అంబానీని దాటి అగ్రస్థానం
111 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలో 11వ ర్యాంకు
న్యూఢిల్లీ: ఆసియాలోనే అత్యంత సంపన్నుల జాబితాలో అదానీ గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీ మరోసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీని అధిగమించారు. 111 బిలియన్ డాలర్ల సంపదతో అగ్రస్థానం దక్కించుకున్నారు. అంతర్జాతీయంగా కుబేరుల లిస్టులో 11వ స్థానంలో నిల్చారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ రిపోర్టు ప్రకారం అంబానీ 109 బిలియన్ డాలర్ల సంపదతో అంతర్జాతీయంగా 12వ స్థానంలో ఉన్నారు.
అదానీ 2022లోనే ఆసియాలో నంబర్ వన్ సంపన్నుడిగా ఎదిగారు. అంతే కాదు స్వల్ప సమయం పాటు ప్రపంచంలోనే రెండో స్థానంలో నిల్చారు. అయితే, ఆయన గ్రూప్ కంపెనీల ఖాతాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ ఆరోపించడంతో 2023 జనవరిలో అదానీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
ఆ తర్వాత పరిణామాలతో గ్రూప్ సంస్థల షేర్లన్నీ కుదేలై ఏకంగా 150 బిలియన్ డాలర్ల విలువ కరిగిపోయింది. దీంతో ఆసియాలో అత్యంత సంపన్నుడిగా అంబానీ మళ్లీ అగ్రస్థానం దక్కించుకున్నారు. మరోవైపు, ఆరోపణలను దీటుగా ఎదుర్కొని, అదానీ క్రమంగా దిద్దుబాటు చర్యలు తీసుకుంటూ గ్రూప్‌ను మళ్లీ నిలబెట్టుకున్నారు. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 10 గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 17.51 లక్షల కోట్లకు చేరడంతో ఆయన సంపద కూడా పెరిగింది. మొత్తం మీద 2024లో అదానీ నికర విలువ 26.8 బిలియన్ డాలర్లు పెరగ్గా, అంబానీ సంపద 12.7 బిలియన్ డాలర్లు పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment