ఒడిశాలో చక్రం తిప్పుతున్న తమిళ తేజం
నవీన్ వారసుడంటూ చర్చలు
విపక్షాల లక్ష్యం ఆయనే
వి.కార్తికేయన్ పాండియన్. వయసు 49. వదులు చొక్కా, సాదాసీదా ప్యాంటు, కాళ్లకు చెప్పులు. అత్యంత నిరాడంబరమైన ఆహార్యం. కానీ ఒడిశా సీఎం, బిజూ జనతాదళ్ చీఫ్ నవీన్ పటా్నయక్ తర్వాత రాష్ట్రమంతటా ఆ స్థాయిలో మారుమోగుతున్న పేరు. నవీన్ వెనుక ఆయనే ప్రధాన చోదక శక్తి. అత్యంత నమ్మకస్తుడు కూడా.
ఇటీవలే ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి బీజేడీలో చేరారు. ప్రభుత్వాధికారిగా ‘సూపర్ సీఎం’ అని, పారీ్టలో చేరాక ‘నంబర్ టూ’అని ముద్రపడ్డారు. పటా్నయక్ సలహాదారుగా, ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్ 5టీ చైర్మన్‌గా కేబినెట్ హోదాలో ఉన్నారు. బీజేడీ ప్రధాన ప్రచారకర్తగా దూసుకుపోతున్నారు. ప్రధాని మోదీ మొదలుకుని రాహుల్‌గాంధీ దాకా పాండియన్‌నే లక్ష్యం చేసుకుని విమర్శలు చేస్తున్నారంటే ఒడిశా ఎన్నికలను ఆయన ఎంతగా ప్రభావితం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు! పటా్నయక్ రాజకీయ వారసునిగా కూడా పాండియన్ పేరు మారుమోగుతోంది...
పాండియన్‌ది తమిళనాడులోని మదురై. 2000 బ్యాచ్ పంజాబ్ కేడర్ ఐఏఎస్ అధికారి. ఒడిశాకు చెందిన ఐఏఎస్ అధికారి సుజాత రౌత్‌ను పెళ్లాడారు. అలా 2002లో ఒడిశా కేడర్‌కు మారడం ఆయన కెరీర్‌లో కీలక మలుపు. ధర్మగఢ్ సబ్ కలెక్టర్‌గా ఒడిశాలో కెరీర్ ప్రారంభించారు. సీఎం సొంత జిల్లా మయూర్‌భంజ్, గంజాం కలెక్టర్‌గా చేశారు.
2011 నుంచి 12 ఏళ్లు పటా్నయక్ వ్యక్తిగత కార్యదర్శిగా చేశారు. ఆయనకు అత్యంత నమ్మకస్తునిగా మారారు. ఒడియా అనర్గళంగా మాట్లాడుతూ పలు కార్యక్రమాల ద్వారా ప్రజలకూ చేరువయ్యారు. 2023లో వీఆర్‌ఎస్ తీసుకుని బీజేడీలో చేరారు. నాటినుంచి పార్టీ నిర్ణయాలన్నింట్లోనూ ఆయనదే కీలక పాత్ర. 2014, 2019ల్లోనూ పటా్నయక్ ఎన్నికల వ్యూహాల్లో తెరవెనుక పాత్ర పాండియన్‌దే.
ప్రభుత్వానికి, ప్రజలకు వారధి
ఒడిశాలో నవీన్ ప్రజాదరణకు మూల కారణమైన ఫ్లాగ్‌షిప్ కార్యక్రమాలన్నింటి వెనకా ఉన్నది పాండియనే. సాధారణంగా యంత్రాంగంపై రాజకీయ ఆధిపత్యం దేశమంతటా ఉండే సమస్య. ఒడిశా మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడం నుంచి వాటిపై స్పందన తెలుసుకునే దాకా అంతా ఐఏఎస్‌ల మయం. ఇందుకోసం పాండియన్ సారథ్యంలో ఐఏఎస్‌ల బృందమే పని చేసింది! ఒడిశాలో బజ్ వర్డ్‌గా మారిన 5టీ (బృంద కృషి, సాంకేతికత, పారదర్శకత, పరివర్తన, సమయం) సూత్రధారి కూడా పాండియనే. 2019 నుంచి అధికారులకు, ప్రాజెక్టులకు ఇదే మార్గదర్శి! దీనిలో భాగంగా నాలుగేళ్లలో ఏకంగా 460 రకాల ప్రభుత్వ సేవలు ఆన్‌లైన్‌లోకి వచ్చాయి.
హెలికాప్టర్ వివాదం..
ప్రభుత్వ వ్యవహారాలతో పాటు రాజకీయంగానూ బీజేడీలో అడుగడుగునా పాండియన్‌దే జోక్యం. 2019 ఎన్నికల్లో పార్టీ వ్యూహాలు, ఎత్తుగడల నుంచి టికెట్ల పంపిణీ దాకా అన్నింటా ఆయనదే ప్రధాన భూమిక! అధికారిగా ఉంటూ ప్రభుత్వ హెలికాప్టర్‌లో 30 జిల్లాల్లోనూ పాండియన్ సుడిగాలి పర్యటన చేయడం తీవ్ర వివాదం రేపింది. ఇవి బీజేడీ ర్యాలీల్లా ఉన్నాయంటూ విపక్షాలు దుయ్యబట్టాయి.
ఆలిండియా సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించారంటూ ఆయనపై కేంద్రానికి బీజేపీ ఫిర్యాదు కూడా చేసింది! పాండియన్ పెత్తనంపై బీజేడీలోనూ అసమ్మతి మొదలైంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయన సీఎం పక్కనే ఉండటమే గాక ఒక్కరే సమావేశాలూ నిర్వహించడం, మంత్రులను కూడా పక్కకు పెట్టడం తీవ్ర అసంతృప్తికి దారి తీసింది. అయినా పటా్నయక్ పట్టించుకోలేదు. పైగా పాండియన్‌ను విమర్శించినందుకు బీజేడీ ఉపాధ్యక్షురాలు, ఎమ్మెల్యే సౌమ్య రంజన్‌ను పదవి నుంచి తొలగించారు!
నవీన్ వారసుడు...?!
నవీన్ పూర్తిస్థాయిలో ‘ఒడియా అస్తిత్వ’ నినాదాన్ని ఎత్తుకునేలా చేసింది పాండియనే. దాంతో విపక్షాల విమర్శలకు ఆయనే లక్ష్యంగా మారారు. ‘‘పాండియన్ వల్ల ఒడియా ఉనికే ప్రమాదంలో పడింది. సమీప భవిష్యత్తులో బయటి వ్యక్తి ఒడిశా పాలకుడుగా మారే ప్రమాదముంది’’ అంటూ విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. బీజేపీ కూడా బీజేడీని ఎదుర్కోవాలంటే పాండియన్‌ను ఎదుర్కోవాలన్న ఆలోచనకు వచి్చంది.
అందుకే ఆయన ‘బయటి వ్యక్తి’ అంటూ ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలంతా పదేపదే విమర్శిస్తున్నారు. ‘‘ఒడియా అస్మిత (ఆత్మగౌరవం) ప్రమాదంలో పడింది. ప్రజలు దీన్ని ఎక్కువ కాలం సహించబోరు’’ అని మోదీ ఇటీవల స్థానిక ప్రచార సభలో అన్నారు. పాండియన్ మాత్రం వీటిని తేలిగ్గా తోసిపుచ్చుతున్నారు. ‘‘నవీన్ పటా్నయక్ విలువలకు నేను సహజ వారసుడిని. ఒడిశా నా కర్మభూమి. పాతికేళ్లుగా ఇక్కడే పని చేస్తున్నా. నా భార్య, పిల్లలూ ఇక్కడివాళ్లే. ఒడిశా ప్రజలు నన్ను తమ వ్యక్తిగా ప్రేమిస్తున్నారు’’ అంటారు!
– సాక్షి, న్యూఢిల్లీ
Comments
Please login to add a commentAdd a comment