అంతర్గతంగా ఎంతో విలువ దాగి ఉన్న స్టాక్స్‌ను గుర్తించడం ఎలా? – కపిల్
వాస్తవ విలువ కంటే తక్కువలో ట్రేడ్ అవుతున్న (అండర్ వ్యాల్యూడ్) స్టాక్‌ను గుర్తించం కూడా ఒక కళేనని చెప్పుకోవచ్చు. డిస్కౌంటింగ్ సూత్రాన్ని ఇక్కడ అమలు చేసి చూడాల్సి ఉంటుంది. అంటే వచ్చే ఐదు, పదేళ్ల కాలంలో కంపెనీ ఆదాయాలు ఏ మేరకు వృద్ధి చెందుతాయో చూడాలి. అలాగే, యాజమాన్యం ఎంత ఉత్తమమైనది? అన్నది కూడా చూడాలి.
కంపెనీ నిధులను నిజాయితీగా నిర్వహిస్తారా? విశ్వసనీయత కలిగిన వారేనా? అలాగే, ఆ కంపెనీ పనిచేస్తున్న రంగంలో మంచి వృద్ధికి అవకాశం ఉందా? భవిష్యత్తు ఉన్నదేనా? అవకాశాలను అనుకూలంగా మార్చుకోగలదా? వీటిని విశ్లేషించుకోవాలి. అలాగే, మీకు మంచిగా కనిపించిన కంపెనీల గురించి ఎన్నో ప్రతికూల వ్యాఖ్యానాలు వినిపిస్తుంటాయి. వాటన్నింటినీ తట్టుకుని పెట్టుబడులను కొనసాగించే బలం కూడా కావాలి.
నేను మూడు, నాలుగేళ్ల కోసం ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలో ఉన్నందున, ఇక్కడి నుంచి వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు ఉన్నందున లాంగ్‌టర్మ్ బాండ్లలో ఇన్వెస్ట్ చేయడం మంచిదేనా? దీనికంటే మరేదైనా మెరుగైన ఆప్షన్ ఉందా? – అంకిత్ ముద్రా
వడ్డీ రేట్లు, వీటికి సంబంధించిన సైకిల్ (కాల వ్యవధి) అనేవి ఊహించనివి. పరిస్థితులు, సూక్ష్మ ఆర్థిక అంశాల ఆధారంగా ఇవి మార్పులకు లోనవుతుంటాయి. కరోనా మహమ్మారి రాకతో ఫైనాన్షియల్ మార్కెట్లలో పరిస్థితులను చక్కదిద్దేందుకు 2020 మార్చి–మేలో వడ్డీ రేట్ల కోతను గుర్తుకు తెచ్చుకోండి. ద్రవ్యోల్బణం నియంత్రణకు ఇటీవల వరుసగా చేపట్టిన రేట్ల పెంపులు కూడా ఒక నిదర్శనమే. కచ్చితంగా వడ్డీ రేట్ల సైకిల్‌ను అంచనా వేయడం ఎవరి వల్లా కాదు. ఆ విధమైన అంచనాలతో పోర్ట్‌ఫోలియో ఏర్పాటు చేసుకోవడం రిస్క్ తీసుకోవడమే అవుతుంది. కనుక స్థూల ఆర్థిక అంశాల కంటే మీ పెట్టుబడుల కాలవ్యవధికి అనుగుణమైన సాధనాలపై దృష్టి సారించడమే మంచిది.
మూడు నాలుగేళ్ల కోసం ఇన్వెస్ట్ చేసుకునేట్టు అయితే అప్పుడు బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే మెరుగైన సాధనానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అదే సమయంలో పెట్టుబడికి రక్షణ ఉండాలి. అటువంటప్పుడు షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ అనుకూలం. ఈ పథకం కాల వ్యవధి, మీ పెట్టుబడుల కాల వ్యవధికి ఒకే రకంగా ఉంటుంది. ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ సెక్యూరిటీల్లో (డెట్ సాధనాలు) పెట్టుబడులు పెట్టడం వెనుక ఉద్దేశ్యం స్థిరమైన రాబడులు ఆశించడమే. ఈక్విటీల్లో మాదిరి అస్థిరతలు లేకుండా, పెట్టుబడికి రక్షణ కల్పించుకోవడం. లాంగ్ టర్మ్ బాండ్ ఫండ్స్ చూడ్డానికి ఆకర్షణీయంగా అనిపించొచ్చు. కానీ అవి ఎంతో అస్థిరతలతో ఉంటాయి.
దీర్ఘకాలంలో షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌లో మాదిరే రాబడులను ఇస్తాయి. డెట్ ఫండ్స్ ఎంపిక చేసుకునేప్పుడు అనుసరించాల్సిన సూత్రం మీ పెట్టుబడుల కాల వ్యవధి, ఎంపిక చేసుకునే సాధనం పెట్టుబడుల కాలవ్యవధి ఒకే విధంగా ఉండాలి. ఇక మీ పెట్టుబడుల కాలవ్యవధి మూడు నాలుగేళ్లు కనుక ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్‌ను కూడా చూడొచ్చు. ఈక్విటీలతో వచ్చే రిస్క్ కొంత ఇందులో ఉంటుంది. ఇవి ఈక్విటీలు, డెట్, ఆర్బిట్రేజ్ సాధనాల్లో ఇన్వెస్ట్ చే స్తాయి. లాంగ్ డ్యురేషన్ ఫండ్స్ కంటే ఎక్కువ రాబడులు ఇస్తాయి. అచ్చమైన ఈక్విటీలతో పోలిస్తే తక్కువ అస్థిరతలతో మెరుగైన రాబడులు ఇస్తాయి.
ధీరేంద్ర కుమార్ - సీఈఓ, వ్యాల్యూ రీసెర్చ్
Comments
Please login to add a commentAdd a comment