కశ్మీర్‌లో సీట్ల సర్దుబాటు: ఒమర్ అబ్దుల్లాతో చర్చించనున్న కాంగ్రెస్‌ | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌లో సీట్ల సర్దుబాటు: ఒమర్ అబ్దుల్లాతో చర్చించనున్న కాంగ్రెస్‌

Published Fri, Feb 23 2024 3:17 PM

Congress To Discuss Farooq Abdullah Party For Lok sabha Seat Sharing - Sakshi

లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష ఇండియా కూటమితో పొత్తు లేకుండా తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఇటీవల జమ్మూకశ్మీర్‌కు చెందిన నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ.. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీకి మూడు స్థానాల్లో పోటీకి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

లోక్‌సభ ఎ‍న్నికల్లో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ 3-3 సీట్ల పంపకం ఫార్మూలాను ప్రతిపాదించింది. అయితే ఈ విషయంపై ఈరోజు (శుక్రవారం) నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లాతో చర్చలు జరపనున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ ప్రతిపాదనకు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అంగీకరిస్తే.. మెహబూబా ముఫ్తికి చెందిన పీడీపీ పార్టీకి పొత్తులో చోటు దక్కే అవకాశం లేదని తెలుస్తోంది. పీడీపీ కూడా ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షం కావటం గమనార్హం.

అయితే ఫిబ్రవరి 15న ఫరూక్‌ అబ్దుల్లా తాము లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆయన ప్రకటన అనంతరం.. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా మాత్రం తమ పార్టీ ఇండియా కూటమితో పొత్తుకు కట్టుబడి ఉందని తెలిపారు.

జమ్మూలో రెండు, లడఖ్‌లో ఒక స్థానంలో తమ పార్టీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉ‍న్నట్లు కూడా చెప్పారు. ఇక మరోవైపు పీడీపీ ఇండియా కూటమి నుంచి వైదొలిగి తన పార్టీ కూడా ఒంటరిగా బరిలోకి దిగుతుందని వార్తలు వచ్చాయి. వాటిపై ఆమె స్పందిస్తూ.. తాను ఇండియా కూటమితోనే ఉంటానని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement