు వలస వచి్చన బాపతే. వీరిలో చాలామంది కాంగ్రెస్‌ మాజీలే. వీరు చాలావరకు మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌ తన పార్టీని బీజేపీలో విలీనం చేసినప్పుడు బీజేపీలోకి వచ్చారు. 

జార్ఖండ్‌లో కూడా 13 మంది బీజేపీ అభ్యర్థుల్లో ఏడుగురు జేఎంఎం, కాంగ్రెస్, జార్ఖండ్‌ వికాస్‌ మోర్చాల నుంచి జంప్‌ చేసిన నేతలే. వీరిలో మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ మరదలు సీతా సోరెన్‌ కూడా ఉన్నారు. ఒడిశాలో 29 శాతం, తమిళనాడులో 26 శాతం మంది బీజేపీ అభ్యర్థులు ఫిరాయింపుదారులే! మహారాష్ట్రలోనూ పావు వంతు బీజేపీ అభ్యర్థులు బయటి నుంచి వచ్చిన బాపతే. 

ఎందుకని..? 
బీజేపీ బలహీనంగా ఉన్న ఏపీ, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలే గాక బలంగా ఉన్నచోట కూడా ఇలా ఫిరాయింపులను భారీగా ప్రోత్సహిస్తుండటం వెనుక విజయమే పరమావధి అంటున్నారు. మరీ ముఖ్యంగా గత రెండు లోక్‌సభ ఎన్నికల నుంచి యూపీలో బీజేపీ హవా నడుస్తోంది. అయినా అక్కడ కూడా 31 శాతం మంది వలసదారులకు టికెట్లివ్వడం ఇందుకు నిదర్శనం. ప్రత్యర్థి పారీ్టలు బలమైన అభ్యర్థులను దింపిన చోట బీజేపీ ప్రధానంగా ఫిరాయింపుదారులనే నమ్ముకుంది. తనకు గెలుపు గుర్రాలు లేరనుకున్న లోక్‌సభ స్థానాల్లో ఇతర పారీ్టల నుంచి బలమైన నాయకులను ఆకర్షించేందుకు బీజేపీ ఏమాత్రం వెనుకాడటం లేదు!

ప్రముఖ జంపర్లు 
జ్యోతిరాదిత్య సింధియా (కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌ మాజీ నేత–గుణ) 
జితిన్‌ ప్రసాద (కాంగ్రెస్‌ మాజీ నేత–పిలిభీత్‌) 
నవీన్‌ జిందాల్‌ (ప్రముఖ పారిశ్రామికవేత్త–కురుక్షేత్ర) 
అశోక్‌ తన్వర్‌ (హరియాణా పీసీసీ మాజీ చీఫ్‌–సిర్సా) 
ప్రణీత్‌ కౌర్‌ (అమరీందర్‌సింగ్‌ భార్య–పటియాలా) 
సీతా సోరెన్‌ (జేఎంఎం ఎమ్మెల్యే–దుమ్కా)

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement