Retirement Funds
-
రిటైర్మెంట్ ఫండ్స్‌తో ఆర్థిక ప్రణాళిక ఇలా..
రిటైర్మెంట్ ఫండ్స్ అనేవి పదవీ విరమణ అనంతరం ఆర్థిక అవసరాల కోసం నిధిని సమకూర్చుకునేందుకు, ఆర్థిక భద్రతను సాధించేందుకు, స్థిరంగా ఆదాయాన్ని పొందేందుకు ఉపయోగపడే మ్యూచువల్ ఫండ్ స్కీములు. సాధారణంగా వీటికి అయిదేళ్లు లేదా రిటైర్మెంట్ వయస్సు వరకు (ఏది ముందైతే అది) లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఇంతకీ పదవీ విరమణ తర్వాత రోజుల కోసం ముందునుంచే ఎందుకు ప్లానింగ్ చేసుకోవాలి అంటే.. రిటైర్మెంట్ తర్వాత స్థిరంగా ఆదాయం వచ్చే ఉద్యోగావకాశాలు ఉండవు. కాబట్టి పదవీ విరమణ తర్వాత కూడా ప్రస్తుత జీవన విధానం విషయంలో రాజీ పడకూడదనుకుంటే, ముందు నుంచే ఒక ప్రణాళిక వేసుకోక తప్పదు. మీ జీవితంలోని సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా ఆర్థికంగా నిశ్చింతగా ఉండే విధంగా ఈ ప్లానింగ్ ఉండాలి. ఈ ప్రణాళిక అవసరాన్ని మరింతగా వివరించాలంటే, కొన్ని అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి. ప్రస్తుతం సైన్స్, టెక్నాలజీ మెరుగుపడటంతో మనుషుల జీవితకాలం కూడా పెరుగుతోంది. దీనితో మన దగ్గరున్న ఆర్థిక వనరులు అంత కాలానికి సరిపోకపోవడమనే రిస్కులు ఉంటున్నాయి. అందుకే వృద్ధాప్యంలో ఆర్థికంగా ఇబ్బందిపడకుండా ముందునుంచే ప్రణాళికలు వేసుకోవడం చాలా ముఖ్యం. ఇక సామాజిక వ్యవస్థ స్వరూపం కూడా మారుతోంది. రిటైర్మెంట్ అవసరాల కోసం భవిష్యత్ తరాలపై ఆధారపడే పరిస్థితులు ఉండటం లేదు. ఇవే కాకుండా ఇక ద్రవ్యోల్బణం అనేది ఒకటి ఉండనే ఉంది. ఎప్పటికప్పుడు అన్నింటి రేట్లూ, ఖర్చులూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ రకంగా చూసినా.. సరిగ్గా ప్లానింగ్ చేసుకోకపోతే పదవీ విరమణ తర్వాత కూడా పాత జీవన విధానమే కొనసాగించాలంటే కష్టమైపోతుంది. ఇక మరో విషయం ఏమిటంటే.. ఈ మధ్య రిటైర్మెంట్ నిర్వచనమే మారిపోతోంది. ఇప్పుడు రిటైర్మెంట్ అంటే ఒక కొత్త అడ్వెంచర్‌గా కూడా చూస్తున్నారు. బరువు బాధ్యతలు కొంత తగ్గి, కాస్త స్వేచ్ఛ లభిస్తుంది కాబట్టి ఇతరత్రా హాబీల వైపు మళ్లేందుకు కొంత అవకాశం లభిస్తుంది ఈ దశలో. మరి ఇలాంటి దశను ఆస్వాదించాలంటే తగినన్ని ఆర్థిక వనరులు ఉంటేనే సాధ్యపడుతుంది. ప్లానింగ్ ఇలా.. రిటైర్మెంట్ ప్లానింగ్‌లో పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి. వీలైనంత త్వరగా మొదలుపెట్టడమనేది ముఖ్యం. దీనివల్ల మీ పెట్టుబడులు వృద్ధి చెందేందుకు తగినంత సమయం లభిస్తుంది. కాంపౌండింగ్ ప్రయోజనాలను పొందేందుకూ వీలుంటుంది. ఎన్నాళ్లకు ప్లానింగ్ చేసుకోవాలనేదీ చూసుకోవాలి. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి, 58 ఏళ్లకు రిటైర్ అయి, 80 ఏళ్ల వరకు జీవిస్తారనుకుంటే .. వారు 28 ఏళ్ల పాటు పని చేయాల్సి ఉంటుంది, రిటైర్మెంట్ తర్వాత 22 ఏళ్ల పాటు జీవితకాలం ఉంటుంది. ఇప్పుడు దీనికి అనుగుణంగా ప్రస్తుత, భవిష్యత్ ఖర్చుల లెక్క వేసుకోవాలి. ఇందుకోసం ధరల పెరుగుదల రేటునూ పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు ప్రస్తుత ఖర్చులు నెలకు రూ. 50,000గా ఉంటే, 5.3 శాతం ద్రవ్యోల్బం రేటు అంచనాను పరిగణనలోకి తీసుకున్నప్పుడు 20 ఏళ్ల తర్వాత నెలవారీ ఖర్చులు రూ. 1.4 లక్షల స్థాయిలో ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని రిటైర్మెంట్ నిధికి రూపకల్పన చేసుకోవాలి. రిటైర్మెంట్ నిధి అనేది మీరు పదవీ విరమణ చేసే నాటికి కూడబెట్టుకోవాల్సిన మొత్తం. ఇది మీ పదవీ విరమణ అనంతరం ఎదురయ్యే ఖర్చులన్నింటికీ కనీసం సరిపోయే విధంగా ఉండాలి. సాధారణంగా అత్యవసర పరిస్థితుల కోసం 10–15 శాతం బఫర్ మొత్తాన్ని కూడా చేర్చుకోవడం మంచిది. దీన్ని చూసుకుని, అంత నిధిని పోగేసేందుకు మీరు ఇప్పటి నుంచి ప్రతి నెలా ఎంత పెట్టుబడి పెట్టాలనేది లెక్కించుకోవాలి. దీన్ని క్రమానుగతంగా, ఒక పద్ధతి ప్రకారం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇందుకోసం రిటైర్మెంట్ ప్లాన్లు అనువైనవిగా ఉండగలవు. ఫండ్స్ ప్రత్యేకతలు.. రిటైర్మెంట్ ఫండ్స్ అనేవి ఓపెన్ ఎండెడ్, రిటైర్మెంట్ సొల్యూషన్–ఆధారిత స్కీములుగా ఉంటాయి. వీటికి ముందుగానే చెప్పుకున్నట్లు అయిదేళ్లు లేదా రిటైర్మెంట్ వయస్సయిన 58 ఏళ్ల వరకు లాకిన్ పీరియడ్ (ఏది ముందైతే అది) ఉంటుంది. రిటైర్మెంట్ ఫండ్స్ అనేవి పదవీ విరమణ అనంతరం ఇన్వెస్టర్లకు ఆర్థిక భరోసా కలి్పంచేందుకు, స్థిరమైన ఆదాయ మార్గాన్ని ఏర్పర్చేందుకు ఉపయోగపడతాయి. ఇవి అటు ఈక్విటీలు (65 శాతం – 80 శాతం వరకు), అటు ఫిక్సిడ్ ఇన్‌కం సెక్యూరిటీస్‌లోనూ (35 శాతం నుంచి 20 శాతం వరకు) ఇన్వెస్ట్ చేస్తాయి. తద్వారా డైవర్సిఫికేషన్, అసెట్ అలొకేషన్ ప్రయోజనాలు అందిస్తాయి. రిటైర్మెంట్ తర్వాత ఇన్వెస్టర్లు ఆటో సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్స్ ద్వారా వీటి నుంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఇక వీటిలో ఏకమొత్తంగా ఇన్వెస్ట్ చేయాలా లేక కొంచెం కొంచెంగానా అంటే.. సాధారణంగా పదవీ విరమణ అవసరాలకు సంబంధించి భారీ మొత్తాన్నే కూడబెట్టుకోవాల్సి ఉంటుంది. కనుక ఈ ఫండ్స్‌లో క్రమానుగతంగా సిప్ల (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) రూపంలో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెడితే ప్రయోజనకరంగా ఉంటుంది. కావాలనుకుంటే స్టెప్–అప్ సిప్ విధానాన్ని ఎంచుకుని వీలైనంతగా పెట్టుబడిని పెంచుకుంటూ వెళ్లొచ్చు. రిటైర్మెంట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల భవిష్యత్ అవసరాలపై స్పష్టత, ఫోకస్ వస్తుంది. అయిదేళ్ల లాకిన్ వ్యవధి కారణంగా పెట్టుబడి విషయంలో ఇన్వెస్టర్లు తమ లక్ష్యానికి కట్టుబడి ఉండేలా మరింత క్రమశిక్షణను నేర్పుతుంది. అంతేగాకుండా సుదీర్ఘ కాలం పాటు ఇన్వెస్ట్ చేయడం వల్ల వచ్చే ప్రయోజనాలను కూడా వారు పొందేందుకు తోడ్పడుతుంది. -
పదేళ్ల పాటు ప్రతి నెలా రూ.50,000 ఇన్వెస్ట్ చేయాలంటే..! ఏది బెస్ట్?
నేను విశ్రాంత జీవనం కోసం కావాల్సిన నిధిని సమకూర్చుకోవాలని అనుకుంటున్నాను. రిటైర్మెంట్ ఫండ్ వంటి దీర్ఘకాలిక లక్ష్యాలకు స్మాల్‌క్యాప్ ఫండ్స్ అనుకూలమేనా? – వర్షిల్ స్మాల్‌క్యాప్‌లో పెట్టుబడులకు దీర్ఘకాలం ఒక్కటీ సరిపోదు. పెట్టుబడులు పెట్టిన తర్వాత స్వల్ప కాలం నుంచి మధ్య కాలానికి కనిపించే నష్టాలకు, యూనిట్ల విలువ క్షీణతకు తట్టుకోగలిగి ఉండాలి. దీర్ఘకాలంలో సంపద సృష్టికి స్మాల్‌క్యాప్ పథకాలను పరిశీలించొచ్చు. అయినప్పటికీ స్మాల్‌క్యాప్ పథకాల్లో పెట్టుబడులు అంత సులభమేమీ కాదు. అవి అదే పనిగా నిర్ణీత సమయాల్లో నష్టాలను ఎదుర్కొంటూ ఉంటాయి. మార్కెట్లో ఇతర విభాగాలు మంచి పనితీరు చూపిస్తూ, అదే సమయంలో స్మాల్‌క్యాప్‌లో పెట్టుబడులు నష్టాలను చూపిస్తుంటే సామాన్య ఇన్వెస్టర్లు ఆందోళన చెందకుండా ఉండడం కష్టం. అందుకనే మీ మొత్తం పెట్టుబడుల్లో 10–15 శాతం మించి స్మాల్‌క్యాప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయకుండా ఉండడమే నయం. చిన్న కంపెనీని ఎంపిక చేసుకుంటే, అది ఆ తర్వాతి కాలంలో పెద్ద కంపెనీగా మారిందనడానికి వందలాది ఉదాహరణలు ఉన్నాయి. ఇటువంటి సందర్భాల్లో సంపద సృష్టి జరుగుతుంది. కానీ, అలా ఎంపిక చేసుకున్న ప్రతి కంపెనీ కూడా ఓ హెచ్డీఎఫ్సీ బ్యాంకు కాదు. సంపదను తుడిచిపెట్టేవీ ఉంటాయి. ఆటుపోట్లను తట్టుకునే బలం చిన్న కంపెనీలకు తక్కువగా ఉంటుంది. దీర్ఘకాంలో చిన్న కంపెనీలు సంపదను సృష్టించగలవు. లార్జ్‌క్యాప్ కంపెనీలతో పోలిస్తే మంచి వృద్ధిని చూపించగలవు. సాధారణంగా చిన్న కంపెనీలను ఎక్కువ మంది అనుసరించరు. ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు చాలా చిన్న కంపెనీలకు దూరంగా ఉంటారు. ప్రతి స్మాల్‌క్యాప్ ఫండ్ భిన్నంగా పనిచేస్తుంటుంది. వివిధ పథకాల మధ్య ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. సిప్ ద్వారా స్మాల్‌క్యాప్ కంపెనీల్లో దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా స్మాల్‌క్యాప్ కంపెనీల విషయానికొస్తే కావాల్సినంత లిక్విడిటీ ఉండదు. చిన్న కంపెనీలు కావడంతో ఫ్రీ ఫ్లోటింగ్ ఈక్విటీ తక్కువగా ఉంటుంది. దీంతో మార్కెట్ల కరెక్షన్లలో కొద్దిపాటి అమ్మకాల ఒత్తిడికే షేర్ల ధరలు భారీగా నష్టపోతుంటాయి. మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్ కంపెనీలతో పోలిస్తే స్మాల్‌క్యాప్ కంపెనీలు రిస్క్ ఎక్కువతో ఉంటాయి. మారుతున్న మార్కెట్లకు అనుగుణంగా డైనమిక్‌గా ఉండేవి తక్కువే. ముఖ్యంగా చిన్న కంపెనీల్లో ఏ ధరలో కొనుగోలు చేశారు? (సహేతుక వ్యాల్యూషన్ వద్ద) అన్నది రాబడులకు కీలకం అవుతుంది. నా వయసు 45 ఏళ్లు. నా విశ్రాంత జీవనం కోసం వచ్చే పదేళ్ల పాటు, ప్రతి నెలా రూ.50,000 చొప్పున ఇన్వెస్ట్ చేయాలన్నది నా ప్రణాళిక. ఏ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి? – ఆశిష్ అథాలే రిటైర్మెంట్ కోసం పొదుపు చేసుకోవాలనుకునే వారు వాస్తవికంగా ఆలోచించాల్సిందే. ముందుగా రిటైర్మెంట్ కోసం ఎంత మొత్తం కావాలన్నది నిర్ణయించుకోవాలి. రిటైర్మెంట్ నాటికి ఎంత నిధి సమకూర్చుకోగలరో అవగాహనకు రావాలి. విశ్రాంత జీవన అవసరాలకు కావాల్సినంత మీరు కూడబెట్టే విధంగా ప్రణాళిక ఉండాలి. రెండు నుంచి మూడు మంచి ఫ్లెక్సీక్యాప్ పథకాలను ఎంపిక చేసుకోవాలి. నెలవారీ సిప్ ద్వారా వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. మరో పదేళ్ల పాటు మీ కెరీర్ కొనసాగనుంది. కనుక మీ పెట్టుబడి వృద్ధి చెందడానికి తగినంత వ్యవధి మిగిలి ఉంది. ఈక్విటీ పథకాల్లో పెట్టుబడులకు సంబంధించి అవగాహన లేకపోతే, అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవి అచ్చమైన ఈక్విటీ పథకాలతో పోలిస్తే కొంచెం తక్కువ అస్థిరతలతో ఉంటాయి. అలాగే రిటైర్మెంట్ కోసం ఫిక్స్ డ్ ఇన్కమ్ పథకాలు, ఈక్విటీ పథకాలను ఎంపిక చేసుకోవాలి. దీనివల్ల రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత.. ఈక్విటీ పెట్టుబడులను ఫిక్స్డ్ ఇన్కమ్ పథకాల్లోకి మార్చాల్సిన అవసరం ఏర్పడదు. ఎందుకంటే సగం పెట్టుబడులు ఫిక్స్డ్ ఇన్కమ్ (డెట్ ఫండ్స్) సాధనాల్లోనే ఉంటాయి. ఈక్విటీ, డెట్ మధ్య పెట్టుబడుల కేటాయింపు జాగ్రత్తగా ఉండాలి. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని అధిగమించేలా, వడ్డీ రేట్లు తగ్గి నప్పుడు ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాలపై పడే ప్రభావాన్ని అధిగమించేలా ఈ సమతూకం ఉండాలి. -ధీరేంద్ర కుమార్ - సీఈవో వాల్యూ రీసెర్చ్ -
ఈపీఎఫ్ఓ ఫండ్ మేనేజర్లు కొనసాగింపు
న్యూఢిల్లీ: రిటైర్మెంట్ నిధులు నిర్వహించే ఈపీఎఫ్ఓ తన నాలుగు ఫండ్ మేనేజింగ్ సంస్థలను కొనసాగించాలని నిర్ణయించింది. ఎస్బీఐ, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ప్రైమరీ డీలర్షిప్, రిలయన్స్ క్యాపిటల్, హెచ్ఎస్బీసీ ఏఎంసీలను ఫండ్ మేనేజర్లుగా మరో మూడేళ్లపాటు కొనసాగించాలని నిర్ణయించామని ఈపీఎఫ్ఓ పేర్కొంది. కొత్తగా యూటీఐ ఏఎంసీను కూడా నియమించామని ఎంప్లాయిస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) వివరించింది. ఈపీఎఫ్ఓ నిధులు ప్రస్తుతం రూ.6.5 లక్షల కోట్లుగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రూ.80 వేల కోట్లు డిపాజిట్లు వస్తాయని అంచనా. -
మరింత పెన్షన్ కోరుకుంటే....
మనలో చాలా మంది సంపాదన మొదలు పెట్టగానే సొంతకారు, ఇల్లు, విదేశీ యాత్రలు వంటి లక్ష్యాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. 40 ఏళ్లు దాటితే కాని పెన్షన్ గురించి ఆలోచించడం లేదని పలు సర్వేల్లో వెల్లడయ్యింది. కానీ ఇది సరైన నిర్ణయం కాదు. సంపాదన మొదలు పెట్టగానే కొంత మొత్తం పెన్షన్ నిధికి కేటాయిస్తే...రిటైర్మెంట్ తర్వాత ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవితాన్ని సంతోషంగా గడిపేయొచ్చు. అలా కాకుండా ఆలస్యం చేసే కొద్దీ పెన్షన్ నిధి కోసం అధిక మొత్తం కేటాయించాల్సి వస్తుంది. పెన్షన్ కోసం ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఆలస్యంగా మొదలు పెడితే ఎలా నష్టపోతామో ఇప్పుడు చూద్దాం... ధీరజ్, నీరజ్‌లు ఇద్దరు స్నేహితులు. 30వ ఏట ఇద్దరికీ ఉద్యోగం వచ్చింది. అందరిలాగానే వీరు కూడా ఉద్యోగంలో చేరిన వెంటనే పొదుపు గురించి ఆలోచించకుండా వచ్చిన మొత్తం విలాసాలకు వినియోగించారు. కానీ పెళ్లైన తర్వాత ధీరజ్‌కు బాధ్యతలు పెరగడంతో, రిటైర్మెంట్ గురించి ఆలోచన మొదలయ్యింది. పదవీ విరమణ తర్వాత చింత లేని జీవితం గడపడం కోసం ఏటా లక్ష రూపాయలు మదుపు చేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకోవడమే కాదు 60 ఏళ్లు వచ్చే వరకు ఆగకుండా ఇన్వెస్ట్ చేశాడు. పదవీ విరమణ నాటికి ధీరజ్ రిటైర్మెంట్ నిధి రూ. 1.08 కోట్లు అయ్యింది. నీరజ్ మాత్రం 50 ఏళ్లు వచ్చే వరకు రిటైర్మెంట్ గురించి ఆలోచించలేదు. పెన్షన్ విలువ తెలిసే సరికి సమయం కాస్తా దాటిపోయింది. దీంతో ఎంత కష్టమైనా ఏటా రూ. 5 లక్షలు చొప్పున పదేళ్లు ఇన్వెస్ట్ చేశాడు. 60 ఏళ్లు వచ్చేసరికి నీరజ్ రిటైర్మెంట్ నిధి కేవలం రూ. 88 లక్షలు మాత్రమే. ధీరజ్ 25 ఏళ్లలో మొత్తం రూ. 25 లక్షలు ఇన్వెస్ట్ చేసి రూ. 1.08 కోట్ల నిధిని సమకూర్చుకుంటే, నీరజ్ ఏటా 5 లక్షలు చొప్పున పదేళ్లలో ధీరజ్ కంటే రెట్టింపు మొత్తం రూ. 50 లక్షలు ఇన్వెస్ట్ చేసినా, చేతికి మాత్రం రూ. 88 లక్షలు మాత్రమే వచ్చాయి. చిన్న వయస్సులోనే చిన్న మొత్తంతో మొదలు పెట్టినా భారీ మొత్తం సమకూర్చుకోవడం ద్వారా అధిక పెన్షన్‌ను పొందవచ్చు. ఆలస్యం అయ్యే కొద్డీ ఇన్వెస్ట్ చేసే మొత్తం పెరుగుతుండటమే కాకుండా... చేతికి వచ్చే మొత్తం కూడా తగ్గుతుంటుంది. పెన్షన్ ప్రాధాన్యత పెరుగుతుండటంతో ఇప్పుడు వివిధ రకాల పెన్షన్ పథకాలు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే పెన్షన్‌కు అదనంగా మరికొంత కావాలనుకునే వారు కూడా వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మరింత పెన్షన్‌ను పొందవచ్చు. ఎన్పీఎస్ అందరికీ పెన్షన్ సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం న్యూ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో ఏటా కనీసం రూ. 6,000 ఇన్వెస్ట్ చేస్తే చాలు. అంటే నెలకు ఇన్వెస్ట్ చేయాల్సిన కనీస మొత్తం రూ. 500. పీఎఫ్ఆర్డీఏ పర్యవేక్షణలో నడిచే ఈ కొత్త పెన్షన్ పథకాన్ని ప్రస్తుతం ఎస్బీఐ, యూటీఐ, ఐసీఐసీఐ, కొటక్ మహీంద్రా, రిలయన్స్, ఐడీఎఫ్సీ సంస్థలు నిర్వహిస్తున్నాయి. 18-60 ఏళ్ల లోపు వారు చేరవచ్చు. రిస్క్ సామర్థ్యం ఆధారంగా వివిధ రకాల ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. గరిష్టంగా ఈక్విటీల్లో 50% వరకు మాత్రమే ఇన్వెస్ట్ చేయడానికి పీఎఫ్ఆర్డీఏ అనుమతిస్తోంది. బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్, నిఫ్టీ 50 ఇండెక్స్ ఆధారిత షేర్లలో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాయి. ఒక వేళ ఇన్వెస్టర్ ఏ ఫండ్‌నూ ఎంచుకోకపోతే డిఫాల్ట్‌గా లైఫ్ సైకిల్ ఫండ్‌ను ఎంపిక చేస్తాయి. 2016-17లోపు ఇన్వెస్ట్ చేస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం అదనంగా రూ.1,000 జమ చేస్తుంది. బీమా పథకాలు అన్ని బీమా కంపెనీలు రిటైర్మెంట్ పథకాలను అందిస్తున్నాయి. అటు బీమా రక్షణతో పాటు, ఇటు ఆదాయపు పన్ను ప్రయోజనాలు ఉండటంతో చాలామంది పెన్షన్ పాలసీల కేసి చూస్తుంటారు. సాధారణ పెన్షన్ పథకాలతో పాటు కొద్దిగా రిస్క్ చేసేవారి కోసం యులిప్స్ పథకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. యులిప్స్‌లో పాలసీదారులు సేకరించిన మొత్తాన్ని మీ రిస్క్ సామర్థ్యం ఆధారంగా మీరు ఎంచుకున్న ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. పాలసీ కాలపరిమితి అయిన తర్వాత పాలసీ మొత్తంలో 20 నుంచి 30 శాతం వెనక్కి తీసుకోవచ్చు. మిగిలిన మొత్తంతో యాన్యుటీ పథకాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ యాన్యుటీ పథకాలు మీకు పెన్షన్‌ను అందిస్తాయి. ఎల్ఐసీతోపాటు, దాదాపు అన్ని జీవిత బీమా కంపెనీలు పెన్షన్ పథకాలను అందిస్తున్నాయి. అలా కాకుండా తక్షణం పెన్షన్ కావాలనుకునే వారి కోసం బీమా కంపెనీలు ఇమిడియట్ యాన్యుటీ పెన్షన్ పథకాలను కూడా అందిస్తున్నాయి. 45 ఏళ్ల వయసు దాటిన వారికి ఈ పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఇన్వెస్ట్ చేసినప్పటి నుంచే పెన్షన్ మొదలవుతుంది. మ్యూచువల్ పెన్షన్ ఫండ్స్.. కొద్దిగా రిస్క్ చేసేవారి కోసం మ్యూచువల్ ఫండ్ సంస్థలు రిటైర్మెంట్ ఫండ్స్‌ను అందిస్తున్నాయి. ఇవి ఈక్విటీ, డెట్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి కాబట్టి అధిక రాబడిని ఆశించవచ్చు. కాని ఇవి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల వీటి రాబడిపై హామీ ఉండదు. ఆ మేరకు రిస్క్ కూడా ఉంటుంది. కాని దీర్ఘకాలంలో అన్నిటికంటే ఈక్విటీలే అధిక రాబడిని అందిస్తాయి. కాబట్టి రిటైర్మెంట్ ప్లానింగ్‌లో ఈక్విటీలకు కూడా తగు ప్రాధాన్యత నివ్వాలి. యటీఐ, టాటా, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి మ్యూచువల్ ఫండ్ సంస్థలు రిటైర్మెంట్ ఫండ్స్‌ను అందిస్తున్నాయి.