Asia Cup 2023 Final: వన్డే క్రికెట్‌లో అతి భారీ విజయం  | Sakshi
Sakshi News home page

Asia Cup 2023 Final: వన్డే క్రికెట్‌లో అతి భారీ విజయం 

Published Sun, Sep 17 2023 6:42 PM

Asia Cup 2023 Final IND VS SL: India Records Biggest Win In An ODI Final As Per Balls Remaining - Sakshi

ఓ వన్డే క్రికెట్‌ టోర్నీ ఫైనల్లో టీమిండియా బంతుల పరంగా అతి భారీ విజయాన్ని నమోదు చేసింది. శ్రీలంకతో జరిగిన 2023 ఆసియా కప్‌ ఫైనల్లో భారత  జట్టు ఈ ఘనతను సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ 263 పరుగులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించి, వన్డే క్రికెట్‌ టోర్నీ ఫైనల్స్‌ చరిత్రలో అతి భారీ విజయాన్ని నమోదు చేసింది. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. 2003 వీబీ సిరీస్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్‌ నిర్ధేశించిన 118 పరుగుల లక్ష్యాన్ని వికెట్‌ నష్టపోకుండా మరో 226 బంతులు మిగిలుండగానే ఛేదించింది. 

టీమిండియాకు అతి భారీ విజయం..
వన్డే క్రికెట్‌లో టీమిండియా బంతుల పరంగా అతి భారీ విజయాన్ని సాధించింది. శ్రీలంకతో జరిగిన ఇవాల్టి మ్యాచ్‌లో భారత్‌ 263 బంతులు మిగిలుండగానే, వికెట్‌ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌కు ముందు బంతుల పరంగా టీమిండియాకు అతి భారీ విజయం 2001లో కెన్యాపై దక్కింది. నాటి మ్యాచ్‌లో భారత్‌ 231 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. 

వన్డే టోర్నీ ఫైనల్స్‌లో మూడవది..
ఈ మ్యాచ్‌లో శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత్‌.. ఓ వన్డే టోర్నీ ఫైనల్స్‌లో ఈ ఘనత (10 వికెట్ల తేడాతో విజయం) మూడో జట్టుగా రికార్డుల్లోకెక్కింది. ఓ వన్డే టోర్నీ (కోకో కోలా కప్‌) ఫైనల్స్‌లో 1998లో భారత్‌ తొలిసారి 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నాటి ఫైనల్స్‌ భారత్‌.. జింబాబ్వేపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 2003 వీబీ సిరీస్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఈ ఘనత సాధించిన రెండో జట్టుగా నిలిచింది. 

కేవలం 129 బంతుల్లో మ్యాచ్‌ ముగిసింది..
భారత్‌-శ్రీలంక మధ్య జరిగిన ఆసియాకప్‌ 2023 ఫైనల్స్‌ బంతుల పరంగా మూడో అతి చిన్న మ్యాచ్‌గా రికార్డుల్లోకెక్కింది. ఈ మ్యాచ్‌ కేవలం 129 బంతుల్లో (రెండు ఇన్నింగ్స్‌) ముగిసింది. శ్రీలంక 15.2 ఓవర్లు.. భారత్‌ 6.1 ఓవర్లు బ్యాటింగ్‌ చేశాయి. బంతుల పరంగా అతి చిన్న మ్యాచ్‌ 2020లో నేపాల్‌-యూఎస్‌ఏ మధ్య జరిగింది. ఆ మ్యాచ్‌ కేవలం 104 బంతుల్లో ముగిసింది.  

ఇదిలా ఉంటే, 2023 ఆసియా కప్‌ టైటిల్‌ను భారత్‌ ఎనిమిదో సారి ఎగరేసుకుపోయింది. ఇవాళ జరిగిన ఫైనల్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఆతిథ్య శ్రీలంకను మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలగా.. టీమిండియా ఆడుతూ పాడుతూ 6.1 ఓవర్లలో వికెట్లు నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. ఇషాన్‌ కిషన్‌ (23), శుభ్‌మన్‌ గిల్‌ (27) టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. 

అంతకుముందు మహ్మద్‌ సిరాజ్‌ (7-1-21-6), బుమ్రా (5-1-23-1), హార్దిక్‌ పాండ్యా (2.2-0-3-3) చెలరేగడంతో శ్రీలంక​ 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. లంక ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా.. కేవలం కుశాల్‌ మెండిస్‌ (17), దుషన్‌ హేమంత (13 నాటౌట్‌) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. 
 

Advertisement
Advertisement