చట్టం చేసైనా సరే ఎస్సీ వర్గీకరణ: కిషన్‌రెడ్డి | Sakshi
Sakshi News home page

చట్టం చేసైనా సరే ఎస్సీ వర్గీకరణ: కిషన్‌రెడ్డి

Published Tue, Nov 14 2023 5:21 AM

BJP Leader Kishan Reddy On SC Classification - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందని, వర్గీకరణను అమలు చేసే బాధ్యతను భుజస్కంధాలపై పెట్టుకుందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు కేంద్రం సానుకూలంగా ఉందని సుప్రీంకోర్టుకు తెలియజేయడంతో పాటు దీనిపై ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి, వేగవంతంగా చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. ఒకవేళ కోర్టు ద్వారా ఇది సాధ్యం కాకపోతే చట్ట పరంగా చేసేందుకు కూడా బీజేపీ, కేంద్రం కట్టుబడి ఉన్నాయని స్పష్టం చేశారు. తాజాగా కేంద్రం ఏర్పాటు చేసే టాస్క్‌ఫోర్స్‌ కమిటీ వర్గీకరణ చేయాలా..? వద్దా..? అన్న అంశంపై కాదని, వర్గీకరణపై కోర్టు కేసులు, ఇతర ప్రాధాన్యతాంశాలను రోజువారీ పర్యవేక్షించేందుకేనని స్పష్టం చేశారు. కిషన్‌రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు. 

కాంగ్రెస్సే మొదటి ముద్దాయి 
సామాజిక న్యాయం కోసం జరుగుతున్న పోరాటాల్లో ప్రధాని మోదీ స్వయంగా పాల్గొని న్యాయం, ధర్మం గురించి మాట్లాడిన తీరు యావత్‌ దేశాన్ని ఆశ్చర్యానికి గురి చేసిందని కిషన్‌రెడ్డి చెప్పారు. ప్రధాని స్థాయి వ్యక్తి ఒక సమస్యపై చొరవ తీసుకుని చర్చిస్తే దానిని జీర్ణించుకోలేక కాంగ్రెస్‌ నేతలు కోడిగుడ్డుమీద ఈకలు పీకినట్టుగా ఇష్టారీతిన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. స్వాతంత్య్రం వచ్చాక 75 ఏళ్లలో ఎస్సీ వర్గీకరణపై వివిధ కమిటీలు వేయగా, అనేక పోరాటాలు జరిగాయని చెప్పారు. దీనికి అనుకూలమంటూ కంటి తుడుపు చర్యలు చేపట్టడమే తప్ప ఎవరూ దీని గురించి పట్టించుకోలేదని విమర్శించారు. ఈ విషయంలో దశాబ్దాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్సే మొదటి ముద్దాయి అని పేర్కొన్నారు. ఉషా మెహ్రా కమిషన్‌ సమర్పించిన నివేదికను కనీసం చదవకుండా కోల్డ్‌ స్టోరేజీలో పెట్టిన చరిత్ర కాంగ్రెస్‌దని ధ్వజమెత్తారు.  

తీర్మానంతో చేతులు దులుపుకున్న బీఆర్‌ఎస్‌ 
పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులుపుకుందని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఢిల్లీకి వెళ్లి దీని సాధనకు ఎలాంటి కృషి చేయలేదని, పార్లమెంట్‌లో సైతం బీఆర్‌ఎస్‌ ఎంపీలు ఏనాడూ ఈ అంశాన్ని లేవనెత్తలేదని ధ్వజమెత్తారు. ఈ సమస్యపై బీజేపీ జాతీయ నాయకత్వం స్పందించిందని, ప్రధాని మోదీ సూచనలతో గతనెల 2న ఢిల్లీలో ఎమ్మారీ్పఎస్‌ నేతలు, మేధావులు, ఉద్యోగ సంఘాల నాయకులతో అమిత్‌షా భేటీ అయ్యాక ఈ అంశంపై కదలిక వచ్చిందని చెప్పారు.

కేంద్రం వర్గీకరణకు సానుకూలంగా ఉందని గతనెల 2న సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారని, ఏడుగురు జడ్జీల బెంచ్‌ను వేయాలని కోరగా గతనెల 10న సీజే రాజ్యాంగ ధర్మాసనాన్ని వేశారని తెలిపారు. మోదీ ఉంటే ఏదైనా సాధ్యమనే దానికి ఆర్టికల్‌ 370 రద్దు, ట్రిపుల్‌ తలాఖ్, రామజన్మభూమి ఆలయ నిర్మాణం, మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు ఆమోదం, ఉక్రెయిన్, ఇజ్రాయెల్‌ నుంచి భారతీయుల సురక్షిత తరలింపు వంటివి నిదర్శనమని కిషన్‌రెడ్డి చెప్పారు.   

Advertisement
Advertisement