బుచ్చయ్యకు ఈసారైనా దక్కేనా? | - | Sakshi
Sakshi News home page

బుచ్చయ్యకు ఈసారైనా దక్కేనా?

Published Sat, Jun 8 2024 4:24 AM | Last Updated on Sat, Jun 8 2024 11:23 AM

-

అమాత్య యోగం ఎవరికో?

ఆశల పల్లకీలో తెలుగు తమ్ముళ్లు

 లాబీయింగ్‌ మొదలు

 బెర్త్‌లు ఖాయమనే ధీమాలో సీనియర్లు

 సామాజిక సమతూకాలపై మల్లగుల్లాలు

సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వెలువడ్డాయి. టీడీపీ అధికారం చేజిక్కించుకుంది. ఇప్పుడు ఆ పార్టీలో అందరి కళ్లూ కేబినెట్‌ కూర్పుపైనే ఉన్నాయి. మంత్రివర్గం ఎలా ఉండబోతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రాతిపదికన తీసుకుంటారా, సామాజిక సమతూకాల మాటేమిటి, కూటమిలో క్రియాశీలకమైన జనసేనకు లభించే ప్రాతినిధ్యం ఎంతవరకూ ఉంటుంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో చర్చ అంతా ఈ అంశాలపైనే జరుగుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అన్ని స్థానాల్లోనూ టీడీపీ, జనసేన అభ్యర్థులు గెలుపొందడంతో మంత్రివర్గంపై ఆశలు పెంచుకున్న వారి జాబితా చాంతాడులా మారుతోంది. 

పార్టీ సీనియర్‌లు ఈసారి కేబినెట్‌లో బెర్త్‌ ఖాయం చేసుకోవాలని లాబీయింగ్‌ చేయడంలో బిజీబిజీగా గడుపుతున్నారు. మంత్రివర్గంలో బెర్త్‌ కోసం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సీనియర్‌లంతా రేసులో ఉన్నారు. పార్టీలో నంబర్‌ టుగా పేర్కొనే యనమల రామకృష్ణుడు సహా నిమ్మకాయల చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, జ్యోతుల నెహ్రూ, బండారు సత్యానందరావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. స్పీకర్‌, ఆర్థిక మంత్రిగా పనిచేసిన యనమల ప్రత్యక్ష రాజకీయాలకు దూరమై మండలిలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. ఈసారి ఎన్నికల్లో ఆయన కుమార్తె దివ్య తుని నుంచి ఎన్నికయ్యారు. మండలి నుంచి మంత్రివర్గంలోకి యనమలకు బెర్త్‌ దక్కితే సరేసరి లేదంటే కుమార్తె దివ్య రేసులో ఉండటం ఖాయమంటున్నారు.

 గత చంద్రబాబు కేబినెట్‌లో ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రిగా చేసిన పెద్దాపురం సిట్టింగ్‌ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కూడా మంత్రివర్గంలో ప్రాతినిధ్యాన్ని కోరుకుంటున్నారు. వివాదరహితుడనే పేరున్న చినరాజప్ప రెండో సారి ప్రయత్నాల్లో ఉన్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా మెట్ట ప్రాంత రాజకీయాల్లో చక్రం తిప్పిన జ్యోతుల నెహ్రూ ఈసారి బెర్త్‌ ఖాయం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. మంత్రి అనిపించుకోవాలనే ఆత్రం ఎవరికి మాత్రం ఉండదని నెహ్రూ సన్నిహితులు చెబుతున్నారు. పార్టీ కాకినాడ జిల్లా అద్యక్షుడు నవీన్‌ ఇప్పటికే లోకేష్‌ను కలిసి వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.

బుచ్చయ్యకు ఈసారైనా దక్కేనా?
రాజమహేంద్రవరం రూరల్‌ నుంచి గెలుపొందిన సీనియర్‌ నాయకుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి పేరు కూడా కేబినెట్‌ రేసులో ప్రచారంలోకొచ్చింది. ఉమ్మడి తూర్పు గోదావరిలో అందరి కంటే సీనియర్‌ అయిన తనకు బెర్త్‌ ఖాయమనే ధీమాతో బుచ్చయ్యచౌదరి ఉన్నారు. దివంగత ఎన్టీఆర్‌ హయాంలోనే పౌర సరఫరాలు వంటి కీలక శాఖలు చేసిన తమ నేతకు ఈసారి మంత్రివర్గంలో చోటు కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నామని అనుచరులు బాహాటంగానే చెబుతున్నారు. బుచ్చయ్యకు పోటీగా సిటీ ఎమ్మెల్యేగా ఎన్నిక అయిన ఆదిరెడ్డి వాసు కూడా రేసులో ఉన్నారు. ఆది నుంచీ సిటీ సీటు విషయంలో గోరంట్ల...ఆదిరెడ్డి వర్గాల మధ్య వైషమ్యాలు ఉన్న విషయం బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో వాసు కోటరీ లోకేష్‌ ద్వారా బెర్త్‌ కోసం పావులు కదుపుతున్నారు. ఇప్పటికే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, చిన్న మావ అయిన అచ్చెన్నాయుడుతో చంద్రబాబుకు సిఫార్సు చేయించుకుంటున్నారు అని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వీరితోపాటు కొత్తపేట నుంచి బండారు సత్యానందరావు, ఎస్సీ, బీసీ కోటాలో అమలాపురం అయితాబత్తుల ఆనందరావు, కాకినాడ నుంచి వనమాడి కొండబాబు అమాత్య పదవి కోసం పావులు కదుపుతున్నారు.

యనమల హవా నడుస్తుందా?
మంత్రివర్గం కూర్పులో సామాజికవర్గాల సమతూకమే ప్రామాణికంగా ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు కాపు, బీసీ, ఎస్సీ సామాజిక వర్గాల నుంచి మూడు బెర్త్‌లు ఖాయం కావచ్చనే ప్రచారం టీడీపీలో జరుగుతోంది. అదే నిజమైతే సీనియర్‌ల మధ్యనే పోటీ ప్రధానంగా ఉంటుందని నేతలు విశ్లేషిస్తున్నారు. ఉమ్మడి జిల్లా టీడీపీ రాజకీయాల్లో ఆది నుంచి యనమల, జ్యోతుల వర్గాలకు పొసగని పరిస్థితి. ఆది నుంచీ జ్యోతుల మంత్రి పదవికి మోకాలడ్డుతున్నది యనమల వర్గమేనని ఆయన సన్నిహితులు పేర్కొంటుంటారు. ఈసారి ఏమి జరుగుతుందో చూడాలంటున్నారు. గతంలో మాదిరి కేబినెట్‌ కూర్పులో యనమల హవా నడుస్తుందా లేదా మారిన సమీకరణలు ఎవరికి ప్లస్‌ అవుతాయో వేచి చూడాల్సిందేనంటున్నారు.

కాపుల నుంచే పోటీ ఎక్కువ
ప్రధానంగా కాపు సామాజికవర్గం నుంచి పోటీ ఎక్కువగా ఉండేటట్టు కనిపిస్తోంది. ఇటు టీడీపీ, అటు జనసేనలో ఈ సామాజికవర్గం నుంచి అమాత్య పదవిని ఆశిస్తున్నవారు ఎక్కువగా ఉన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరిలో జనసేన అధ్యక్షుడు పవన్‌ పోటీ చేసిన పిఠాపురం సహా రాజోలు, పి.గన్నవరం, నిడదవోలు, కాకినాడ రూరల్‌, రాజానగరం స్థానాల్లో కాపు సామాజిక వర్గీయులు గెలుపొందారు. వీరిలో మొదటి ప్రాధాన్యంగా నిడదవోలు నుంచి గెలుపొందిన కందుల దుర్గేష్‌కు చాన్స్‌ లభించవచ్చునంటున్నారు. ఆవిర్భావం నుంచి పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా దుర్గేష్‌పై పవన్‌కు ఉన్న గుడ్‌లుక్స్‌ కేబినెట్‌లో చోటుకు సానుకూల అంశంగా మారుతుందంటున్నారు. 

పవన్‌కల్యాణ్‌ ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి అంటూ జరుగుతోన్న ప్రచారమే నిజమైతే ఉమ్మడి జిల్లాలో కాపు సామాజికవర్గం నుంచి మరొకరికి అవకాశం లభించడం కష్టమేనంటున్నారు. ఉమ్మడి తూర్పున జనసేనలో ఎస్సీల నుంచి పవన్‌ ప్రతిపాదించాలనుకుంటే రాజోలులో గెలుపొందిన దేవ వరప్రసాద్‌ పేరు మొదటి వరుసలో ఉంటుందంటున్నారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలో గెలుపొందిన ఏకై క రాజోలు చీకటిలో చిరుదీపంగా నిలిచిందంటూ పవన్‌ ఆ నియోజకవర్గం పార్టీకి ప్రత్యేకం అని చెప్పుకొచ్చారు. 

అందునా రిటైర్డ్‌ ఐఏఎస్‌గా, పార్టీ జనవాణి కార్యక్రమ కోఆర్డినేటర్‌గా వరప్రసాదరావు వైపే పవన్‌ మొగ్గు చూపుతారంటున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌ కమిషనర్‌గా చంద్రబాబు హయాంలో పనిచేయడంతో వరప్రసాదరావుకు అటు టీడీపీ నుంచి కూడా సానుకూలం అవుతుందంటున్నారు. టీడీపీలో ఎస్సీ సామాజికవర్గం నుంచి అమలాపురంలో గెలుపొందిన ఆనందరావు పేరు తెరమీదకు వచ్చింది. కానీ కాకినాడ జిల్లాకు పొరుగున ఉన్న పాయకరావుపేట నుంచి గెలిచిన అదే సామాజికవర్గానికి చెందిన వంగలపూడి అనితకు అవకాశం దక్కవచ్చునంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement