MP Responds On Pakistan's Seema Haider To Join Ramdas Athawale Party - Sakshi
Sakshi News home page

రాజకీయాల్లోకి పాక్‌ మహిళ సీమా హైదర్‌.. ఆమెకు టికెట్‌ ఇస్తాం.. కానీ

Published Fri, Aug 4 2023 7:27 PM

Mp Responds Pakistans Seema Haider To Join Ramdas Athawales Party - Sakshi

సీమా గులామ్‌ హైదర్‌.. ఇటీవల ఈ మహిళ పేరు వార్తల్లో నిలుస్తోంది. ఆన్‌లైన్‌ ప్రియుడి కోసం ఏకంగా పాకిస్తాన్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌కు తన నలుగురు పిల్లలను వెంటేసుకుని మరీ వచ్చిన ఈమె.. భారత్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారింది. ఇటీవలే ఓ బాలీవుడ్‌ చిత్రంలో అవకాశం రాగా, ఆశ్చర్యకరంగా రాజకీయాల్లో కూడా ఆమెకు ఆహ్వానం దక్కింది. దీంతో నెటిజన్లు సైతం షాక్‌లో ఉన్నారు. తాజాగా దీనిపై ఆ పార్టీ చీఫ్‌, కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే  స్పందించారు.

టికెట్‌ అక్కడికి ఇస్తాం
పాకిస్థాన్‌ మహిళ సీమా హైదర్‌ ఆర్పీఐలో చేరడంపై ఆయన మాట్లాడుతూ..  సీమాతో తమ పార్టీకి ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. పాక్‌ నుంచి భారత్‌కు వచ్చిన సీమా హైదర్‌ను తమ పార్టీలో ఎలా చేర్చుకుంటామన్నారు. మాసూమ్ కిషోర్ తనను సంప్రదించకుండానే ఆ వ్యాఖ్యలు చేసినట్లు చెప్పుకొచ్చారు. ఒకవేళ ఆమెకు టికెట్‌ ఇవ్వాల్సి వస్తే భారత్‌ నుంచి పాకిస్థాన్ వెళ్లేందుకు టికెట్‌ ఇస్తామని, ఎన్నికల్లో పోటీ కోసం కాదని తేల్చి చెప్పారు.

కాగా కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలేకు చెందిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) నేత మాసూమ్ కిషోర్ దీనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీమా హైదర్‌ను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. పార్టీ మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా చేస్తామని చెప్పారు. అలాగే సీమా హైదర్‌ హిందీ, ఇంగ్లీష్‌లో బాగా మాట్లాడుతుండటంతో పార్టీ అధికార ప్రతినిధి అయ్యే అవకాశం కూడా ఉందన్నారు. అంతేగాక తమ పార్టీ తరుఫున ఎన్నికల్లో ఆమె పోటీ చేయడం గురించి కూడా చర్చలు జరుగుతున్నాయని అన్నారు. సీమా హైదర్‌ గురించి దర్యాప్తు జరుగుతుండటంతో సంబంధిత సంస్థల నుంచి క్లీన్‌చిట్‌ కోసం తాము ఎదురుచూస్తున్నామని వెల్లడించారు.

ఇదిలా ఉండగా ..సీమా హైదర్‌ పాక్‌ ఐఎస్‌ఐ ఏజెంట్‌ అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఆమె సోదరుడు అసిఫ్‌, మామ గులాం అక్బర్‌ కూడా పాక్‌ సైన్యంలో పని చేస్తుండటంతో సీమాపై అనుమానాలు మరింత బలపడ్డాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌ ఉగ్రవాద నిరోధక దళం పోలీసులు కూడా ఆమెను పలుమార్లు విచారించారు.

 
Advertisement
 
Advertisement