2024 లోక్‌సభ ఎన్నికల ఐదవ దశలో ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 స్థానాలకు ఓటింగ్ జరిగింది. ఈసారి 57.5 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత సారి అంటే 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల కంటే ఇప్పటి ఓటింగ్ ఐదు శాతం తక్కువ.
2019 ఎన్నికల ఐదో దశలో 62.0 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇలా ఓటింగ్ ట్రెండ్ తగ్గుముఖం పట్టడం అటు రాజకీయ పార్టీల్లో, ఇటు ఎన్నికల సంఘంలో మరోసారి ఆందోళన పెంచింది. ఐదో దశలో మహారాష్ట్రలో 13, ఉత్తరప్రదేశ్‌లో 14, పశ్చిమ బెంగాల్‌లో 7, బీహార్‌లో 5, జార్ఖండ్‌లో 3, ఒడిశాలో 5, జమ్ము-కశ్మీర్, లడఖ్‌లలో ఒక్కో స్థానానికి పోలింగ్ జరిగింది.
ఈ రాష్ట్రాల్లో అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 73 శాతం, అత్యల్పంగా మహారాష్ట్రలో 48.88 శాతం పోలింగ్ నమోదైంది. బీహార్‌లో 52.55 శాతం, జమ్మూకశ్మీర్‌లో 54.21 శాతం, జార్ఖండ్‌లో 63 శాతం, ఒడిశాలో 60.72 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 57.43 శాతం, లడఖ్‌లో 67.15 శాతం ఓటింగ్ నమోదైంది. సోమవారం సాయంత్రం 7 గంటల వరకు అందుబాటులో ఉన్న ఎన్నికల సంఘం అధికారిక సమాచారం ప్రకారం ఈ దశలో అంచనా వేసిన ఓటింగ్ శాతం 57.38గా నమోదైంది.
2019లో ఈ సీట్లలో నమోదైన ఓటింగ్ శాతం విషయానికొస్తే బెంగాల్‌లోని ఈ స్థానాల్లో 80 శాతానికి పైగా ఓటింగ్ జరిగింది. మహారాష్ట్రలో 55.7 శాతం, బీహార్‌లో 57.2 శాతం, జమ్మూ కాశ్మీర్‌లో 34.6 శాతం, జార్ఖండ్‌లో 65.6 శాతం, ఒడిశాలో 72.9 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 58.6 శాతం, లడఖ్‌లో 71.1 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా లోక్‌సభ నియోజకవర్గంలో ఈసారి 54 శాతానికి పైగా ఓటింగ్ జరిగింది. ఇది దాదాపు నాలుగు దశాబ్దాలలో అత్యధికం. ఈసారి మొత్తం ఓటింగ్ శాతం 54.21, ఇది 1984లో ఈ నియోజకవర్గంలో 58.84 శాతం ఓటింగ్ తర్వాత అత్యధికం. లోక్‌సభ ఎన్నికలకు ఇంక రెండు దశలు మాత్రమే మిగిలాయి. మే 25న ఆరో దశ, జూన్ ఒకటిన చివరి దశ పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. లోక్‌సభ ఎన్నికల ఐదో దశ ముగియడంతో 428 స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment