మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి | Sakshi
Sakshi News home page

మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి

Published Fri, May 10 2024 10:30 PM

మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు అన్ని విధాలా అన్యాయం చేసిందని.. అందుకే మోదీని ఈ ఎన్నికల్లో ప్రజలు గద్దె దించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ పిలుపునిచ్చారు. నగరంలోని పాతబస్తీలో ఉన్న లెనిన్‌భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడారు. ప్రధాని మోదీ 2014, 2019, 2024 ఎన్నికల సందర్భంగా ప్రచారం నిమిత్తం రాష్ట్రానికి వచ్చి ఏపీ అభివృద్ధికి ఎలాంటి ప్రకటన చేయకుండా కేవలం మాయ మాటలు చెప్పి, రోడ్‌ షోలు చేసి వెళుతున్నారని విమర్శించారు. 2019లో తిట్టిన వారినే ఇప్పుడు పక్కన పెట్టుకుని మోదీ మాట్లాడుతున్నారని చెప్పారు. మోదీ 2014లో రాష్ట్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో జాతీయ స్థాయిలో ఎన్డీఏ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో నిర్ధేశించిన ఏపీకి ప్రత్యేక హోదా, కడపలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, రామాయపట్నం పోర్టు నిర్మాణం వంటి ఇతర విభజన హామీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కార్పొరేట్‌ వ్యక్తి సుజనాచౌదరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేయటం సరికాదన్నారు. విజ్ఞులైన ప్రజలు ఆలోచన చేసి ఓట్లు వేయాలన్నారు. సుజనాచౌదరి ఇచ్చే డబ్బు సంచులకు ఆశపడి విజయవాడ ప్రతిష్టతను మంటగలపవద్దన్నారు. ఎన్నికల సమన్వయ కమిటీ కన్వనర్‌ దోనేపూడి శంకర్‌, నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెన్మెత్స దుర్గాభవాని పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement