నేను విశ్రాంత జీవనం కోసం కావాల్సిన నిధిని సమకూర్చుకోవాలని అనుకుంటున్నాను. రిటైర్మెంట్ ఫండ్ వంటి దీర్ఘకాలిక లక్ష్యాలకు స్మాల్‌క్యాప్ ఫండ్స్ అనుకూలమేనా? – వర్షిల్
స్మాల్‌క్యాప్‌లో పెట్టుబడులకు దీర్ఘకాలం ఒక్కటీ సరిపోదు. పెట్టుబడులు పెట్టిన తర్వాత స్వల్ప కాలం నుంచి మధ్య కాలానికి కనిపించే నష్టాలకు, యూనిట్ల విలువ క్షీణతకు తట్టుకోగలిగి ఉండాలి. దీర్ఘకాలంలో సంపద సృష్టికి స్మాల్‌క్యాప్ పథకాలను పరిశీలించొచ్చు. అయినప్పటికీ స్మాల్‌క్యాప్ పథకాల్లో పెట్టుబడులు అంత సులభమేమీ కాదు. అవి అదే పనిగా నిర్ణీత సమయాల్లో నష్టాలను ఎదుర్కొంటూ ఉంటాయి.
మార్కెట్లో ఇతర విభాగాలు మంచి పనితీరు చూపిస్తూ, అదే సమయంలో స్మాల్‌క్యాప్‌లో పెట్టుబడులు నష్టాలను చూపిస్తుంటే సామాన్య ఇన్వెస్టర్లు ఆందోళన చెందకుండా ఉండడం కష్టం. అందుకనే మీ మొత్తం పెట్టుబడుల్లో 10–15 శాతం మించి స్మాల్‌క్యాప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయకుండా ఉండడమే నయం. చిన్న కంపెనీని ఎంపిక చేసుకుంటే, అది ఆ తర్వాతి కాలంలో పెద్ద కంపెనీగా మారిందనడానికి వందలాది ఉదాహరణలు ఉన్నాయి. ఇటువంటి సందర్భాల్లో సంపద సృష్టి జరుగుతుంది. కానీ, అలా ఎంపిక చేసుకున్న ప్రతి కంపెనీ కూడా ఓ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కాదు. సంపదను తుడిచిపెట్టేవీ ఉంటాయి. ఆటుపోట్లను తట్టుకునే బలం చిన్న కంపెనీలకు తక్కువగా ఉంటుంది.
దీర్ఘకాంలో చిన్న కంపెనీలు సంపదను సృష్టించగలవు. లార్జ్‌క్యాప్ కంపెనీలతో పోలిస్తే మంచి వృద్ధిని చూపించగలవు. సాధారణంగా చిన్న కంపెనీలను ఎక్కువ మంది అనుసరించరు. ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు చాలా చిన్న కంపెనీలకు దూరంగా ఉంటారు. ప్రతి స్మాల్‌క్యాప్ ఫండ్ భిన్నంగా పనిచేస్తుంటుంది. వివిధ పథకాల మధ్య ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది.
సిప్ ద్వారా స్మాల్‌క్యాప్ కంపెనీల్లో దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా స్మాల్‌క్యాప్ కంపెనీల విషయానికొస్తే కావాల్సినంత లిక్విడిటీ ఉండదు. చిన్న కంపెనీలు కావడంతో ఫ్రీ ఫ్లోటింగ్ ఈక్విటీ తక్కువగా ఉంటుంది. దీంతో మార్కెట్ల కరెక్షన్లలో కొద్దిపాటి అమ్మకాల ఒత్తిడికే షేర్ల ధరలు భారీగా నష్టపోతుంటాయి. మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్ కంపెనీలతో పోలిస్తే స్మాల్‌క్యాప్ కంపెనీలు రిస్క్ ఎక్కువతో ఉంటాయి. మారుతున్న మార్కెట్లకు అనుగుణంగా డైనమిక్‌గా ఉండేవి తక్కువే. ముఖ్యంగా చిన్న కంపెనీల్లో ఏ ధరలో కొనుగోలు చేశారు? (సహేతుక వ్యాల్యూషన్ వద్ద) అన్నది రాబడులకు కీలకం అవుతుంది.
నా వయసు 45 ఏళ్లు. నా విశ్రాంత జీవనం కోసం వచ్చే పదేళ్ల పాటు, ప్రతి నెలా రూ.50,000 చొప్పున ఇన్వెస్ట్ చేయాలన్నది నా ప్రణాళిక. ఏ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి? – ఆశిష్ అథాలే
రిటైర్మెంట్ కోసం పొదుపు చేసుకోవాలనుకునే వారు వాస్తవికంగా ఆలోచించాల్సిందే. ముందుగా రిటైర్మెంట్ కోసం ఎంత మొత్తం కావాలన్నది నిర్ణయించుకోవాలి. రిటైర్మెంట్ నాటికి ఎంత నిధి సమకూర్చుకోగలరో అవగాహనకు రావాలి. విశ్రాంత జీవన అవసరాలకు కావాల్సినంత మీరు కూడబెట్టే విధంగా ప్రణాళిక ఉండాలి. రెండు నుంచి మూడు మంచి ఫ్లెక్సీక్యాప్ పథకాలను ఎంపిక చేసుకోవాలి.
నెలవారీ సిప్ ద్వారా వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. మరో పదేళ్ల పాటు మీ కెరీర్ కొనసాగనుంది. కనుక మీ పెట్టుబడి వృద్ధి చెందడానికి తగినంత వ్యవధి మిగిలి ఉంది. ఈక్విటీ పథకాల్లో పెట్టుబడులకు సంబంధించి అవగాహన లేకపోతే, అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవి అచ్చమైన ఈక్విటీ పథకాలతో పోలిస్తే కొంచెం తక్కువ అస్థిరతలతో ఉంటాయి. అలాగే రిటైర్మెంట్ కోసం ఫిక్స్ డ్ ఇన్‌కమ్ పథకాలు, ఈక్విటీ పథకాలను ఎంపిక చేసుకోవాలి.
దీనివల్ల రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత.. ఈక్విటీ పెట్టుబడులను ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ పథకాల్లోకి మార్చాల్సిన అవసరం ఏర్పడదు. ఎందుకంటే సగం పెట్టుబడులు ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ (డెట్ ఫండ్స్) సాధనాల్లోనే ఉంటాయి. ఈక్విటీ, డెట్ మధ్య పెట్టుబడుల కేటాయింపు జాగ్రత్తగా ఉండాలి. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని అధిగమించేలా, వడ్డీ రేట్లు తగ్గి నప్పుడు ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ సాధనాలపై పడే ప్రభావాన్ని అధిగమించేలా ఈ సమతూకం ఉండాలి.
-ధీరేంద్ర కుమార్ - సీఈవో వాల్యూ రీసెర్చ్
Comments
Please login to add a commentAdd a comment