కచ్చతీవు ఎక్కడుంది?.. దీని వెనుక అసలు కథేంటి? | Sakshi
Sakshi News home page

Katchatheevu Island: కచ్చతీవు ఎక్కడుంది?.. దీని వెనుక అసలు కథేంటి?

Published Sat, Apr 13 2024 7:28 PM

What Behind The Katchatheevu Island Controversy - Sakshi

ఎప్పుడో 50 ఏళ్ల క్రితం నాటి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీలంకకు రాసిచ్చిన కచ్చతీవు ఇపుడు రాజకీయ వివాదం రాజేస్తోంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా పార్టీలకు కచ్చతీవు ఇంధనంగా మారుతోంది. 2016 ఎన్నికల్లో రచ్చ రచ్చ రాజేసిన కచ్చతీవు ఈ ఎన్నికల్లోనూ తెరపైకి వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ కచ్చతీవు విషయంలో కాంగ్రెస్, డిఎంకేలపై మండి పడ్డ సంగతి తెలిసిందే. అయితే దానికి దీటుగా కాంగ్రెస్ కూడా బిజెపిపై విరుచుకు పడుతోంది. పదేళ్లుగా అధికారంలో ఉన్న మోదీ కచ్చతీవును ఎందుకు స్వాధీనం చేసుకోలేదో చెప్పాలని కాంగ్రెస్ నిలదీస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ కచ్చతీవు ఎక్కడుంది? ఏమీ దీని కథ అన్నది తెలుసుకోవాలి. చరిత్ర పుటలను ఒక్కసారి వెనక్కి తిప్పాలి.

భారత్-శ్రీలంకల మధ్య.. తమిళనాడుకు సమీపంలో ఉన్న ఈ దీవే కచ్చతీవి. తమిళ నాడులోని రామేశ్వరానికి.. శ్రీలంక లోని జాఫ్నాకీ మధ్యలో ఉంది ఇది. తమిళనాడుకు పది మైళ్ల దూరంలో   ఇది కొలువు తీరింది. అపారమైన మత్స్య సంపదకు  మారు పేరు ఇది. వేల సంవత్సరాలుగా కచ్చతీవుల్లో చేపలు పట్టి పొట్టపోసుకుంటూ వస్తున్నారు తమిళ జాలర్లు. అయితే 1974లో భారత ప్రభుత్వం తీసుకున్న ఓ అనాలోచిత నిర్ణయం కారణంగా ఈ దీవి శ్రీలంక వశమైంది.

అప్పటి నుండి తమిళ మత్స్య కారులకు కష్టాలు మొదలయ్యాయి.దీవులపై పెత్తనం సంపాదించుకున్న శ్రీలంక  తమ నావికాదళాలను ఇక్కడ మోహరించింది. అందుకు కారణాలూ ఉన్నాయి ఒకప్పుడు ఎల్.టి.టి.ఇ. తీవ్రవాదులకూ ఇది షెల్టర్ గా ఉండేది. అందుకే ఇటు వైపు  నావికాదళాలను మోహరించి ..ఇటు వైపు ఎవరొచ్చినా వారు శత్రువులే అన్నట్లు శ్రీలంక వ్యవహరిస్తోంది. కచ్చతీవుల వైపు వచ్చే తమిళ మత్స్యకారులపై లంక నావికాదళాల దౌర్జన్యాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి.

తమ సరిహద్దుజలాల్లోకి ప్రవేశించారన్న సాకుతో  చాలా మంది జాలర్లను లంక దళాలు కాల్చి చంపేశాయి. 1983 నుంచి ఇప్పటి దాకా 500 మందికి పైగా తమిళ జాలర్లను శ్రీలంక దళాలు పొట్టన పెట్టుకున్నాయి. కనీసం మూడు వేల మందికి పైగా మత్స్యకారులు లంక ఆర్మీ దాడిలో శాస్వత వికలాంగులుగా మిగిలారు. వందలాది మంది గంగ పుత్రుల ఆచూకీ  తెలీడం లేదు. వందలాది మందిని లంక ఆర్మీ  తమ జైళ్లల్లో నిర్బంధించింది. మరి కొన్ని వందల మందిని అక్రమ నిర్బంధంలో ఉంచి చిత్రహింసలకు గురి చేస్తున్నారన్నది తమిళ జాలర్ల ఆరోపణ. వేలాది సంవత్సరాలుగా తమ హక్కుగా ఉన్న దీవులను తమకి కాకుండా చేసిన భారత ప్రభుత్వం పై  తమిళ గంగ పుత్రులు తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు.

ఇక ఈ కచ్చ దీవి విషయానికి వస్తే.. ఈ దీవి భారత్ దే అనడానికి అన్ని రకాల సాక్ష్యాలూ ఉన్నాయి. తమిళనాడుకు చెందిన రామనాథపురం జమీందారీలో కచ్చతీవులు భాగమేనని రెవిన్యూ రికార్డులు చెబుతున్నాయి. రామనాథ పురానికి చెందిన రాజు  సేతుపతి  పాలనలోనూ.. ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలోనూ..స్వాతంత్ర్యం వచ్చాక  స్వతంత్ర భారత  పాలనలోనూ కూడా కచ్చతీవులు తమిళనాడు ఆధీనంలోనే  ఉన్నాయి.

1605 లో రామనాథ పురాన్ని ఏలిన సేతుపతి రాజు  హయాంలో 69 గ్రామాలు..ఏడు దీవులను  పాలించాడు. వాటిలో కచ్చతీవులు కూడా ఉన్నాయి. రామనాథ పురం ఆస్థానంలో  కచ్చదీవి ఆర్ధిక లెక్కల ఆడిటింగ్ కోసం  ప్రత్యేక విభాగమే ఉంది. 1822 లో  కచ్చ దీవులను   ఈస్ట్ ఇండియా కంపెనీకి లీజుకు ఇచ్చినట్లు రామనాథపురం ఆస్థానంలో  పత్రాలు ఉన్నాయి. అయితే వీటిని ఏ మాత్రం పట్టించుకోకుండా..1974లో అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ  కచ్చ దీవులను శ్రీలంకకు రాసిచ్చేశారు.
అప్పటి శ్రీలంక ప్రధాని సిరిమావో బండారి నాయకేకు  స్వదేశంలో రాజకీయ ప్రయోజనాలు కల్పించేందుకే ఇందిరా గాంధీ  తమ నోటికాడి ఆహారాన్ని తన్నేసి ..శ్రీలంకుకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారన్నది తమిళ జాలర్ల ఆరోపణ. తమిళ మత్స్యకారులతో కనీస సంప్రదింపులు కూడా జరపకుండా కేంద్రంలోని ఇందిరాగాంధీ ప్రభుత్వం..తమిళనాడులోని కరుణానిథి ప్రభుత్వం ఏక పక్ష నిర్ణయం తీసుకున్నారని ద్రవిడ దేశం అధ్యక్షుడు కృష్ణారావు ఆరోపిస్తున్నారు.

రెండు దేశాల ప్రధానుల మధ్య కుదిరిన ఈ ఒప్పందం భారత పార్లమెంటు లో ఆమోదం పొందనే లేదు. ఇపుడు ఈ అంశాన్నే లేవనెత్తుతున్నాయి తమిళ రాజకీయ పార్టీలు. కచ్చ దీవుల విషయంలో శ్రీలంకతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని పునః పరిశీలించాలని..కచ్చదీవులను తిరిగి భారత ఆధీనంలోకి తీసుకోవాలని తమిళ జాలర్లు పట్టుబడుతున్నారు. కచ్చ దీవుల పై హక్కుల కోసం  ఓ సంఘాన్ని  నెలకొల్పి ఏళ్ల తరబడి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. సీతయీన్  మైన్ థాన్   నాయకత్వంలో ఈ ఉద్యమం సాగుతోంది. కచ్చతీవులను శ్రీలంకకు ఇష్టారాజ్యంగా ఇచ్చేయడానికి ఇందిరాగాంధీకి ఏం హక్కు ఉందని మైన్ థాన్ నిలదీస్తున్నారు.కచ్చతీవులు మోతీ లాల్ నెహ్రూ సంపాదించుకున్న వంశపారం పర్య ఆస్తి ఏమీ కాదని ఆయన వ్యంగ్య ధోరణిలో  విరుచుకుపడ్డారు. రెండు దేశాల పెద్దలూ కూడా తమ తమ రాజకీయ ప్రయోజనాలకోసమే మత్స్యకారుల  జీవితాలను నాశనం చేశారని  మైన్ థాన్ ఆరోపిస్తున్నారు.

నిజానికి 1974 లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రెండు దేశాల పర్యాటకులు..మత్స్యకారులూ కచ్చ దీవులకు ఇష్టాను సారం రావచ్చు..పోవచ్చు. ఇందుకోసం ఎవరూ రెండో దేశపు అనుమతి పత్రాలు తీసుకోవలసిన అవసరం లేదు. అయితే ఈ  వెసులుబాటును శ్రీలంక ఆర్మీ తోసి పుచ్చుతోంది. కచ్చ తీవులవైపు వచ్చే తమిళ జాలర్లను నానా హింసలూ పెడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. శ్రీలంక ఇలా ఒప్పందాన్ని ఉల్లంఘించాక భారత ప్రభుత్వం చేష్ఠలుడిగినట్లు మౌనంగా ఉండడంలో అర్ధం లేదన్నది  మత్స్యకారుల ఆరోపణ.

మైన్ థాన్ అనుమానం ఏంటంటే... శ్రీలంక లో పాకిస్థాన్ ఎయిర్ బేస్  ఏర్పాటుకు  శ్రీలంక ప్రభుత్వం అనుమతించే అవకాశం ఉందని తెలియడంతో...పాకిస్థాన్ ను  పక్కలో బల్లెంలా శ్రీలంకలో ఎందుకు పెట్టుకోవడం అని అనుకున్న ఇందిరా గాంధీ దాన్ని బ్రేక్ చేయడానికే  శ్రీలంక కోరిన విధంగా కచ్చ తీవులను వదులుకోడానికి సిద్ధమయ్యారని మైన్ థాన్ వాదన. అటు శ్రీలంకలోనూ  రాజకీయంగా వెనకబడుతోన్న బండారి నాయకే..పేరు ప్రతిష్ఠలను మూట కట్టుకోడానికే నెహ్రూ కుటుంబంతో తనకున్న సాన్నిహిత్యాన్ని వాడుకుని ఇందిరా గాంధీ చేత ఒప్పందం చేయించుకున్నారని మైన్ థాన్ ఆరోపిస్తున్నారు. అయితే ఇపుడు పాకిస్థాన్ కన్నా పెద్ద ప్రమాదం చైనా రూపంలో పొంచి ఉన్న సంగతిని ఇప్పటి ప్రభుత్వం గుర్తించాలంటున్నారు మైన్ థాన్.

కచ్చతీవులకు వెళ్లి వచ్చే తమిళ జాలర్లు కూడ  శ్రీలంక నావికా దళాల బోట్లలో చైనా సైనికులను చూసినట్లు చెబుతున్నారు. ఇప్పటికే శ్రీలంకలో లక్ష మందికి పైగా  చైనా సైనికులు ఉన్నారని అది ఏ క్షణంలో అయినా భారత్ కు ముప్పేనని మైన్ థాన్ హెచ్చరిస్తున్నారు. మరో పక్క  కొలంబో కేంద్రంగా లష్కరే తోయిబా ఉగ్రవాదులు సైతం శిక్షణ పొందుతున్నారని.. ఈ ఉగ్రవాదులు కూడ కచ్చతీవులను కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలు ఆరంభిస్తే..భారత్ లో శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని అంటున్నారు. వీటిని దృష్ఠిలో పెట్టుకుని కచ్చతీవుల విషయంలో శ్రీలంకతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసి దీవులను స్వాధీనం చేసుకోవాలని..లేని పక్షంలో అది భారత సార్వభౌమాధికారానికే ముప్పుగా మారే ప్రమాదం ఉందని గంగపుత్రుల సంఘాలు హెచ్చరిస్తున్నాయి. అవసరమైతే అంతర్జాతీయ న్యాయ స్థానాలను ఆశ్రయించాలని కూడా వారు సూచిస్తున్నారు.

కచ్చ తీవుల్లో అటు హిందూ దేవాలయాలతో పాటు సెయింట్ ఆంధోనీ చర్చి కూడా ఉంది. క్రైస్తవ పండగతో పాటు హిందూ జాతరలకూ తమిళనాడు నుంచి ఏటా వేలాది మంది  కచ్చ తీవులకు వెళ్తూ ఉంటారు. ఇపుడు తమిళ నాట ఎన్నికల పుణ్యమా అని కచ్చతీవుల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. అదే గంగపుత్రుల్లో కోటి ఆశలు రేపుతోంది.

ఇదీ చదవండి: 10 ఏళ్లగా ప్రధాని మోదీ ఏం చేశారు? కచ్చతీవుపై చిదంబరం కీలక వ్యాఖ్యలు

Advertisement
 
Advertisement
 
Advertisement