దేశ రాజధానిలో కొబ్బరి మామిడి రాజసం
కొత్తపల్లి నుంచి ఢిల్లీ వరకూ.. పసందైన పండూరు మామిడి
అతి మధుర ఫలాలకు మంచి గిరాకీ
పిఠాపురం: మామిడిలో రారాజుగా పేరొందిన కొత్తపల్లి కొబ్బరి మామిడికి ఎక్కడాలేని గిరాకీ పలుకుతోంది. మామిడి ప్రియుల మనసు దోచుకున్న ఒకే ఒక్క మధుర ఫలం ఇది. రుచిలో అతి మధురంగా ఉండడంతో ఈ మామిడి పండ్ల రేటు పైపైకి ఎగబాకి పండ్ల ప్రియులను ఊరిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే... మామిడిలో ఎన్నో రకాలున్నప్పటికీ వాటిలో గోదావరి జిల్లాల్లో మాత్రమే లభించే కొత్తపల్లి కొబ్బరి, పండూరు మామిడికి ఉన్న డిమాండ్ వేరు. మామిడి రకాల్లో ఈ రెండింటినీ హిడెన్ జెమ్స్గా భావిస్తారు. వీటి ప్రాముఖ్యతను గుర్తించి, సంరక్షించిన గ్రామాల పేరిటే ఇవి ప్రసిద్ధి చెందాయని ఆ ప్రాంతవాసులు అంటున్నారు.
ఉత్తమ లక్షణాలున్న పండ్లుగా ఇవి గుర్తింపు పొందడంతో రాజుల కాలం నుంచే వీటికి ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. పూర్వం ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన రాజులు తమ తోటల్లో వీటిని పెంచుకుని, ఆ రుచిని తాము ఆస్వాదించడంతోపాటు మిత్ర రాజులకు కానుకలుగా పంపేవారట. అందుకే ఒకప్పుడు రాజ సంస్థానాల్లో మాత్రమే ఈ పండ్లు ఉండేవని, సాధారణ ప్రజానీకానికి అందుబాటులో ఉండేవి కావనే ప్రచారం కూడా ఉంది.
ఇప్పటికీ ఈ రకం మామిడి పండ్లను తమ స్నేహితులకు, బంధువులకు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు బహుమతిగా పంపించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఏటా గోదావరి జిల్లాల నుంచి సుమారు 20 టన్నుల వరకూ కొత్తపల్లి కొబ్బరి, కాకినాడ రూరల్ మండలంలోని పండూరు మామిడి రకాలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఎక్కవ కాలం నిల్వ ఉండకపోవడంతో ప్రస్తుతం దూర ప్రాంతాలకు ఎగుమతులు జరగడం లేదని అంటున్నారు.
కొత్తపల్లి కొబ్బరి
గోదావరి జిల్లాల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన మామిడి రకాల్లో కొత్తపల్లి కొబ్బరిదే ప్రథమ స్థానం. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి ప్రాంతంలో లభించే అమోఘమైన రుచి కలిగిన మామిడి పండు ఇది. కొబ్బరి కాయలో మాదిరిగా పీచు అధికంగా ఉండటంతో ఈ రకాన్ని కొత్తపల్లి కొబ్బరిగా పిలుస్తారు. మేలిమి బంగారు రంగులో మెరిసిపోతూ సువాసనలు వెదజల్లుతుంటుంది. పూదోటలో మాదిరిగా ఈ రకం మామిడి పండ్లు ఉన్నచోట సువాసనలు వెదజల్లుతుంటాయి.
ఈ మామిడి పండులో కెరోటిన్, కాల్షియం, విటమిన్ ఎ, సి. ఎక్కువగా ఉంటాయి. తొక్క పలుచగా ఉండి సైజు చిన్నగా ఉంటుంది. పులుపు ఎక్కువగా ఉండటంతో పచ్చి మామిడి తినలేరు. కానీ పండు మాత్రం అతి మధురం. ఇవి మామిడి సీజన్‌లో మాత్రమే పండుతాయి. పీచు ఎక్కువగా ఉండటంతో ఆవకాయ, ఊరగాయలకు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ మామిడితో పెట్టిన ఊరగాయలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఈ చెట్ల కాపు తక్కువగా ఉంటుంది. పండు చిన్నదే కానీ ధర మాత్రం అదరగొడుతుంది.
పండూరు మామిడి
ఇది అత్యంత పురాతనమైన మామిడి రకం. ఈ చెట్టు వంద అడుగుల ఎత్తు వరకూ పెరిగి, నిండా కాయలుంటాయి. చూడటానికి పప్పులో వేసుకునే చిన్న మామిడి కాయల్లా మాత్రమే ఉంటాయి. పండ్లు కూడా ఆకుపచ్చగానే ఉండటం వీటి ప్రత్యేకత. తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని వెలగదూరు గ్రామ పరిసరాల్లోని సంస్థానంలో పూర్వం కొందరు దొంగలు మామిడి పండ్లను దొంగిలించి, తిని, వాటి టెంకలను కోట అవతల పారేశారని, వాటిని తీసి నాటగా వచి్చన చెట్టు ద్వారా ఈ పండ్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయనే కథనం ఒకటి ప్రచారంలో ఉంది.
దిగుబడి తగ్గి.. డిమాండ్ పెరిగి..
గత ఏడాదికంటే దిగుబడి తగ్గడంతో కొబ్బరి మామిడికి డిమాండ్ అమాంతం పెరిగింది. గత ఏడాది 100 కొబ్బరి మామిడి కాయలు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకూ విక్రయించగా ఈ ఏడాది రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకూ అమ్ముడవుతోంది. ముఖ్యంగా రాజకీయ నాయకులకు పంపడానికి స్థానిక నేతలు వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో సామాన్యులు కొని తినే అవకాశం లేకుండా పోయింది. గతంలో దిగుబడి ఎక్కువగా ఉండటంతో అందరికీ అందుబాటులో ఉండేవి.
కానీ ఈ ఏడాది కొబ్బరి మామిడి చెట్లు పూత రాలిపోయి తక్కువగా కాశాయి. దీంతో దిగుబడి చాలా తక్కువ వస్తోంది. కాయ సైజు కూడా చిన్నదిగా ఉంటోంది. ఎంత ఖరీదైనా కొనుగోలు చేయడానికి మామిడి ప్రియులు ఎగబడటంతో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకూ 2 టన్నుల కాయలు విక్రయించాం. మరికొద్ది రోజులు మాత్రమే ఇవి అందుబాటులో ఉంటాయి. – కండేపల్లి సురేన్, మామిడి వ్యాపారి, కొత్తపల్లి
వీటి గిరాకీ వేటికీ ఉండదు
కొత్తపల్లి కొబ్బరి రకానికి ఉన్న గిరాకీ మరే మామిడి పండుకూ ఉండదు. పీచు అధికంగా ఉండటంతో ఊరగాయలకు ఎక్కువగా వాడుతుంటారు. ఈ ఏడాది కాపు తక్కువగా ఉండడంతో వీటికి ఎనలేని గిరాకీ పెరిగింది. దీంతో కాయ పెద్దది కాకముందే కోసేస్తున్నాం. మామిడి సీజన్‌లో మొదటిగా ఇవి అందుబాటులోకి వస్తాయి. కాయ టెంక కట్టగానే పండించడానికి వీలుంటుంది. వందల సంఖ్యలో ఆర్డర్లు ఇస్తున్నారు. ఇది తొందరగా ముగ్గిపోతుంది. కాయ బాగా ముదిరితే మంచి నాణ్యత ఉంటుంది. ప్రస్తుతం కొనుగోలుదారులు ఎక్కువగా ఉండటంతో ఇవి ఎక్కడా దొరకని పరిస్థితి ఏర్పడింది. – ఓరుగంటి నాగబాబు, మామిడి రైతు, చేబ్రోలు
Comments
Please login to add a commentAdd a comment