రాయల్స్‌కు టైటాన్స్‌ షాక్‌  | Sakshi
Sakshi News home page

రాయల్స్‌కు టైటాన్స్‌ షాక్‌ 

Published Thu, Apr 11 2024 4:09 AM

Gujarat win by 3 wickets - Sakshi

చేజేతులా ఓడిన రాజస్తాన్‌

3 వికెట్లతో గుజరాత్‌ గెలుపు

రాణించిన గిల్, రషీద్‌ ఖాన్‌  

197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌ తడబడుతూనే సాగింది... చివర్లో 4 ఓవర్లలో 59  పరుగులు చేయాల్సిన దశలో గెలుపు అసాధ్యంగా అనిపించింది. కానీ తర్వాతి నాలుగు ఓవర్లలో వరుసగా 17, 7, 20, 17 పరుగులు సాధించిన టైటాన్స్‌ అనూహ్య విజయాన్ని  అందుకుంది. అప్పటి వరకు నియంత్రణతో బౌలింగ్‌ చేసిన రాజస్తాన్‌ రాయల్స్‌ పేలవ బౌలింగ్, వ్యూహ వైఫల్యంతో చేజేతులా మ్యాచ్‌ను కోల్పోయి ఈ సీజన్‌లో తొలి ఓటమిని ఎదుర్కొంది.   

జైపూర్‌: వరుస విజయాలతో అజేయంగా దూసుకుపోతున్న రాజస్తాన్‌ రాయల్స్‌కు బ్రేక్‌ పడింది. బుధవారం జరిగిన పోరులో గుజరాత్‌ టైటాన్స్‌ 3 వికెట్ల తేడాతో రాయల్స్‌పై గెలుపొందింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రియాన్‌ పరాగ్‌ (48 బంతుల్లో 76; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు), సామ్సన్‌ (38 బంతుల్లో 68 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు.

అనంతరం గుజరాత్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 199 పరుగులు చేసింది. శుబ్‌మన్‌ గిల్‌ (44 బంతుల్లో 72; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా, సాయి సుదర్శన్‌ (29 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రషీద్‌ ఖాన్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో టైటాన్స్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు.   

శతక భాగస్వామ్యం... 
గత మూడు మ్యాచ్‌లలో వైఫల్యాల తర్వాత ఈసారి యశస్వి (19 బంతుల్లో 24; 5 ఫోర్లు) కాస్త మెరుగైన ప్రదర్శన కనబర్చగా, గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన బట్లర్‌ (8) విఫలమయ్యాడు. పవర్‌ప్లేలో రాజస్తాన్‌ 43 పరుగులే చేయగా... ఈ దశ నుంచి సామ్సన్, పరాగ్‌ భారీ భాగస్వామ్యం రాయల్స్‌ను పటిష్ట స్థితికి చేర్చింది. ఇద్దరూ వేగంగా పరుగులు సాధించారు.

పరాగ్‌ 34 బంతుల్లో, సామ్సన్‌ 31 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీని అందుకున్నారు. ఎట్టకేలకు 19వ ఓవర్లో పరాగ్‌ను అవుట్‌ చేసి మోహిత్‌ ఈ జోడీని విడదీశాడు. అయితే ఉమేశ్‌ వేసిన చివరి ఓవర్లో సామ్సన్, హెట్‌మైర్‌ (13 నాటౌట్‌) చెరో సిక్స్‌ బాదడంతో మొత్తం 19 పరుగులు వచ్చాయి.
 
గిల్‌ కెప్టెన్ఇన్నింగ్స్‌... 
భారీ ఛేదనలో టైటాన్స్‌కు సుదర్శన్, శుబ్‌మన్‌ గిల్‌ దూకుడైన ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 64 పరుగులు జోడించినా... అందుకు 50 బంతులు తీసుకున్నారు. రాయల్స్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో వీరి పరుగుల వేగాన్ని నిరోధించింది. బౌల్ట్‌ తొలి 2 ఓవర్లలో 8 పరుగులే ఇవ్వగా... అవేశ్‌ బౌలింగ్‌లో 14 పరుగులు రాబట్టడంతో టైటాన్స్‌ స్కోరు పవర్‌ప్లే ముగిసే సరికి 44 పరుగులకు చేరింది.

అయితే కుల్దీప్‌ సేన్‌ ఒక్కసారిగా గుజరాత్‌ను దెబ్బ తీశాడు. తన బౌలింగ్‌లో 6 పరుగుల వ్యవధిలో అతను సుదర్శన్, వేడ్‌ (4), మనోహర్‌ (1)లను వెనక్కి పంపించాడు. ఈ దశలో కెపె్టన్‌ గిల్‌ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. 35 బంతుల్లో అతని హాఫ్‌ సెంచరీ పూర్తయింది.

విజయ్‌ శంకర్‌ (16) ప్రభావం చూపలేకపోగా... 28 బంతుల్లో 65 పరుగులు చేయాల్సిన స్థితిలో గిల్‌ వెనుదిరగడంతో టైటాన్స్‌ ఆశలు సన్నగిల్లాయి. అయితే కీలక సమయంలో రషీద్‌ ఖాన్‌ (11 బంతుల్లో 24 నాటౌట్‌; 4 ఫోర్లు), రాహుల్‌ తెవాటియా (11 బంతుల్లో 22; 3 ఫోర్లు) ఆట జట్టును గెలిపించింది.  

స్కోరు వివరాలు 
రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: యశస్వి (సి) వేడ్‌ (బి) ఉమేశ్‌ 24; బట్లర్‌ (సి) తెవాటియా (బి) రషీద్‌ 8; సామ్సన్‌ (నాటౌట్‌) 68; పరాగ్‌ (సి) శంకర్‌ (బి) మోహిత్‌ 76; హెట్‌మైర్‌ (నాటౌట్‌) 13; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–32, 2–42, 3–172. బౌలింగ్‌: ఉమేశ్‌ 4–0–47–1, జాన్సన్‌ 4–0–37–0, రషీద్‌ 4–0–18–1, నూర్‌ 4–0–43–0, మోహిత్‌ 4–0–51–1.

గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌: సుదర్శన్‌ (ఎల్బీ) (బి) కుల్దీప్‌ 35; గిల్‌ (స్టంప్డ్‌) సామ్సన్‌ (బి) చహల్‌ 72; వేడ్‌ (బి) కుల్దీప్‌ 4; మనోహర్‌ (బి) కుల్దీప్‌ 1; విజయ్‌ శంకర్‌ (బి) చహల్‌ 16; తెవాటియా (రనౌట్‌) 22; షారుఖ్‌ (ఎల్బీ) (బి) అవేశ్‌ 14; రషీద్‌ ఖాన్‌ (నాటౌట్‌) 24; నూర్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–64, 2–77, 3–79, 4–111, 5–133, 6–157, 7–195. బౌలింగ్‌: బౌల్ట్‌ 2–0–8–0, అవేశ్‌ 4–0–48–1, మహరాజ్‌ 2–0–16–0, అశి్వన్‌ 4–0–40–0, చహల్‌ 4–0–43–2, కుల్దీప్‌ సేన్‌ 4–0–41–3.  

ఐపీఎల్‌లో నేడు
ముంబై  X  బెంగళూరు 
వేదిక: ముంబై 

రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement
Advertisement