కత్తితో పొడిచి ఘాతుకానికి పాల్పడిన నిందితుడు
ఆపై అదే కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం
జిల్లాలోని భైరవునిపల్లిలో ఘటన
నేలకొండపల్లి: నేలకొండపల్లి మండలంలోని బైరవునిపల్లిలో శుక్రవారం ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని కొన్నాళ్లుగా వేధిస్తున్న ఓ వ్యక్తి ఈ ఘటనకు పాల్పడగా ఆయన కూడా కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికుల కథనం ప్రకారం ఘటనకు సంబంధించి వివరాలు... బైరవునిపల్లి గ్రామానికి చెందిన కోళ్ల సైదమ్మ(47)తో ఆమె భర్త దూరంగా ఉంటుండగా, సూర్యాపేట జిల్లా కోదాడలోని ఓప్రైవేట్ పాఠశాల హాస్టల్‌లో వార్డెన్‌గా పనిచేస్తోంది.
ప్రస్తుతం సెలవులు కావడంతో స్వగ్రామమైన బైరవునిపల్లి వచ్చింది. అదే గ్రామానికి చెందిన సొంటి శ్రీను తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని ఆమెను కొన్నాళ్లుగా వేధిస్తున్నాడు. రెండు రోజుల క్రితం ఇంటికి వెళ్లి కొట్టినట్లు తెలిసింది. ఈనేపథ్యాన శుక్రవారం కూడా సైదమ్మ ఒంటరిగా ఉన్నట్లు తెలుసుకున్న శ్రీను వెళ్లి గొడవకు దిగాడు. ఆమె తనను నిరాకరించిందన్న కోపంతో ముందుగానే సిద్ధం చేసుకున్న కత్తితో మూడు చోట్ల బలంగా పొడిచాడు.
ఆపై చేతులను కత్తితో ఇష్టానుసారంగా కోశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సైదమ్మ రక్తపు మడుగులో పడి పోయింది. దీంతో స్థానికులు ఆమెను నేలకొండపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇదిలా ఉండగా శ్రీను సైతం అదే కత్తితో పొడుచుకోగా పేగులు బయటకు రావడంతో అపస్మారక స్థితిలో పడిపోయాడు. ఆయనను ఖమ్మం తరలించగా పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉండగా, సెలవుల్లో ఇంటికి రాకుండా కోదాడలో ఉన్నా బతికేదని వారు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.
భారీ బందోబస్తు
హత్య జరగడంతో బైరవునిపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. సైదమ్మ కుటుంబ సభ్యులు, బంధువులు హత్య చేసిన శ్రీను కోసం గ్రామంలో గాలించారు. కానీ ఆయన సైతం ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుసుకున్న వారు ఆగ్రహంతో ఉండగా.. ఎలాంటి ఘటనలు జరగకుండా ఖమ్మం రూరల్ సీఐ రాజిరెడ్డి ఆధ్వర్యాన నేలకొండపల్లి, ముదిగొండ ఎస్సైలు తోట నాగరాజు, నరేష్, సిబ్బందితో పహారా ఏర్పాటు చేశారు. ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment