సంజూ శాంసన్ (PC: BCCI)
టీ20 ప్రపంచకప్-2024 నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తుదిజట్టు ఎంపికలో అత్యుత్తమ ఫామ్ ఆధారంగానే ఆటగాళ్లను పరిగణనలోకి తీసుకోవాలని టీమిండియా మేనేజ్‌మెంట్‌కు సూచించాడు.
కాగా వరల్డ్‌కప్-2024కు అమెరికా- వెస్టిండీస్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. గ్రూపు-ఏలో ఉన్న భారత జట్టు లీగ్ దశలో తమ మ్యాచ్‌లన్నీ అమెరికాలోనే ఆడనుంది. ఇక ఇందుకోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇప్పటికే 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.
రోహిత్ శర్మ సారథ్యంలోని ఈ టీమ్‌లో వికెట్ కీపర్ కోటాలో రిషభ్ పంత్, సంజూ శాంసన్ చోటు దక్కించుకోగా.. కేఎల్ రాహుల్‌కు మొండిచేయి ఎదురైంది. ఐపీఎల్-2024లో సంజూ రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్,బ్యాటర్‌గా అత్యుత్తమంగా రాణించి తన బెర్తును ఖరారు చేసుకోగా.. పంత్ ఐపీఎల్ తర్వాత నేరుగా దాదాపు ఏడాదిన్నర తర్వాత టీమిండియా తరఫున బరిలో దిగనున్నాడు.
ఈ నేపథ్యంలో ప్రపంచకప్ ఆడే భారత తుదిజట్టులో పంత్‌ను కాదని సంజూ శాంసన్‌కు చోటిచ్చాడు హర్భజన్ సింగ్. స్టార్ స్పోర్ట్స్ షో గేమ్ ప్లాన్‌లో భాగంగా.. తన ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకున్న భజ్జీ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.
‘‘నా అభిప్రాయం ప్రకారం.. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్‌తో కలిసి ఓపెనింగ్ చేయాలి. వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లి రావాలి. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్.
అనంతరం సంజూ శాంసన్. అతడు మంచి ఫామ్‌లో ఉన్నాడు కాబట్టి తననే ఆడించాలి. ఇక ఆరో స్థానంలో హార్దిక్ పాండ్యా.. ఏడో నంబర్‌లో రవీంద్ర జడేజా. యజువేంద్ర చహల్‌ను కూడా తప్పకుండా ఆడించాలి.
అతడితో పాటు ముగ్గురు సీమర్లు అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.. వీళ్లంతా తుదిజట్టులో ఉండాలి’’ అని హర్భజన్ సింగ్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
అయితే, పిచ్ గనుక స్పిన్‌కు మరీ అంత అనుకూలంగా లేదని భావిస్తే.. అదనపు స్పిన్నర్‌ను వదిలేసి అతడి స్థానంలో శివం దూబేను ఆడించాలని భజ్జీ సూచించాడు. ఈ పేస్ ఆల్‌రౌండర్ జట్టుతో ఉంటే బ్యాటింగ్ ఆర్డర్ ఇంకాస్త పటిష్టంగా మారుతుందని పేర్కొన్నాడు. తన దృష్టిలో కుల్దీప్ యాదవ్ అదనపు స్పిన్నర్ మాత్రమేనని హర్భజన్ పేర్కొన్నాడు.
చదవండి: T20 World Cup 2024: పొట్టి ప్రపంచకప్ విశేషాలు, రికార్డులు
Comments
Please login to add a commentAdd a comment