మరింత పెన్షన్ కోరుకుంటే.... | If want more pension | Sakshi
Sakshi News home page

మరింత పెన్షన్ కోరుకుంటే....

Published Sun, Nov 9 2014 1:22 AM | Last Updated on Fri, Oct 19 2018 7:00 PM

మరింత  పెన్షన్  కోరుకుంటే.... - Sakshi

మరింత పెన్షన్ కోరుకుంటే....

మనలో చాలా మంది సంపాదన మొదలు పెట్టగానే సొంతకారు, ఇల్లు, విదేశీ యాత్రలు వంటి లక్ష్యాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. 40 ఏళ్లు దాటితే కాని పెన్షన్ గురించి ఆలోచించడం లేదని పలు సర్వేల్లో వెల్లడయ్యింది. కానీ ఇది సరైన నిర్ణయం కాదు.

సంపాదన మొదలు పెట్టగానే కొంత మొత్తం పెన్షన్ నిధికి కేటాయిస్తే...రిటైర్మెంట్ తర్వాత ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవితాన్ని సంతోషంగా గడిపేయొచ్చు. అలా కాకుండా ఆలస్యం చేసే కొద్దీ పెన్షన్ నిధి కోసం అధిక మొత్తం కేటాయించాల్సి వస్తుంది.

పెన్షన్ కోసం ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఆలస్యంగా మొదలు పెడితే ఎలా నష్టపోతామో ఇప్పుడు చూద్దాం...
 ధీరజ్, నీరజ్‌లు ఇద్దరు స్నేహితులు. 30వ ఏట ఇద్దరికీ ఉద్యోగం వచ్చింది. అందరిలాగానే వీరు కూడా ఉద్యోగంలో చేరిన వెంటనే పొదుపు గురించి ఆలోచించకుండా వచ్చిన మొత్తం విలాసాలకు వినియోగించారు. కానీ పెళ్లైన తర్వాత ధీరజ్‌కు బాధ్యతలు పెరగడంతో, రిటైర్మెంట్ గురించి ఆలోచన మొదలయ్యింది. పదవీ విరమణ తర్వాత చింత లేని జీవితం గడపడం కోసం ఏటా లక్ష రూపాయలు మదుపు చేయాలని నిర్ణయించుకున్నాడు.

అనుకోవడమే కాదు 60 ఏళ్లు వచ్చే వరకు ఆగకుండా ఇన్వెస్ట్ చేశాడు. పదవీ విరమణ నాటికి ధీరజ్ రిటైర్మెంట్ నిధి రూ. 1.08 కోట్లు అయ్యింది. నీరజ్ మాత్రం 50 ఏళ్లు వచ్చే వరకు రిటైర్మెంట్ గురించి ఆలోచించలేదు. పెన్షన్ విలువ తెలిసే సరికి సమయం కాస్తా దాటిపోయింది. దీంతో ఎంత కష్టమైనా ఏటా రూ. 5 లక్షలు చొప్పున పదేళ్లు ఇన్వెస్ట్ చేశాడు. 60 ఏళ్లు వచ్చేసరికి నీరజ్ రిటైర్మెంట్ నిధి కేవలం రూ. 88 లక్షలు మాత్రమే.

 ధీరజ్ 25 ఏళ్లలో మొత్తం రూ. 25 లక్షలు ఇన్వెస్ట్ చేసి రూ. 1.08 కోట్ల నిధిని సమకూర్చుకుంటే, నీరజ్ ఏటా 5 లక్షలు చొప్పున పదేళ్లలో ధీరజ్ కంటే రెట్టింపు మొత్తం రూ. 50 లక్షలు ఇన్వెస్ట్ చేసినా, చేతికి మాత్రం రూ. 88 లక్షలు మాత్రమే వచ్చాయి. చిన్న వయస్సులోనే చిన్న మొత్తంతో మొదలు పెట్టినా భారీ మొత్తం సమకూర్చుకోవడం ద్వారా అధిక పెన్షన్‌ను పొందవచ్చు. ఆలస్యం అయ్యే కొద్డీ ఇన్వెస్ట్ చేసే మొత్తం పెరుగుతుండటమే కాకుండా... చేతికి వచ్చే మొత్తం కూడా తగ్గుతుంటుంది.

 పెన్షన్ ప్రాధాన్యత పెరుగుతుండటంతో ఇప్పుడు వివిధ రకాల పెన్షన్ పథకాలు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే పెన్షన్‌కు అదనంగా మరికొంత కావాలనుకునే వారు కూడా వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మరింత పెన్షన్‌ను పొందవచ్చు.

 ఎన్‌పీఎస్
 అందరికీ పెన్షన్ సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం న్యూ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్)ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో ఏటా కనీసం రూ. 6,000 ఇన్వెస్ట్ చేస్తే చాలు. అంటే నెలకు ఇన్వెస్ట్ చేయాల్సిన కనీస మొత్తం రూ. 500. పీఎఫ్‌ఆర్‌డీఏ పర్యవేక్షణలో నడిచే ఈ కొత్త పెన్షన్ పథకాన్ని ప్రస్తుతం ఎస్‌బీఐ, యూటీఐ, ఐసీఐసీఐ, కొటక్ మహీంద్రా, రిలయన్స్, ఐడీఎఫ్‌సీ సంస్థలు నిర్వహిస్తున్నాయి.

18-60 ఏళ్ల లోపు వారు చేరవచ్చు. రిస్క్ సామర్థ్యం ఆధారంగా వివిధ రకాల ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. గరిష్టంగా ఈక్విటీల్లో 50% వరకు మాత్రమే ఇన్వెస్ట్ చేయడానికి పీఎఫ్‌ఆర్‌డీఏ అనుమతిస్తోంది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్, నిఫ్టీ 50 ఇండెక్స్ ఆధారిత షేర్లలో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాయి. ఒక వేళ ఇన్వెస్టర్ ఏ ఫండ్‌నూ ఎంచుకోకపోతే డిఫాల్ట్‌గా లైఫ్ సైకిల్ ఫండ్‌ను ఎంపిక చేస్తాయి. 2016-17లోపు ఇన్వెస్ట్ చేస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం అదనంగా రూ.1,000 జమ చేస్తుంది.

 బీమా పథకాలు
 అన్ని బీమా కంపెనీలు రిటైర్మెంట్ పథకాలను అందిస్తున్నాయి. అటు బీమా రక్షణతో పాటు, ఇటు ఆదాయపు పన్ను ప్రయోజనాలు ఉండటంతో చాలామంది పెన్షన్ పాలసీల కేసి చూస్తుంటారు. సాధారణ పెన్షన్ పథకాలతో పాటు కొద్దిగా రిస్క్ చేసేవారి కోసం యులిప్స్ పథకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. యులిప్స్‌లో పాలసీదారులు సేకరించిన మొత్తాన్ని మీ రిస్క్ సామర్థ్యం ఆధారంగా మీరు ఎంచుకున్న ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి.

పాలసీ కాలపరిమితి అయిన తర్వాత పాలసీ మొత్తంలో 20 నుంచి 30 శాతం వెనక్కి తీసుకోవచ్చు. మిగిలిన మొత్తంతో యాన్యుటీ పథకాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ యాన్యుటీ పథకాలు మీకు పెన్షన్‌ను అందిస్తాయి. ఎల్‌ఐసీతోపాటు, దాదాపు అన్ని జీవిత బీమా కంపెనీలు పెన్షన్ పథకాలను అందిస్తున్నాయి. అలా కాకుండా తక్షణం పెన్షన్ కావాలనుకునే వారి కోసం బీమా కంపెనీలు ఇమిడియట్ యాన్యుటీ పెన్షన్ పథకాలను కూడా అందిస్తున్నాయి. 45 ఏళ్ల వయసు దాటిన వారికి ఈ పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఇన్వెస్ట్ చేసినప్పటి నుంచే పెన్షన్ మొదలవుతుంది.
 
 మ్యూచువల్ పెన్షన్ ఫండ్స్..
 కొద్దిగా రిస్క్ చేసేవారి కోసం మ్యూచువల్ ఫండ్ సంస్థలు రిటైర్మెంట్ ఫండ్స్‌ను అందిస్తున్నాయి. ఇవి ఈక్విటీ, డెట్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి కాబట్టి  అధిక రాబడిని ఆశించవచ్చు.  కాని ఇవి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల వీటి రాబడిపై హామీ ఉండదు. ఆ మేరకు రిస్క్ కూడా ఉంటుంది. కాని దీర్ఘకాలంలో అన్నిటికంటే ఈక్విటీలే అధిక రాబడిని అందిస్తాయి.  కాబట్టి రిటైర్మెంట్ ప్లానింగ్‌లో ఈక్విటీలకు కూడా తగు ప్రాధాన్యత నివ్వాలి. యటీఐ, టాటా, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి మ్యూచువల్ ఫండ్ సంస్థలు రిటైర్మెంట్ ఫండ్స్‌ను అందిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement