అమరం.. స్మరణం | Sakshi
Sakshi News home page

అమరం.. స్మరణం

Published Sat, Apr 20 2024 1:30 AM

ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం.
 - Sakshi

బాధను పంచుకోవాలి
విద్యార్థులు అన్ని విషయాలను అధ్యాపకులతో పంచుకోవాలని కార్పొరేట్‌ ట్రైనర్‌ తిరుమల్‌రెడ్డి సూచించారు.
వాతావరణం
ఆకాశం కొంతమేకు మేఘావృతమవుతుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. వేడి, ఉక్కపోత కొనసాగుతుంది. సాయంత్రం వర్షం పడే అవకాశం ఉంది.

8లోu

ఇంద్రవెల్లి: 1981 ఏప్రిల్‌ 20 జల్‌..జంగల్‌...జమీన్‌ కోసం ఉద్యమించిన అడవిబిడ్డలపై అప్పటి సర్కారు తుపాకీ ఎక్కుపెట్టింది. తూటాల వర్షం కురిపించింది. హక్కుల సాధనలో 15 మంది గిరిజనులు అమరులయ్యారు. వారి రక్తపుటేరులతో తడిసిన పచ్చని వనం ఎరుపెక్కింది. అడవిబిడ్డల అమరత్వం నింగికెగిసిన అగ్ని శిఖలా ఇంద్రవెల్లిలో అమరుల స్తూపమై నిలిచింది. ఈ ఘటనకు 43 ఏళ్లు. అయితే ఇప్పటికీ ఆ స్తూపం వద్ద ఏటా ఆదివాసీలు స్వేచ్ఛగా నివాళులు అర్పించలేని పరిస్థితి. నాడు పూర్తిగా పోలీసు నిఘాలోనే స్తూపం ఉండేది. 2015లో తొలిసారిగా ఆంక్షలతో కూడిన అనుమతి ఇవ్వడంతో ఆదివాసీలు వచ్చి అమరులకు నివాళులర్పిస్తున్నారు. ఈసారి ఉమ్మడి జిల్లా నుంచి ఆదివాసీలతోపాటు జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్‌, ఆదివాసీ ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరుకానున్నారు. స్తూపం వద్ద ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

33 ఏళ్లుగా నివాళులకు దూరం

నాటి కాల్పుల ఘటన సాక్షిగా ఇంద్రవెల్లి సమీపంలో స్తూపం నిర్మించారు. ఆ రోజు నుంచి ఉమ్మడి రాష్ట్రం పాలన ముగిసే వరకు 33 ఏళ్లుగా అమరులకు నివాళులర్పించడానికి అనుమతి ఇవ్వలేదు. ఏటా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేసే వారు. ఈ క్రమంలో 2004 అప్పటి బోథ్‌ ఎమ్మెల్యే సోయం బాపూరావ్‌ గిరిజన నాయకులతోపాటు అప్పటి ఎంపీ మధుసూదన్‌రెడ్డితో కలిసి ఏప్రిల్‌ 25న నివాళులర్పించారు. అప్పటి నుంచి ఏటా ఆదివాసీ గిరిజనులు అదేరోజున నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆదివాసీ సంఘాల కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా ఆంక్షలు సడలించి స్తూపం వద్ద ఏప్రిల్‌ 20న నివాళులు అర్పించేందుకు రెండు గంటల సమయం ఇచ్చింది. దీంతో ఆదివాసీ సంప్రదాయ రీతిలో పూజలు చేసి నివాళులర్పిస్తున్నారు.

ఎట్టకేలకు స్మృతి వనం, ఇళ్ల స్థలాలు

నాడు హక్కుల కోసం పోరాడిన ఆదివాసీలపై అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం పోలీసులతో దాడి చేయించడంతో అనేక మంది ప్రాణాలు కోల్పోవడంతోపాటు గాయాలపాలయ్యారు. అయితే బాధిత కుటుంబాలను ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. మూడేళ్ల క్రితం అమరుల కుటుంబాలను గుర్తించిన ఎంపీ సోయం బాపూరావు రూ.10 వేల చొప్పున ఆర్థికసాయం అందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో సీఎం రేవంత్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క స్పందించారు. పోలీస్‌ శాఖలో ఉన్న రికార్డుల ప్రకారం 15 మంది అమరవీరుల కుటుంబాలకు ఇటీవల మండలంలోని ముత్నూర్‌ సమీపంలో ఇళ్ల స్థలాలు కేటాయించారు. హక్కు పత్రాలతోపాటు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారు. అమరవీరుల స్తూపాన్ని స్మృతి వనంగా తీర్చదిద్దేందుకు రూ.97 లక్షలు కేటాయించారు.

రెండోసారి స్మారక స్తూపం నిర్మాణం.

ఆదివాసీల స్మారకార్థం రైతు కూలీ సంఘం ఇంద్రవెల్లిలో 80 అడుగుల స్తూపాన్ని నిర్మించింది. ఆ స్తూపాన్ని 1986 మార్చిలో గుర్తుతెలియని వ్యక్తులు డైనమేట్లతో పేల్చారు. గిరిజనుల ఆందోళనలతో 1987లో ప్రభుత్వం ఐటీడీఏ నిధులతో రెండోసారి స్తూపం నిర్మించింది.

పోలీసు బందోబస్తు..

సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఇంద్రవెల్లి మండలంలో శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఉట్నూర్‌ డీఎస్పీ నాగేందర్‌ ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, ఏడుగురు ఎస్సైలతోపాటు 100మందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు.

అసలేం జరిగింది.

స్వాతంత్య్రం వచ్చి అప్పటికీ మూడున్నర దశాబ్దాలవుతున్నా ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. ఈ క్రమంలో 1981లో చట్టబద్ధమైన హక్కుల సాధన కోసం పిపుల్స్‌వార్‌ ఆధ్వర్యంలో గిరిజన రైతు కూలీ సంఘం పేరిట ఇంద్రవెల్లిలో గిరిజన బహిరంగ సభ ఏర్పాటు చేశారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా ఆ రోజు సోమవారం వారసంత కావడంతో ఉదయం నుంచే ఆదివాసీలు భారీగా తరలివచ్చారు. మధ్యాహ్నం 3 గంటల వరకే సభప్రాంగణం గిరి పుత్రులతో కిక్కిరిసిపోయింది. సభా స్థలాన్ని ఖాళీ చేయాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అయినా వినకుండా మరికొందరు గిరిజనులు ర్యాలీగా అక్కడికి బయలుదేరారు. వారిని అడ్డుకునే క్రమంలో ముందున్న గిరిజన యువతితో ఓ పోలీసు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె వెంటనే పోలీసుపై దాడి చేయగా ఆయన నెలకొరిగాడు. పరిస్థితి చేయిదాటి పోవడంతో పోలీసులు తూటాల వర్షం కుర్పించారు. రక్తం ఏరులై పారింది. ఈ ఘటనలో 15మంది ఆదివాసీలు మాత్రమే చనిపోయినట్లు ప్రభుత్వ రికా ర్డుల్లో ఉంది. కానీ అప్పుడు తూటాల గాయాలతో తమ ఇళ్లకు వెళ్లి పోలీసుల భయంతో బయటకు రాలేక, వైద్యం అందక 60 మంది వరకు చనిపోయినట్లు పౌరహక్కుల సంఘం నిజనిర్ధారణ కమిటీ తమ నివేదికలో స్పష్టం చేసింది.

గాయంతో ఏ పని చేయలేను..

నాడు ఇంద్రవెల్లిలో వారసంత ఉండడంతో నా భర్త శంభుతో కలిసి వెళ్లిన. సంత నుంచి మిటింగ్‌కు వెళ్లినం. అక్కడ పోలీసుల కాల్పుల్లో నా కుడి చేయికి గాయమైంది. నా భర్త శంభు కూడా బుల్లెట్ల గాయంతో ఇంటికొచ్చి కొద్ది రోజుల తరువాత చనిపోయాడు. చేతి గాయం కారణంగా ఇప్పటికీ నేను ఎలాంటి పని చేయలేకపోతున్నా. ఉన్న ఒక్క కొడుకు కూడా అనారోగ్యంతో చనిపోయిండు. కోడలు వద్ద ఉంటున్న. ఆసరా పింఛన్‌ కూడా రావట్లేదు. కష్టంగా ఉంది. ప్రభుత్వం ఆదుకోవాలి.

– మడావి జంగుబాయి, కన్నాపూర్‌

నా భర్తను కోల్పోయిన..

నాటి ఘటనలో నా భర్త కొద్దు మరణించాడు. ఆ తరువాత కూలి పనులు చేసుకుంటూ నా కొడుకును పెంచి పెద్ద చేసిన. ఇప్పటి వరకు ఉండేందుకు ఇల్లు కూడా లేదు. ఇటీవల ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు. అయితే ఇందిరమ్మ నిధులతో ఇల్లు కట్టించి ఇవ్వాలి. ఐటీడీఏ ద్వారా రుణం అందించి నా కొడుకుకు ఉపాధి చూపాలి.

– సేడ్మకి లచ్చుబాయి, తాటిగూడ

ఇంద్రవెల్లి ఘటనకు 43 ఏళ్లు

ఎట్టకేలకు అమరులను గుర్తించినరాష్ట్ర ప్రభుత్వం

నేడు అమరవీరుల సంస్మరణ దినం

ఉమ్మడి జిల్లా నుంచి తరలిరానున్న ఆదివాసీలు

1/2

2/2

Advertisement
Advertisement