కుస్తీకి సాక్షి స్వస్తి | Sakshi
Sakshi News home page

కుస్తీకి సాక్షి స్వస్తి

Published Fri, Dec 22 2023 4:12 AM

Indian female star wrestler Sakshi said goodbye to wrestling

న్యూఢిల్లీ: సాక్షి మలిక్‌... మహిళల కుస్తీలో పతకం పట్టుబట్టే స్టార్‌ రెజ్లర్‌. కామన్వెల్త్‌ క్రీడల్లో మూడు పతకాలు... ఆసియా చాంపియన్‌íÙప్‌లో నాలుగు పతకాలు... రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం... ఇవిచాలు సాక్షి ఏస్థాయి రెజ్లరో చెప్పడానికి! దేశానికి పతకాలెన్నో తెచ్చిపెట్టిన ఆమె... గురువారం జరిగిన డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ విధేయుడే అధ్యక్షుడిగా ఎన్నికవడంతో ఇక చేసేదేమీ లేక బయట పోరాటానికి, బౌట్‌లో పతకం ఆరాటానికి సెలవిచ్చింది. కన్నీటి చెమ్మతో బరువెక్కిన హృదయంతో రిటైర్మెంట్‌ ప్రకటించింది.

మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన కేసులో నిందితుడైన బ్రిజ్‌భూషణ్‌ ప్రధాన అనుచరుడు సంజయ్‌ సింగ్‌ భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. బ్రిజ్‌భూషణ్‌ పై ఢిల్లీ రోడ్లెక్కి సాక్షి సహా స్టార్‌ రెజ్లర్లు బజరంగ్‌ పూనియా, వినేశ్‌ ఫొగాట్, సంగీత ఫొగాట్‌ తదితరులు నిరసన తెలిపారు. పగలనక... రాత్రనక... తిండి నిద్రలేని రాత్రులెన్నో గడిపి బ్రిజ్‌భూషణ్‌ను గద్దె దింపాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన గద్దె దిగినప్పటికీ ఆయన నీడ సంజయ్‌ సింగ్‌ అధ్యక్షుడు కావడంతో జీర్ణించుకోలేకపోయిన సాక్షి తన ఆటకు టాటా చెప్పేసింది. స్టార్‌ రెజ్లర్లు బజరంగ్, వినేశ్‌ కూడా సంజయ్‌ ఎన్నికపై తప్పుబట్టారు. 

అవును... అందుకే గుడ్‌బై 
‘బ్రిజ్‌భూషణ్‌ మహిళా రెజ్లర్ల పట్ల ప్రవర్తించిన తీరుపై గళమెత్తాం. కదంతొక్కాం. కేసు నమోదు చేయించాం. కానీ డబ్ల్యూఎఫ్‌ఐ తాజా ఎన్నికల్లో చివరకు ఆయన వర్గమే గెలిచింది. పదవులన్నీ చేజిక్కించుకుంది. అందుకే కెరీర్‌కు గుడ్‌బై చెప్పా. మేం మహిళా అధ్యక్షురాలైతే బాగుంటుందని అనుకున్నాం. కానీ అలా జరగలేదు’ అని మీడియా సమావేశంలో సాక్షి వాపోయింది. 

15లో 13 పదవులు బ్రిజ్‌భూషణ్‌ వర్గానివే 
మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ డబ్ల్యూఎఫ్‌ఐలో తన పట్టు నిరూపించుకున్నాడు. ఆయన బరిలో లేకపోయినా... 15 పదవుల్లో ఆయన వర్గానికి    చెందిన 13 మంది పదవుల్ని చేజిక్కించుకున్నారు. అధ్యక్ష పదవి ఎన్నికలో ఉత్తరప్రదేశ్‌ రెజ్లింగ్‌ సంఘం ఉపాధ్యక్షుడైన సంజయ్‌... 2010 కామన్వెల్త్‌ క్రీడల స్వర్ణ పతక విజేత అనిత షెరాన్‌పై 40–7 ఓట్ల తేడాతో గెలిచాడు.

అనిత వర్గానికి చెందిన ప్రేమ్‌చంద్‌ లోచబ్‌ ప్రధాన కార్యదర్శి పదవి పొందడం... సీనియర్‌ ఉపాధ్యక్షుడిగా దేవేందర్‌ సింగ్‌ కడియాన్‌ ఎన్నికవడం ఒక్కటే ఊరట. మిగతా 4 ఉపాధ్యక్ష పదవులు బ్రిజ్‌భూషణ్‌ క్యాంప్‌లోని జైప్రకాశ్‌ (ఢిల్లీ), అశిత్‌  సాహా (బెంగాల్‌), కర్తార్‌ సింగ్‌ (పంజాబ్‌), ఫొని (మణిపూర్‌)లే సొంతం చేసుకున్నారు. ఉపాధ్యక్ష బరిలో దిగిన మధ్యప్రదేశ్‌ కొత్త ముఖ్యమంత్రి, మాజీ రెజ్లర్‌ మోహన్‌ యాదవ్‌కు కేవలం ఐదు ఓట్లు లభించడం గమనార్హం. కోశాధికారిగా సత్యపాల్‌ (ఉత్తరాఖండ్‌), ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులందరూ బ్రిజ్‌భూషణ్‌ వర్గం వారే ఎన్నికయ్యారు.  

నిరసన దీక్ష చేపట్టిన రెజ్లర్లపై ఎలాంటి వివక్ష చూపం. ప్రతీకారం తీర్చుకోం. రెజ్లర్లందరిని సమానంగా చూస్తాం. వారికి కావాల్సిన సహకారాలు అందిస్తాం. మేం రెజ్లింగ్‌ ఆటపైనే దృష్టి పెడతాం. రెజ్లర్ల పొరపాట్లపై కాదు. ఎన్నికైన కొత్త కార్యవర్గమే డబ్ల్యూఎఫ్‌ఐని నడిపిస్తుంది. రోజువారీ వ్యవహారాల్లో నా ప్రమేయం ఉండదు. వారు కోరితేనే సలహాలిస్తా. –మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement