విద్యుత్ జీరో బిల్లుకు అర్హత సాధించినా గ్యాస్ సబ్సిడీ వర్తించని పరిస్థితి
గ్యాస్ ఏజెన్సీలకు సైతం స్పష్టత కరువు
బీపీఎల్ వినియోగదారులపై భారం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా అమలు చేస్తున్న రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం కొందరికే పరిమితమైంది. తెల్లరేషన్ కార్డు కలిగి విద్యుత్ జీరో బిల్లుకు అర్హత సాధించినా.. వంటగ్యాస్ సబ్సిడీ మాత్రం వర్తించని పరిస్థితి నెలకొంది. దీంతో నిరుపేదలకు ఎప్పటి మాదిరిగా వంటగ్యాస్ ధర భారంగా తయారైంది. మూడు నెలల క్రితమే మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ. 500 గ్యాస్ సిలిండర్ పథకం అమలు ప్రారంభమైంది.
ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తుల ఆధారంగా బీపీఎల్ కుటుంబాలను అర్హులుగా గుర్తించి జీరో బిల్లు, వంటగ్యాస్ సబ్సిడీకి లబి్ధదారులుగా ఎంపిక చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెండు పథకాలకు కూడా తెల్లరేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకున్నారు. వాస్తవంగా మహా నగరంలో సుమారు 17.21 లక్షల కుటుంబాలు తెల్లరేషన్‌కార్డులు కలిగి ఉండగా అందులో సుమారు 11 లక్షల కుటుంబాలకు మాత్రమే విద్యుత్ జీరో బిల్లు వర్తించింది. రూ.500కు వంట గ్యాస్ మాత్రం అందులో కేవలం రెండు లక్షల కుటుంబాలకు మాత్రమే వర్తిస్తోంది. గ్యారంటీ పథకాల కింద బీపీఎల్‌గా అర్హత సాధించినా సబ్సిడీ వర్తించకపోవడంతో పేదలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రూ.855కు సిలిండర్..
మహా నగరంలో బహిరంగ మార్కెట్ ప్రకారం‡ ప్రస్తుతం 14.5 కేజీల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.855 పలుకుతోంది. గృహ వినియోగదారులు సిలిండర్ ధరను పూర్తిగా చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చమురు సంస్థల ద్వారా సబ్సిడీని నగదు బదిలీ కింద వినియోగదారుల ఖతాలో జమచేస్తూ వస్తోంది. తాజాగా ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా అర్హత సాధించిన వంట గ్యాస్ లబ్ధిదారులకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సిలిండర్ ధరలో రూ.500 మినహాయించి మిగిలిన సొమ్మును నగదు బదిలీ ద్వారా వినియోగదారులు ఖాతాలో చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ అందరికి వర్తిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ మాత్రం కొందరికే పరిమితమైంది.
కేంద్రం సబ్సిడీ రూ. 40.71 మాత్రమే
కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సబ్సిడీని పరిమితం చేసింది. సిలిండర్ ధర ఎంత పలికినా.. సబ్సిడీ సొమ్ము మాత్రం రూ.40.71లు మాత్రమే వినియోగదారుడి ఖాతాలో జమ చేస్తోంది. పదేళ్ల క్రితం వరకు సబ్సిడీపై రూ.414కు మాత్రమే వంట గ్యాస్ ధర సరఫరా జరిగేది. మిగతా ధరను కేంద్ర ప్రభుత్వం ముందస్తుగానే భరించేది. ఆ తర్వాత వంట గ్యాస్‌కు నగదు బదిలీ పథకం వర్తింపుజేయడంతో బహిరంగ మార్కెట్ ధర ప్రకారం సిలిండర్ సరఫరా చేసి ఆ తర్వాత సబ్సిడీ నగదు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తూ వచ్చారు.
2015లో సిలిండర్‌ను మార్కెట్ ధర ప్రకారం రూ. 697కు కొనుగోలు చేస్తే సబ్సిడీగా రూ.239.65 నగదు బదిలీ ద్వారా వినియోగదారుడి బ్యాంక్ ఖాతాలో జమ అయ్యేది. బహిరంగ మార్కెట్‌లో సిలిండర్ ధర పెరిగిన దానిని బట్టి సబ్సిడీ నగదు కూడా పెరిగేది. ఆ తర్వాత క్రమంగా సబ్సిడీ ఎత్తివేతలో భాగంగా పరిమితి విధించారు. ప్రస్తుతం ధర ఎంత ఉన్నా.. సబ్సిడీ మాత్రం ఒక స్లాబ్‌కు పరిమితమైంది.
వంటగ్యాస్ కనెక్షన్లు ఇలా
హైదరాబాద్ జిల్లా 13.22లక్షలు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా 15.96 లక్షలు
Comments
Please login to add a commentAdd a comment