రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి  | Sakshi
Sakshi News home page

రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి 

Published Fri, May 26 2023 2:52 AM

Revanth Reddy should apologize - Sakshi

కవాడిగూడ (హైదరాబాద్‌):  మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు గొల్లకురుమల వృత్తిని కించపరిచేలా, యాదవుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని, దీనికి రేవంత్‌రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మ న్‌ గెల్లు శ్రీనివాస్‌ యాదవ్, తెలంగాణ యాదవ, కురుమ సంఘాల జేఏసీ కన్వీనర్‌ అయిలయ్య, కో కన్వినర్‌ జి. శ్రీనివాస్‌ యాదవ్‌లు డిమాండ్‌ చేశారు.

రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ గురువారం కురుమ, యాదవ సంఘాలు ఇందిరా పార్కు వద్ద మహాధర్నా నిర్వహించాయి. దీనిలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న యాదవులు, కురుమలు రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశా రు. అనంతరం గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. ఇటీవల రేవంత్‌రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌పై గొల్ల వృత్తిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.

తక్షణమే రేవంత్‌రెడ్డి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని యాదవ సంఘాలు డెడ్‌లైన్‌ ప్రకటించినప్పటికీ ఆయన స్పందించకపోవడంతో మహాధర్నా చేపట్టామన్నారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపట్ల కాంగ్రెస్‌ నాయకులు స్పందించాలని డిమాండ్‌ చేశారు. క్షమాపణ చెప్పనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు.  

చలో గాందీభవన్‌తో ఉద్రిక్తత 
ధర్నా అనంతరం కురుమ, యాదవ సంఘాలు గాందీభవన్‌ ముట్టడికి పిలుపునివ్వడంతో ధర్నా చౌక్‌ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement