Deodhar Trophy 2023: Priyank Panchal Hammers Unbeaten 99 Against Nezon - Sakshi
Sakshi News home page

Priyank Panchal: ప్రియాంక్‌ పాంచల్‌ సుడిగాలి ఇన్నింగ్స్.. సిక్సర్ల మోత, 99 నాటౌట్‌

Published Mon, Jul 24 2023 6:48 PM

Deodhar Trophy 2023: Priyank Panchal Hammers Unbeaten 99 Against NEZone - Sakshi

దియోదర్‌ ట్రోఫీ-2023లో భాగంగా ఇవాళ (జులై 24) జరిగిన రెండో మ్యాచ్‌లో వెస్ట్‌ జోన్‌ ఓపెనర్‌, ఆ జట్టు కెప్టెన్‌ ప్రియాంక్‌ పాంచల్‌ (69 బంతుల్లో 99 నాటౌట్‌;  7 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అతనికి మరో ఓపెనర్‌, వికెట్‌కీపర్‌ హార్విక్‌ దేశాయి (71 బంతుల్లో 85; 14 ఫోర్లు) సహకరించడంతో నార్త్‌ ఈస్ట్‌ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్ట్‌ జోన్‌ ఆడుతూ పాడుతూ విజయం సాధించింది.

నార్త్‌ ఈస్ట్‌ జోన్‌ నిర్ధేశించిన 208 పరుగుల లక్ష్యాన్ని వెస్ట్‌ జోన్‌ కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి మరో 149 బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఫలితంగా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పంచల్‌, రాహుల్‌ త్రిపాఠి (11 బంతుల్లో 13 నాటౌట్‌; 2 ఫోర్లు) వెస్ట్‌ జోన్‌ను విజయతీరాలకు చేర్చారు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన నార్త్‌ ఈస్ట్‌ జోన్‌.. సగ్వస్వల్లా (3/31), షమ్స్‌ ములానీ (2/37), శివమ్‌ దూబే (2/36), చింతన్‌ గజా (1/25), సేథ్‌ (1/38), పార్థ్‌ భట్‌ (1/34) ధాటికి 47 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. నార్త్‌ ఈస్ట్‌ జోన్‌ ఇన్నింగ్స్‌లో తొమ్మిదో నంబర్‌ ఆటగాడు టాప్‌ స్కోరర్‌గా (38) నిలవడం విశేషం. 

పాంచల్‌ సుడిగాలి ఇన్నింగ్స్
తన సహజసిద్ధమైన ఆటకు భిన్నంగా ఆడిన ప్రియాంక్‌ పాంచల్‌.. నార్త్‌ ఈస్ట్‌ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. కేవలం 69 బంతుల్లోనే 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 99 పరుగులు చేశాడు. పాంచల్‌కు లిస్ట్‌-ఏ క్రికెట్‌లో ఇది 20వ అర్ధశతకం. లిస్ట్‌-ఏ క్రికెట్‌లో ఇప్పటివరకు 87 మ్యాచ్‌లు ఆడిన పంచల్‌.. 40కి పైగా సగటుతో 3378 పరుగులు చేశాడు. ఇందులో 20 ఫిఫ్టీలు, 7 శతకాలు ఉన్నాయి. ఇటీవల ముగిసిన దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో సౌత్‌జోన్‌పై 95 పరుగులు చేసిన పాంచల్‌ తన ఫామ్‌ను కొనసాగించాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement