సాక్షి, చైన్నె: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైకు కేంద్రంలో మంత్రి పదవి దక్కేనా అన్న చర్చ ఊపందుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తమిళనాడులో పార్టీ బలోపేతానికి అన్నామలై కీలక పాత్రనే పోషించారు. గతంలో 3 శాతం మేరకు ఉన్న బీజేపీ ఓటు బ్యాంక్‌ను తాజా ఎన్నికల ద్వారా 11 శాతానికి చేర్చారు. ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలో తమిళనాడులో బలమైన కూటమి ఏర్పాటు చేశారు. అయితే, డీఎంకే కూటమి హవా ముందు అందరూ ఓటమి పాలయ్యారు. ఓడినా తమిళనాడులో తమ బలం పెరిగిందన్న ధీమా బీజేపీ వర్గాల్లో నెలకొంది.
ఇదే విషయాన్ని శుక్రవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీ సైతం ప్రకటించారు. తమిళనాడులో బలం పెరిగిందని, రాబోయే రోజుల్లో పాగా వేస్తామన్న ధీమాను వ్యక్తం చేశారు. ఈ బలోపేతంలో అన్నామలై పనితీరు ప్రధాన కారణం అన్న విషయాన్ని ఇప్పటికే బీజేపీ అధిష్టానం గుర్తించింది. ఈదృష్ట్యా, కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వంలో ఆయనకు మంత్రి పదవి దక్కేనా? అని ఆయన మద్దతుదారులు ఎదురు చూస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఎల్ మురుగన్‌కు కొత్త ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రి పదవిని అప్పగించారు.
ఇదే తరహాలో ప్రస్తుతం పార్టీ బలోపేతానికి వీరోచితంగా శ్రమించిన, శ్రమిస్తున్న అన్నామలైకు కేంద్రంలో గుర్తింపు కల్పించేలా మంత్రి పదవి కేటాయించేనా అన్న చర్చ ఊపందుకుంది. అదే సమయంలో రాష్ట్రంలో అన్నామలై వ్యాఖ్యల తీరుతోనే అన్నాడీఎంకేకు దూరమయ్యామని, కలిసి కట్టుగా పోటీచేసి ఉంటే కనీస స్థానాలలో విజయకేతనం ఎగుర వేసి ఉంటామని పలువురు బీజేపీ నేతలు అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment