కేశినేని చిన్ని, సుజనా చౌదరి ఇద్దరూ పట్టించుకోని వైనం
ఆర్థిక అంశాలను తనకు అప్పజెబుతారని ఆశించిన బుద్దా
రెండు శిబిరాలు దూరం పెట్టడంతో ఇంటికే పరిమితం
ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులపై బుద్దా అనుచరుల ఆగ్రహం
వన్‌టౌన్(విజయవాడపశ్చమ): ఇప్పటివరకు ప్రతి ఎన్నికల్లో పశ్చమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేత బుద్దా వెంకన్న హవా నడిచింది. కానీ ఈ సారి ఎన్నికల్లో మాత్రం బుద్దా వెంకన్న ఇంటికే పరిమితమయ్యారు. భారతీయ జనతా పార్టీకి చెందిన సుజనాచౌదరితో పాటు తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని కూడా బుద్దా వెంకన్నను పూర్తిగా దూరం పెట్టారు. దాంతో నియోజకవర్గంలో బుద్దా వెంకన్న వర్గం సైలెంట్ అయిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి బీజేపీ అభ్యర్థిగా సుజనాచౌదరిని పోటీకి దింపారు. సుజనాచౌదరి వచ్చిన తొలి నాళ్లలో బుద్దా వెంకన్న తన క్యాడర్‌తో కాస్త హడావుడి చేశారు. కానీ గడిచిన 15 రోజులుగా ఆయన ఎన్నికలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు.
ఆర్థిక అంశాలను తనకు అప్పజెబుతారనుకున్న బుద్దా
లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేశినేని చిన్ని, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరి ఇద్దరూ ఎన్నికలకు సంబంధించిన ఆర్థిక అంశాలను తనకు అప్పగిస్తారని బుద్దా వెంకన్న ఆశించారు. నియోజకవర్గంలో కేశినేని చిన్నితో గడిచిన ఏడాదిన్నర కాలంగా అనేక కార్యక్రమాలను సైతం బుద్దా వెంకన్న నిర్వహించారు. కానీ ఎన్నికల సమయంలో మాత్రం చిన్ని బుద్దా వెంకన్నను నమ్మకపోవటంతో ఆయనను దూరంగా ఉంచారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక సుజనాచౌదరి ఆర్థిక కార్యకలాపాలన్నీ తన ద్వారానే నిర్వహిస్తారని బుద్దా వెంకన్న భావించారు. కానీ సుజనాచౌదరి సైతం బుద్దా వెంకన్నను నమ్మకుండా దూరంగా ఉంచారు. ఇద్దరూ వేరువేరుగా నియోజకవర్గంలో తమ తాలుకా వ్యక్తులను రంగంలోకి దింపి ఆర్థిక అంశాలను చక్కబెట్టే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు.
ఆర్థిక వ్యవహారాల కమిటీ సభ్యుడైనప్పటికీ...
పశ్చమ నియోజకవర్గంలో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఒక కమిటీని వేసి దాని ద్వారా ఖర్చులు చేయాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం సూచన చేసింది. అందులో బుద్దా వెంకన్నను సైతం సభ్యునిగా సూచించారు. కానీ సుజనాచౌదరి ఆ కమిటీ ఏర్పాటుకు, దాని ద్వారా నిర్వహణకు వ్యతిరేకించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బుద్దా వెంకన్నను నమ్మకపోవటం వలనే సుజనాచౌదరి వ్యతిరేకించినట్లు సమాచారం. దాంతో అటు కేశినేని చిన్ని, ఇటు సుజనాచౌదరి రెండు శిబిరాలు వెంకన్నను దూరంగా పెట్టాయి. అందువలన ఇద్దరికీ బుద్దా వెంకన్న దూరంగా ఉంటూ ఇంటికి మాత్రమే పరిమితమయ్యారని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. తమ నాయకుడిని పట్టించుకోకపోవటంతో బుద్దా వెంకన్న క్యాడర్ సైతం ఎన్నికల్లో ఉత్సాహంగా పని చేయటం లేదని తెలుగుదేశం సీనియర్ నాయకుడు ఒకరు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment