దేశ భద్రత కోసమే రాహుల్‌ పోరాటం | Sakshi
Sakshi News home page

దేశ భద్రత కోసమే రాహుల్‌ పోరాటం

Published Fri, Sep 8 2023 1:50 AM

Revanth Reddy On Rahul Gandhi Bharat Jodo Yatra - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ / ఖైరతాబాద్‌ / దిల్‌సుఖ్‌నగర్‌ / గచ్చిబౌలి: దేశాన్ని ఒక్కటి చేసేందుకే రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర చేశారని తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. యాత్ర ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా సోమాజిగూడ రాజీవ్‌గాంధీ విగ్రహం నుంచి ఇందిరాగాంధీ, డాక్టర్‌ అంబేడ్కర్‌ విగ్రహాల వరకు నగర కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో గురువారం పాదయాత్ర చేపట్టారు.

కాంగ్రెస్‌ పార్టీ నేతలతో పాటు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి ఐమాక్స్‌ ఇందిరాగాంధీ రోటరీ చౌరస్తాలో మాట్లాడుతూ.. దేశ భద్రత, సమగ్రత కోసం రాహుల్‌ పోరాటం చేస్తున్నారని చెప్పారు. మహాత్మాగాంధీని ఆదర్శంగా తీసుకొని అహింసా పోరాటాన్ని పునాదిగా వేసి కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు 150 రోజులు, 4,183 కిలోమీ టర్లు రాహుల్‌ గాంధీ నడిచారని గుర్తు చేశారు.

కల్వకుంట్ల కుటుంబాన్ని పొలిమేర దాటించాలి
రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న కల్వకుంట్ల కుటుంబాన్ని పొలిమేర దాటే వరకు తరమాల్సిన బాధ్యత ప్రజ లందరిమీద ఉందని రేవంత్‌ అన్నారు. కేసీఆర్‌ను గెలిపించాలని ప్రతిసారీ అసదుద్దీన్‌ చెప్తున్నాడని, అసలు ఎందుకు గెలిపించాలని నిలదీశారు. త్రిపు ల్‌ తలాక్‌కు మోదీకి మద్దతుగా నిలిచినందుకా, 370 ఆర్టికల్‌కు ఓటు వేసినందుకా, నోట్ల రద్దు, జీఎస్టీలో మద్దతు తెలిపినందుకు గెలిపించాలా.. అని  అసదుద్దీన్‌ను ప్రశ్నించారు. లక్ష కోట్లు లూటీ చేసిన కేసీఆర్‌ ఫ్యామిలీకి మద్దతు తెలుపుతున్నారంటే దాని ఆంతర్యమేంటన్నారు. 

దేశ హోంమంత్రికి చిల్లర రాజకీయం తగునా
16,17,18 తేదీల్లో  సీడబ్ల్యూసీ సమావేశాన్ని హైదరాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించాలని తలపెడితే అధికారం ఉంది కదా అని తాము బుక్‌ చేసుకున్న గ్రౌండ్‌ను రద్దు చేసి బీజేపీ వాళ్లు గుంజుకున్నారని రేవంత్‌ నిందించారు. ఇంత చిల్లర రాజకీయం హోంశాఖ మంత్రి చేయడం భావ్యమా అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసి కుట్ర చేశాయని, ఇందుకు ప్రతిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్‌ కార్యకర్తలంతా కదలి వచ్చి మూడు రోజులపాటు హైదరాబాద్‌ నగరాన్ని చుట్టుముట్టాలని, అత్యద్భుతంగా ఏఐసీసీ సమావే శాలు నిర్వహిద్దామని పిలుపునిచ్చారు.

ఏఐసీసీ ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే మాట్లాడుతూ... దేశాన్ని కలిపేందుకు ధర్మాలను ఒకటి చేసేందుకు రాహుల్‌ గాంధీ యాత్ర చేశారని ఇది ప్రపంచ రికార్డ్‌ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు హన్మంతరావు, పొన్నాల లక్ష్మయ్య, అజారుద్దీన్, అంజన్‌కుమార్‌ యాదవ్, అనిల్‌కుమార్‌ యాదవ్, రోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కొత్తపేటలో భట్టి.. కోదాడలో ఉత్తమ్‌..ఎల్బీనగర్‌లో యాష్కీ
రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు పాదయాత్ర చేపట్టా యి. మహేశ్వరం నియోజకవర్గంలోని కొత్తపేటలో జరిగిన పాదయాత్రలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, కోదాడలో జరిగిన యాత్రలో నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎల్బీనగర్‌లో జరిగిన కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌ పాల్గొన్నారు.

రేపు భట్టి పాదయాత్ర ‘డైరీ’ విడుదల
రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర డైరీని శనివారం ఆవిష్కరించనున్నారు. సీనియర్‌ జర్నలిస్టు, ప్రెస్‌ అకాడమీ మాజీ చైర్మన్‌ సురేందర్‌ రచించిన ఈ డైరీని గాంధీభవన్‌లో విడుదల చేయనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే హాజరుకానున్నారు.

మేకిన్‌ ఇండియా అని భారత్‌ పేరు పెడతారా..
మేకిన్‌ ఇండియా అన్న పీఎం మోదీ ఇప్పుడు ఇండియా పేరు తీసేసి భారత్‌ పేరు పెడతాననడం ఏంటని రేవంత్‌ ప్రశ్నించారు. దేశ ప్రజలకు ప్రమాదకరంగా మారిన ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించాలని కాంగ్రెస్‌ నేతృత్వంలో 28 పార్టీలు కలిసి ఇండియా కూటమి కడితే..  దాన్ని ఎదుర్కోలేక ఇండియా పేరు మారుస్తానన్న భావదారిద్య్రం ప్రధాన మంత్రికి, బీజేపీకి వచ్చిందంటే సిగ్గుపడాలన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలే గానీ ఈ దేశం పేరు మారిస్తే ఎవరి బతుకుల్లోనూ మార్పులు రావన్నారు. మోదీ పాలనలో దేశ భద్రతకే ముప్పు వాటిల్లిందని ఆందోళన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌కు అధికారం ఖాయం: పొంగులేటి
రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికా రంలోకి వస్తుందని... అందరికీ ఇందిరమ్మ పథకాలు అందిస్తుందని తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ప్రచార కమిటీ కో–చైర్మన్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. సీనియర్‌ నేత రఘునాథ్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో కొండాపూర్‌లో ర్యాలీ నిర్వహించారు. పొంగులేటి మాట్లాడుతూ జోడో యాత్రలో ప్రజా సమస్యలను తెలుసుకున్న రాహుల్‌ ప్రధాని అయిన తరువాత పరిష్కరిస్తారని తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement