న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాజకీయపార్టీలు తమ వ్యూహప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి పోటీచేయబోయే అభ్యర్థుల రెండవ జాబితాను బీజేపీ విడుదల చేసింది.
ఈ జాబితాలో 29 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. కపిల్ మిశ్రా(Kapil Mishra)ను కరవాల్ నగర్ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. లక్ష్మీ నగర్ అసెంబ్లీ స్థానం నుండి అభయ్ వర్మను బరిలోకి దింపింది. వర్మ ఈ స్థానంలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. 70 మంది సభ్యుల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు 58 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించిన బీజేపీ 29 మంది అభ్యర్థులతో కూడిన రెండవ జాబితాను విడుదల చేసింది. కరవాల్ నగర్ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే మోహన్ సింగ్ బిష్ట్‌కు బీజేపీ టికెట్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో కపిల్ మిశ్రాను అభ్యర్థిగా ప్రకటించింది. మోతీనగర్ నుంచి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మదన్ లాల్ ఖురానా కుమారుడు హరీష్ ఖురానాను పార్టీ బరిలోకి దింపింది.
ఐదుగురు మహిళా అభ్యర్థులు
బీజేపీ ప్రకటించిన రెండవ జాబితాలో ఐదుగురు మహిళా అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. మొదటి జాబితాలో పార్టీ ఇద్దరు మహిళా అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చింది. ఇప్పటివరకు పార్టీ ఏడుగురు మహిళలకు టిక్కెట్లు ఇచ్చింది. పార్టీ నీలం కృష్ణ పెహల్వాన్‌ను నజాఫ్‌గఢ్ అభ్యర్థిగా ప్రకటించింది. ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party)కి చెందిన కైలాష్ గెహ్లాట్ ప్రస్తుతం నజాఫ్‌గఢ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. బీజేపీ ఆలయ సెల్ అధ్యక్షునిగా కర్నైల్ సింగ్‌కు పార్టీ షకుర్ బస్తీ టికెట్ ఇచ్చింది.
వివిధ స్థానాల నుంచి..
ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ నుండి బీజేపీలో చేరిన ప్రియాంక గౌతమ్‌ను ఆ పార్టీ కొండ్లి నుంచి పోటీకి దింపింది. దీనితో పాటు తిమార్‌పూర్ నుండి సూర్య ప్రకాష్ ఖత్రి, నరేలా నుండి రాజ్ కరణ్ ఖత్రి, కిరాడి నుండి బజరంగ్ శుక్లా, చాందినీ చౌక్ నుండి సతీష్ జైన్, సుల్తాన్‌పూర్ మజ్రా (ఎస్‌సీ) నుండి కరం సింగ్ కర్మ, ముండ్కా నుండి గజేంద్ర దరాల్, సదర్ బజార్ నుండి మనోజ్ కుమార్ జిందాల్‌లను అభ్యర్థులుగా ప్రకటించింది. ఉత్తమ్ నగర్ నుండి పవన్ శర్మ, వికాస్పూర్ నుండి పంకజ్ కుమార్ సింగ్, కస్తూర్బా నగర్ నుండి నీరజ్ బసోయా, మటియాలా నుండి సందీప్ సెహ్రావత్, ద్వారక నుండి ప్రద్యుమాన్ రాజ్పుత్, పాలం నుండి కుల్దీప్ సోలంకి, రాజిందర్ నగర్ నుండి ఉమాంగ్ బజాజ్, తుగ్లకాబాద్ నుండి రోహ్తాస్ బిధురి, సీలంపూర్ నుండి మనీష్ చౌదరిలను ఎన్నికల్లో పోటీకి నిలిపింది. మొదటి జాబితాలో కూడా 29 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
ఫిబ్రవరి 5న ఒకే దశలో ఎన్నికలు
ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల కమిషన్ ఎన్నికల తేదీలను ప్రకటించింది. ఫిబ్రవరి 5న ఢిల్లీలో ఒకే దశలో ఎన్నికలు నిర్వహించి, ఫిబ్రవరి 8న ఫలితాలు ప్రకటిస్తారు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో 71.74 లక్షల మంది మహిళా ఓటర్లు, 25.89 లక్షల మంది యువ ఓటర్లు ఉన్నారు. మొదటిసారి ఓటు వేయబోయే మొత్తం ఓటర్ల సంఖ్య 2.08 లక్షలు. ఢిల్లీ ఎన్నికల నిర్వహణకు 13 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 100 ఏళ్లు పైబడిన ఓటర్ల సంఖ్య 830గా ఉంది.
ఇది కూడా చదవండి: ఢిల్లీకి రూ. 2,026 కోట్ల నష్టం
Comments
Please login to add a commentAdd a comment