కేంద్ర మంత్రివర్గంలో డీకే అరుణకు చోటు? | - | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రివర్గంలో డీకే అరుణకు చోటు?

Published Sat, Jun 8 2024 3:34 AM | Last Updated on Sat, Jun 8 2024 2:02 PM

-

పాలమూరు వాసుల్లో జోరుగా చర్చ

సుదీర్ఘ రాజకీయ నేపథ్యమున్నకుటుంబం..

ఐదేళ్లపాటు రాష్ట్ర మంత్రిగా పనిచేసినఅనుభవం

సీఎం రేవంత్‌, కాంగ్రెస్‌ను దీటుగాఎదుర్కొనే నాయకురాలిగా గుర్తింపు

ఇవన్నీ కలిసొస్తాయని రాజకీయ వర్గాల విశ్లేషణ

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వం వహిస్తున్న ఎన్‌డీఏ కూటమి విజయం సాధించగా.. కేబినెట్‌ కూర్పులో తెలంగాణ నుంచి ఎవరెవరికి బెర్తులు దక్కనున్నాయనే అంశం రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ప్రధానంగా మహబూబ్‌నగర్‌ నుంచి ఎంపీగా గెలుపొందిన సీనియర్‌ నాయకురాలు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు కేంద్ర మంత్రి వర్గంలో చోటుపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. సుదీర్ఘ రాజకీయ కుటుంబ నేపథ్యంతో పాటు సుమారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్ల పాటు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ఆమెకు కేంద్ర మంత్రి పదవి ఖాయమనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను, సీఎం రేవంత్‌రెడ్డిని దీటుగా ఎదుర్కొనే సామర్థ్యం ఉన్న నాయకురాలిగా గుర్తింపు పొందడం వంటి అంశాలు కలిసివస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సుదీర్ఘ రాజకీయ అనుభవం..
డీకే అరుణ పుట్టినిల్లు, మెట్టినిల్లు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలే. తండ్రి చిట్టెం నర్సిరెడ్డి, మామ డీకే సత్యారెడ్డి ఎమ్మెల్యేలుగా ప్రజలకు సేవలందించారు. భర్త డీకే భరత్‌సింహారెడ్డి కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. అదేవిధంగా భరత్‌సింహారెడ్డి అన్న డీకే సమరసింహారెడ్డి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో పాటు మంత్రిగా పనిచేశారు.1996లో రాజకీయాల్లోకి వచ్చిన డీకే అరుణ మహబూబ్‌నగర్‌ ఎంపీగా, ఆ తర్వాత గద్వాల ఎమ్మెల్యేగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అనంతరం కొల్లాపూర్‌ నియోజకవర్గంలోని పాన్‌గల్‌ నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసి తొలి విజయాన్ని అందుకున్నారు.

 2004లో సమాజ్‌వాది పార్టీ నుంచి గద్వాల ఎమ్మెల్యేగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడిపై భారీ విజయం సాధించారు. 2009, 2014లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి వరుస విజయాలతో హ్యాట్రిక్‌ సాధించారు. 2009లో వైఎస్‌ కేబినెట్‌లో, ఆ తర్వాత రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి చేతిలో ఓటమి చెందారు. మారిన రాజకీయ పరిణామాల క్రమంలో 2019లో బీజేపీలో చేరిన డీకే అరుణ అదే సంవత్సరంలో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటమి చెందారు. తాజాగా ఇటీవల జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపొందారు.

మహిళా కోటాలో దక్కే అవకాశం
గత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ నాలుగు స్థానాల్లో (సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌) గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గంలో కిషన్‌రెడ్డికి బెర్త్‌ లభించింది. తాజాగా ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకుని ఎనిమిది స్థానాల్లో (మహబూబ్‌నగర్, సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి, మెదక్‌) విజయం సాధించింది. ఈ మేరకు ఇద్దరికి లేదా ముగ్గురికి మంత్రి పదవులు దక్కవచ్చనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఒకరికి కీలక మంత్రిత్వ శాఖతో పాటు మరో ఇద్దరికి సహాయ మంత్రులుగా అవకాశం కలి్పంచనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు మహిళా కోటాలో సీనియర్‌ నాయకురాలైన డీకే అరుణకు మోదీ కేబినెట్‌లో మంత్రిగా బెర్త్‌ దక్కే చాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

పాలమూరు నుంచే భవిష్యత్‌కు బాట..! 
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్న డీకే అరుణ మహబూబ్‌నగర్‌ లోక్‌సభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డిని సమర్థంగా ఢీకొని ఉత్కంఠ పోరులో విజయం సాధించారు. ఈ పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు చెందిన వారే కాగా.. వారందరూ చల్లా గెలుపు కోసం క్రియాశీలకంగా పనిచేశారు. మరోవైపు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి పాలమూరులోని పలు ప్రాంతాల్లో 11 పర్యాయాలు పర్యటించారు. అయినా డీకే అరుణ విజయాన్ని అడ్డుకోలేకపోయారు. పలు మండలాల్లో బీజేపీ కేడర్‌ బలహీనంగా ఉన్నా.. అన్నింటినీ అధిగమించి డీకే అరుణ విజయకేతనం ఎగురవేశారు. 

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అగ్రనాయకత్వం ముందుకుసాగుతోంది. ఈ మేరకు కేంద్ర కేబినెట్‌ పదవులు కేటాయించే అవకాశం ఉంది. బీజేపీ తెలంగాణలో పాలమూరు నుంచే అసెంబ్లీతో పాటు పార్లమెంట్‌ ఎన్నికల శంఖారావం పూరించిన విషయం తెలిసిందే. ఈ లెక్కన పాలమూరు నుంచే భవిష్యత్‌కు బాట సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంతో పాటు సీఎం రేవంత్, కాంగ్రెస్‌ను దీటుగా ఎదుర్కొనే నాయకురాలిగా గుర్తింపు ఉన్న డీకే అరుణకు ఈ సారి కేంద్ర కేబినెట్‌లో బెర్త్‌ ఖాయమనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.    

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement