కర్నూలులో వజ్రాల వేట | Villagers Hunting for Diamonds In Kurnool | Sakshi
Sakshi News home page

కర్నూలులో వజ్రాల వేట

Published Wed, May 29 2024 10:20 AM | Last Updated on Wed, May 29 2024 11:20 AM

Villagers Hunting for Diamonds In Kurnool

సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు, అనంతపురం జిల్లాల సరిహద్దుల్లో వజ్రాల నిక్షేపాలు ఉన్నాయనే విషయాన్ని జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) గుర్తించింది. కర్నూలు జిల్లా తుగ్గలి, మద్దికెర మండలాల్లోని తుగ్గలి, జొన్నగిరి, పగిడిరాయి, కొత్తపల్లి, పెరవలి, అగ్రహారం, హంప, యడవలి, మద్దికెరతోపాటు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలోని గంజికుంట, తట్రకల్లు, రాగులపాడు, పొట్టిపాడు, కమలపాడు, గూళపాళ్యం, ఎన్‌ఎంపీ తండా గ్రామాల్లో తరచూ వజ్రాలు లభ్యమవుతున్నాయి. ఈ ప్రాంతంలోని భూమి పొరల్లో కింబర్‌లైట్‌ పైప్‌లైన్‌ ఉందని గనులు భూగర్భ శాఖ నిర్ధారించింది.

 ఈ నేపథ్యంలోనే తొలకరి జల్లులు కురిసే జూన్‌లో తుగ్గలి, మద్దికెర మండలాల్లో వజ్రాల అన్వేషణ కొన్నేళ్లుగా ముమ్మరంగా సాగుతోంది. ఈ ఏడాది మే మొదటి వారంలోనే వర్షాలు కురిశాయి. ఆ వెంటనే వజ్రాన్వేషణ మొదలైంది. ఈ ప్రాంతంలోని పొలాలన్నీ జనంతోనే నిండిపోయాయి. కర్నూలు, నంద్యాలతో పాటు అనంతపురం, కడప, చిత్తూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి వజ్రాన్వేషకులు తరలివచ్చారు. ఒక్కొక్కరు వారం, పది, పదిహేను రోజులపాటు ఇక్కడే మకాం వేస్తున్నారు. ఓ వైపు వజ్రాల కోసం జనాలు పొలాల్లో తిరుగుతుంటే.. వజ్రాన్వేషకులు తిరగడం వల్ల పొలం గట్టిబారి వ్యవసాయానికి ఇబ్బందిగా ఉంటోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు తమ పొలాల్లోకి ఎవరూ రావొద్దని విజ్ఞప్తి బోర్డులు తగిలిస్తున్నారు.

ఇతర దేశాలతో పోలిస్తే నాణ్యమైన వజ్రాలు
వజ్రాల మైనింగ్‌ కోసం వజ్రకరూర్‌లో వజ్రాల ప్రక్రమణ కేంద్రాన్ని 1969లో ఏర్పాటు చేశారు. వజ్రాన్వేషణపై ఇది పెద్దగా దృష్టి సారించలేదు. ఆ తర్వాత ఓ ఆస్ట్రేలియన్‌ కంపెనీ వచ్చి కొద్దికాలం పాటు సర్వే చేసి తిరిగి వెళ్లింది. 

ఆఫ్రికాతో పాటు చాలా దేశాలతో పోలిస్తే ఇక్కడి వజ్రాలు చాలా నాణ్యమైనవి, విలువైనవి. అందుకే వీటి వెలికితీతపై ప్రత్యేక దృష్టి సారిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని పలువురు కోరుతున్నారు.

వజ్రాలు ఎలా లభ్యమవుతాయంటే..
మన దేశంలో డైమండ్‌ మైనింగ్‌ మధ్యప్రదేశ్‌లోని పన్నాలో ఉంది. అక్కడ భూమిలోని రాళ్లను తవ్వితీసి వజ్రాల తయారీ ప్రక్రియ చేపడతారు. వజ్రకరూర్, తుగ్గలి, జొన్నగిరి ప్రాంతాల్లోని భూగర్భంలో 150 మీటర్ల లోతున వజ్రాలు ఉంటాయి. భూమిలో వాతావరణ మార్పులు జరిగినప్పుడు అవి బయటకు వస్తాయి. ఆ తర్వాత వెదరింగ్‌ (వికోశీకరణ) వల్ల అంటే ఎండకు ఎండి, వర్షానికి తడిసి పగిలిపోతాయి. వర్షాలు, వరదలు వచ్చినపుడు ఆ రాళ్ల ముక్కలు పొలాల్లో అక్కడక్కడా దొరుకుతుంటాయి. వాగులు, వంకల ద్వారా కూడా వజ్రాలు నీటిలో కొట్టుకుని ఇతర ప్రాంతాలకు చేరతాయి. అలా చెల్లాచెదురైన వజ్రాలే ఇప్పుడు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో లభిస్తున్నాయి.

‘సీమ’లో ఏజెంట్ల తిష్ట
వర్షాకాలం వస్తే జనాలు ఎలా తరలివస్తారో.. వజ్రాల వ్యాపారులు కూడా గుత్తి, గుంతకల్లు, జొన్నగిరి, పెరవలిలో మకాం వేసి వజ్రాల కొనుగోలుకు ప్రయత్నిస్తారు. ఇందుకోసం వజ్రాలు లభ్యమయ్యే గ్రామాల్లో ఏజెంట్లను సైతం నియమించుకుంటున్నారు. వజ్రం దొరికిందనే సమాచారం వస్తే ఏజెంట్లు వాలిపోతారు. వజ్రం దొరికిన వారిని వ్యాపారుల వద్దకు తీసుకెళ్లి రేటు కుదురుస్తారు. వజ్రం విలువైనదైతే వ్యాపారులే వారి వద్దకు వెళ్తారు. వ్యాపారుల మధ్య పోటీ పెరిగితే బహిరంగ వేలం వేస్తారు. వజ్రం నాణ్యత (క్యారెట్‌)ను బట్టి రూ.20 వేల నుంచి రూ.20 లక్షల వరకు కొనుగోలు చేస్తారు. జిల్లా చరిత్రలో 2022లో లభించిన 30 క్యారెట్ల వజ్రమే అత్యంత విలువైంది. ఈ ఏడాది ఇప్పటికే 9 వజ్రాలు లభ్యమయ్యాయి. గతేడాది సరైన వర్షాలు లేవు. అయినప్పటికీ 18 వజ్రాలు దొరికాయి. ఇక్కడ వజ్రాలను స్థానిక వ్యాపారులకే విక్రయిస్తారు. ఇక్కడి వ్యాపారులు అంత నమ్మకం సాధించారు. చెప్పిన ధర చెప్పినట్టు ఇస్తారు. అదే ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇస్తే దానిని స్వాధీనం చేసుకుని పైసా కూడా ఇవ్వరనే అభిప్రాయంతో వారు అధికారులకు చెప్పకుండా విక్రయిస్తారు.

విదేశాల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు
ఆఫ్రికా, అంగోలా, కాంగోతో పాటు చాలా దేశాల్లో ఇదే తరహాలో వజ్రాలు లభిస్తాయి. వాటిని అల్యూవియల్‌ డైమండ్స్‌ అంటారు. అక్కడ ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది. వజ్రాలు లభించిన వారు నేరుగా ఆ కేంద్రానికి వచ్చి చూపిస్తారు. వజ్రాల నాణ్యత ఆధారంగా కొంత మొత్తం చెల్లిస్తారు. వజ్రాలను లీగల్‌గా ప్రభుత్వం ప్రక్రియను పూర్తి చేసి విక్రయిస్తుంది. కర్నూలు జిల్లాలో ఏటా సగటున 50–60 వజ్రాలు లభిస్తున్నాయి. అలాగే వజ్రకరూరు ప్రాంతంలో కూడా ఏటా 30–40 వజ్రాలు లభిస్తాయి. అంటే ఈ 
రెండు జిల్లాల్లో ఏటా వంద వజ్రాలు లభిస్తున్నాయి. మైనింగ్‌ చేస్తే రూ.వందల కోట్ల విలువైన సంపద ప్రభుత్వానికి లభించే అవకాశం ఉంది.

ఈ ఏడాది లభ్యమైన వజ్రాల వివరాలు
👉 ఈ నెల 8న చెన్నంపల్లిలో రూ.3.96 లక్షల విలువ చేసే వజ్రం లభించింది.
👉 మే 20న రామాపురంలో రూ.50 వేల విలువైప వజ్రం దొరికింది.
👉 మే 21న మద్దికెర మండలం మదనంతపురంలో రూ.6.50 లక్షల విలువైన వజ్రం లభ్యమైంది.
👉 మే 22న ఇదే గ్రామంలో దొరికిన వజ్రాన్ని రూ.18 లక్షలు, 10 తులాల బంగారం చెల్లించి వ్యాపారి కొనుగోలు చేశారు.
👉 మే 23న జొన్నగిరిలో రూ.15 వేలు, పగిడిరాయిలో రూ.12 వేల విలువ చేసే వజ్రాలు లభించాయి. 
👉 మే 24న జొన్నగిరిలో దొరికిన వజ్రాన్ని రూ.6.20 లక్షలు నగదు, 5 తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేశారు.
👉 మే 25న జొన్నగిరిలో దొరికిన వజ్రాన్ని రూ.1.20 లక్షల నగదు, జత కమ్మలు ఇచ్చి కొనుగోలు చేశారు.
👉 తాజాగా తుగ్గలి మండలం గుండాలతండాకు చెందిన వ్యక్తికి మంగళవారం ఓ వజ్రం లభ్యమైంది. స్థానిక వజ్రాల వ్యాపారి రూ.లక్ష నగదు, అర తులం బంగారం ఇచ్చి దానిని కొనుగోలు చేశారు.

ఐదోసారి వచ్చా
వానొస్తే మా ఊరోళ్లంతా రైలెక్కి గుత్తిలో దిగి జొన్నగిరికి వస్తాం. నేను ఇక్కడికి ఐదేళ్ల నుంచి వస్తున్నా. వచ్చి వారమైంది. ఐదేళ్లలో ఒక్క వజ్రం కూడా దొరకలేదు. తిండీ తిప్పలకు ఇబ్బందిగా ఉంది. మాతో పాటు వచ్చిన కొంతమందికి వజ్రాలు దొరుకుతున్నాయి. మాకు ఆశ చావక వెతుకుతున్నాం.
– ఈరయ్య, రామాపురం, వినుకొండ, పల్నాడు జిల్లా 

వజ్రాన్ని గుర్తు పడతాం
మాది కలికిరి. హైదరాబాద్‌లోని స్నేహితుడు, నేను కలిసి మూడు రోజుల క్రితం ఇక్కడికి వచ్చాం. దొరికితే వజ్రం. లేదంటే కాలక్షేపంగా ఉంటుందని వచ్చాం. మేం బంగారం నగలు తయారు చేస్తాం. వజ్రం ఎలా ఉంటుందో సులువుగా గుర్తుపడతాం.
– రామాంజులాచారి, కలికిరి, అన్నమయ్య జిల్లా

ఒక చిన్న వజ్రం దొరికినా చాలు
మా ఊళ్లో పనుల్లేవు. వ­జ్రాలు దొరికా­య­ని పే­ప­ర్లు, టీవీల్లో వచ్చింది. ఖాళీగా ఉండలేక ఇక్క­డికి వచ్చాం. నాతో పా­టు మా ఊరోళ్లు పదిమంది వచ్చారు. వజ్రాలు వెతుకుతున్నాం. కొన్ని రాళ్లు మెరుస్తున్నా­యి. అవి వజ్రాలు కాదంటున్నారు. కొద్ది­రో­జులు చూస్తాం. చిన్న వజ్రం దొరికినా కష్టం తీరకపోతుందా అనే ఆశతో చూస్తున్నాం.
– లక్ష్మక్క, గార్లదిన్నె మండలం, అనంతపురం జిల్లా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement