దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం రాత్రి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈదురుగాలులు చుట్టుముట్టడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా పాదచారులు, ద్విచక్ర వాహనదారులు పలు అవస్థలకు లోనయ్యారు. పలుచోట్ల చెట్లు నేలకూలడంతో పాటు ట్రాఫిక్ జామ్ అయింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
తుఫాను, వర్షం, బలమైన గాలుల కారణంగా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో వాతావరణం ఊహించని విధంగా మారింది. ఈదురు గాలుల ధాటికి పలుచోట్ల చెట్లు కూలిపోయి, రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఢిల్లీ నుంచి తొమ్మిది విమానాలను జైపూర్‌కు మళ్లించారు. బలమైన గాలుల కారణంగా నోయిడాలోని సెక్టార్ 58లో ఒక భవనం మరమ్మత్తు కోసం ఏర్పాటు చేసిన షట్టరింగ్ కూలిపోయింది. దీంతో పలు కార్లు దెబ్బతిన్నాయి.
#WATCH | Noida, Uttar Pradesh: Several cars were damaged after a shuttering installed to repair a building in Sector 58 of Noida blew off due to gusty winds hitting the National Capital & the adjoining areas. pic.twitter.com/lz7F2WuX9q
— ANI (@ANI) May 10, 2024
శనివారం(ఈరోజు) గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్‌గా ఉండవచ్చు. కనిష్ట ఉష్ణోగ్రతలు 29 డిగ్రీల సెల్సియస్‌కు చేరే అవకాశం ఉంది.
రాజధానిలో గాలి దిశలో మార్పు కారణంగా శుక్రవారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 180 వద్ద నమోదైంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ (ఐఐటీఎం) తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం తూర్పు నుంచి ఆగ్నేయ దిశగా గంటకు సగటున ఎనిమిది నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలి వీచింది.
Comments
Please login to add a commentAdd a comment