What Led To Railway Cop Shooting 4 Dead On Train - Sakshi
Sakshi News home page

జైపూర్ కాల్పుల ఘటన.. ఆ రోజు రాత్రి రైలులో ఏం జరిగింది..?

Published Tue, Aug 1 2023 7:00 PM

What Led To Railway Cop Shooting 4 Dead On Train - Sakshi

జైపూర్: జైపూర్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తన సహోద్యోగులతో సహా తోటి ప్రయాణికులను కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో నిందితుడు చేతన్ సింగ్‌తో పాటు డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ఘన్‌శ్యామ్ ఆచార్య.. ఆ రోజు రాత్రి రైలులో ఏం జరిగిందో సవివరంగా పోలీసులకు వివరించాడు.

కాల్పులకు ముందు కానిస్టేబుల్ చేతన్ సింగ్ తనకు ఆరోగ్యం సరిగా లేదని సీనియర్ అధికారికి తెలిపినట్లు ఘన్‌శ్యామ్ వెల్లడించారు. రైలు దిగిపోతానని చెప్పాడని పేర్కొన్నాడు. అయితే.. షిఫ్ట్ పూర్తి చేసుకునే వెళ్లమని సీనియర్ అధికారుల నుంచి ఆదేశాలు రావడంతో కోపోద్రిక్తుడైన చేతన్ సింగ్ కాల్పులకు తెగబడ్డాడని వెల్లడించారు. అంతకు ముందే చేతన్ సింగ్‌తో వాగ్వాదం జరిగిందని, అక్కడ తన గొంతును నులిమే ప్రయత్నం చేశాడని ఘన్‌శ్యామ్ పేర్కొన్నాడు. 

'దిగిపోతా..'
ఘన్‌శ్యామ్‌, సీనియర్ అధికారి టిమారమ్ మీనా(58), కానిస్టేబుల్ నరేంద్ర పర్‌మార్(58), చేతన్ సింగ్‌(33)లు డ్యూటీలో ఉన్నారు. అర్ధరాత్రి 2.53 సమయంలో మీనా, చేతన్ సింగ్‌లు ఏసీ కోచ్‌లో పర్యవేక్షిస్తున్నారు. పర్‌మార్, శ్యామ్ స్లీపర్ కోచ్‌లో ఉన్నారు. ఘన్‌శ్యామ్‌ రిపోర్టును ఇవ్వడానికి వెళ్లిన క్రమంలో చేతన్, మీనాతో సహా మరో ఇద్దరు టికెట్ కలెక్టర్‌లు ఉన్నారు. అయితే.. చేతన్ ఆరోగ్యం బాగులేదని రైలు దిగిపోతానని మీనాకు చెప్పారు. కానీ కేవలం రెండు గంటలు డ్యూటీ మాత్రమే మిగిలి ఉందని మీనా చేతన్‌ను సముదాయించారు.

'డ్యూటీ పూర్తి చేయాలని..'
కానీ చేతన్.. మీనా మాటలు వినడానికి సిద్ధంగా లేరు. అయితే చేతన్ విషయాన్ని ఎన్స్‌పెక్టర్‌కు తెలిపాడు మీనా. అటు నుంచి కంట్రోల్ రూమ్‌కు కూడా సమాచారం అందించాడు. కానీ డ్యూటీ పూర్తి చేసుకుని ముంబయి ఆస్పత్రిలో చికిత్స తీసుకోమని ఆదేశాలు వచ్చాయి. ఈ విషయాన్ని చేతన్‌కు చెప్పగా ఆయన వినిపించుకులేదు. అయితే.. చేతన్ వద్ద గన్‌ తీసుకుని, విశ్రాంతి తీసుకోమన్నారు. పక్కనే ఉన్న బెడ్‌పైన పడుకోమన్నారు.

గొంతు నులిమి..
కొద్ది సేపటికే తిరిగి వచ్చిన చేతన్ తన గన్‌ను తనకు ఇచ్చేయమని అడిగాడు. వద్దని వారించిన ఘన్‌శ్యామ్ గొంతును నులిమే ప్రయత్నం చేశాడు. ఘన్‌శ్యామ్‌, చేతన్‌ల గన్‌లు తారుమారు అయ్యాయి. ఎవరి గన్‌లు వారికి ఇప్పించడానికి వచ్చిన సీనియర్ అధికారి మీనాపై చేతన్ తిరగబడ్డాడు. వాగ్వాదం సాగింది కాసేపు. ఆ తర్వాత ఘన్‌శ్యామ్ అక్కడి నుంచి వెళ్లాడు. కాసేపటికే చేతన్ ఫైరింగ్ మొదలుపెట్టాడు. మీనాతో సహా మరో ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. 

ఈ ఘటన జరిగే సమయంలో గన్ పేలుడు శబ్దాలు విని బాత్రూంలో దాక్కున్నట్లు ఘన్‌శ్యామ్ తెలిపారు. మిగిలిన కానిస్టేబుళ్ల క్షేమాన్ని కనుకుని, కంట్రోల్‌ రూంకు సమాచారం అందించాడు. అనంతరం రైలును చైన్‌ లాగి నిందితుడు పారిపోయాడని ఘన్‌శ్యామ్ తెలిపారు. 

ఇదీ చదవండి: జైపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఘటన: చేతన్‌ షార్ట్ టెంపర్‌.. అందుకే ఈ ఘోరం!

Advertisement
 
Advertisement
 
Advertisement