రిటైర్మెంట్‌ ఫండ్స్‌తో ఆర్థిక ప్రణాళిక ఇలా.. | Financial planning with retirement funds | Sakshi
Sakshi News home page

రిటైర్మెంట్‌ ఫండ్స్‌తో ఆర్థిక ప్రణాళిక ఇలా..

Published Mon, Jun 3 2024 4:22 AM | Last Updated on Mon, Jun 3 2024 8:33 AM

Financial planning with retirement funds

రిటైర్మెంట్‌ ఫండ్స్‌ అనేవి పదవీ విరమణ అనంతరం ఆర్థిక అవసరాల కోసం నిధిని సమకూర్చుకునేందుకు, ఆర్థిక భద్రతను సాధించేందుకు, స్థిరంగా ఆదాయాన్ని పొందేందుకు ఉపయోగపడే మ్యూచువల్‌ ఫండ్‌ స్కీములు. సాధారణంగా వీటికి అయిదేళ్లు లేదా రిటైర్మెంట్‌ వయస్సు వరకు (ఏది ముందైతే అది) లాకిన్‌ పీరియడ్‌ ఉంటుంది. 

ఇంతకీ పదవీ విరమణ తర్వాత రోజుల కోసం ముందునుంచే ఎందుకు ప్లానింగ్‌ చేసుకోవాలి అంటే.. రిటైర్మెంట్‌ తర్వాత స్థిరంగా ఆదాయం వచ్చే ఉద్యోగావకాశాలు ఉండవు. కాబట్టి పదవీ విరమణ తర్వాత కూడా ప్రస్తుత జీవన విధానం విషయంలో రాజీ పడకూడదనుకుంటే, ముందు నుంచే ఒక ప్రణాళిక వేసుకోక తప్పదు. 

మీ జీవితంలోని సెకండ్‌ ఇన్నింగ్స్‌లో కూడా ఆర్థికంగా నిశ్చింతగా ఉండే విధంగా ఈ ప్లానింగ్‌ ఉండాలి. ఈ ప్రణాళిక అవసరాన్ని మరింతగా వివరించాలంటే, కొన్ని అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి. ప్రస్తుతం సైన్స్, టెక్నాలజీ మెరుగుపడటంతో మనుషుల జీవితకాలం కూడా పెరుగుతోంది. దీనితో మన దగ్గరున్న ఆర్థిక వనరులు అంత కాలానికి సరిపోకపోవడమనే రిస్కులు ఉంటున్నాయి. 

అందుకే వృద్ధాప్యంలో ఆర్థికంగా ఇబ్బందిపడకుండా ముందునుంచే ప్రణాళికలు వేసుకోవడం చాలా ముఖ్యం. ఇక సామాజిక వ్యవస్థ స్వరూపం కూడా మారుతోంది. రిటైర్మెంట్‌ అవసరాల కోసం భవిష్యత్‌ తరాలపై ఆధారపడే పరిస్థితులు ఉండటం లేదు. ఇవే కాకుండా ఇక ద్రవ్యోల్బణం అనేది ఒకటి ఉండనే ఉంది. ఎప్పటికప్పుడు అన్నింటి రేట్లూ, ఖర్చులూ పెరుగుతూనే ఉన్నాయి.

 ఈ రకంగా చూసినా.. సరిగ్గా ప్లానింగ్‌ చేసుకోకపోతే పదవీ విరమణ తర్వాత కూడా పాత జీవన విధానమే కొనసాగించాలంటే కష్టమైపోతుంది. ఇక మరో విషయం ఏమిటంటే.. ఈ మధ్య రిటైర్మెంట్‌ నిర్వచనమే మారిపోతోంది. ఇప్పుడు రిటైర్మెంట్‌ అంటే ఒక కొత్త అడ్వెంచర్‌గా కూడా చూస్తున్నారు. బరువు బాధ్యతలు కొంత తగ్గి, కాస్త స్వేచ్ఛ లభిస్తుంది కాబట్టి ఇతరత్రా హాబీల వైపు మళ్లేందుకు కొంత అవకాశం లభిస్తుంది ఈ దశలో. మరి ఇలాంటి దశను ఆస్వాదించాలంటే తగినన్ని ఆర్థిక వనరులు ఉంటేనే సాధ్యపడుతుంది.   

ప్లానింగ్‌ ఇలా.. 
రిటైర్మెంట్‌ ప్లానింగ్‌లో పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి. వీలైనంత త్వరగా మొదలుపెట్టడమనేది ముఖ్యం.  దీనివల్ల మీ పెట్టుబడులు వృద్ధి చెందేందుకు తగినంత సమయం లభిస్తుంది. కాంపౌండింగ్‌ ప్రయోజనాలను పొందేందుకూ వీలుంటుంది. ఎన్నాళ్లకు ప్లానింగ్‌ చేసుకోవాలనేదీ చూసుకోవాలి. 

ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి, 58 ఏళ్లకు రిటైర్‌ అయి, 80 ఏళ్ల వరకు జీవిస్తారనుకుంటే .. వారు 28 ఏళ్ల పాటు పని చేయాల్సి ఉంటుంది, రిటైర్మెంట్‌ తర్వాత 22 ఏళ్ల పాటు జీవితకాలం ఉంటుంది. ఇప్పుడు దీనికి అనుగుణంగా ప్రస్తుత, భవిష్యత్‌ ఖర్చుల లెక్క వేసుకోవాలి. 

ఇందుకోసం ధరల పెరుగుదల రేటునూ పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు ప్రస్తుత ఖర్చులు నెలకు రూ. 50,000గా ఉంటే, 5.3 శాతం ద్రవ్యోల్బం రేటు అంచనాను పరిగణనలోకి తీసుకున్నప్పుడు 20 ఏళ్ల తర్వాత నెలవారీ ఖర్చులు రూ. 1.4 లక్షల స్థాయిలో ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని రిటైర్మెంట్‌ నిధికి రూపకల్పన చేసుకోవాలి. రిటైర్మెంట్‌ నిధి అనేది మీరు పదవీ విరమణ చేసే నాటికి కూడబెట్టుకోవాల్సిన మొత్తం. ఇది మీ పదవీ విరమణ అనంతరం ఎదురయ్యే ఖర్చులన్నింటికీ కనీసం సరిపోయే విధంగా ఉండాలి. 

సాధారణంగా అత్యవసర పరిస్థితుల కోసం 10–15 శాతం బఫర్‌ మొత్తాన్ని కూడా చేర్చుకోవడం మంచిది. దీన్ని చూసుకుని, అంత నిధిని పోగేసేందుకు మీరు ఇప్పటి నుంచి ప్రతి నెలా ఎంత పెట్టుబడి పెట్టాలనేది లెక్కించుకోవాలి. దీన్ని క్రమానుగతంగా, ఒక పద్ధతి ప్రకారం ఇన్వెస్ట్‌ చేయొచ్చు. ఇందుకోసం రిటైర్మెంట్‌ ప్లాన్లు అనువైనవిగా ఉండగలవు.  

ఫండ్స్‌ ప్రత్యేకతలు.. 
రిటైర్మెంట్‌ ఫండ్స్‌ అనేవి ఓపెన్‌ ఎండెడ్, రిటైర్మెంట్‌ సొల్యూషన్‌–ఆధారిత స్కీములుగా ఉంటాయి. వీటికి ముందుగానే చెప్పుకున్నట్లు అయిదేళ్లు లేదా రిటైర్మెంట్‌ వయస్సయిన 58 ఏళ్ల వరకు లాకిన్‌ పీరియడ్‌ (ఏది ముందైతే అది) ఉంటుంది. రిటైర్మెంట్‌ ఫండ్స్‌ అనేవి పదవీ విరమణ అనంతరం ఇన్వెస్టర్లకు ఆర్థిక భరోసా కలి్పంచేందుకు, స్థిరమైన ఆదాయ మార్గాన్ని ఏర్పర్చేందుకు ఉపయోగపడతాయి.  ఇవి అటు ఈక్విటీలు (65 శాతం – 80 శాతం వరకు), అటు ఫిక్సిడ్‌ ఇన్‌కం సెక్యూరిటీస్‌లోనూ (35 శాతం నుంచి 20 శాతం వరకు) ఇన్వెస్ట్‌ చేస్తాయి. 

తద్వారా డైవర్సిఫికేషన్, అసెట్‌ అలొకేషన్‌ ప్రయోజనాలు అందిస్తాయి. రిటైర్మెంట్‌ తర్వాత ఇన్వెస్టర్లు ఆటో సిస్టమాటిక్‌ విత్‌డ్రాయల్‌ ప్లాన్స్‌ ద్వారా వీటి నుంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఇక వీటిలో ఏకమొత్తంగా ఇన్వెస్ట్‌ చేయాలా లేక కొంచెం కొంచెంగానా అంటే.. సాధారణంగా పదవీ విరమణ అవసరాలకు సంబంధించి భారీ మొత్తాన్నే కూడబెట్టుకోవాల్సి ఉంటుంది. కనుక ఈ ఫండ్స్‌లో క్రమానుగతంగా సిప్‌ల (సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌) రూపంలో ఇన్వెస్ట్‌ చేసుకుంటూ వెడితే ప్రయోజనకరంగా ఉంటుంది. కావాలనుకుంటే స్టెప్‌–అప్‌ సిప్‌ విధానాన్ని ఎంచుకుని వీలైనంతగా పెట్టుబడిని పెంచుకుంటూ వెళ్లొచ్చు. 

రిటైర్మెంట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల భవిష్యత్‌ అవసరాలపై స్పష్టత, ఫోకస్‌ వస్తుంది. అయిదేళ్ల లాకిన్‌ వ్యవధి కారణంగా పెట్టుబడి విషయంలో ఇన్వెస్టర్లు తమ లక్ష్యానికి కట్టుబడి ఉండేలా మరింత క్రమశిక్షణను నేర్పుతుంది. అంతేగాకుండా సుదీర్ఘ కాలం పాటు ఇన్వెస్ట్‌ చేయడం వల్ల వచ్చే ప్రయోజనాలను కూడా వారు పొందేందుకు తోడ్పడుతుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement