వారికి ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకమే లేదు. కాని ఊహించని విజయం వారిని వరించింది. టీడీపీ అధికారంలోకి వచ్చింది. గెలవం అనుకున్న సీట్లలో గెలిచిన ఆ ఇద్దరికీ మంత్రి పదవులపై కన్ను పడింది. క్యాబినెట్‌లో బెర్త్ కన్‌ఫామ్ కావాలంటే పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకోవాలి. ఇందుకోసం ఇద్దరు ఎమ్మెల్యేలు ఓ ప్లాన్ చేశారు. మంత్రి పదవుల కోసం బరితెగించి తమ ప్రత్యర్థులైన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగించారు. ఇంతకీ ఆ ఇద్దరూ ఎవరు?
తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టున్న ప్రాంతం కృష్ణాజిల్లా. సామాజికవర్గం పరంగానూ...పార్టీ పరంగానూ బలమైన జిల్లా కావడంతో ఇక్కడినుంచి గెలుపొందిన నేతలకు పార్టీలోనూ అంతే వెయిటేజ్ ఉంటుంది. ఐతే ఇటీవల జరిగిన ఎన్నికల్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ అభ్యర్ధులు గెలవడంతో మంత్రివర్గంలో తమకు స్థానం దక్కదేమో అనే టెన్షన్ గన్నవరం, గుడివాడ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో మొదలైందట. గెలిచినవారందరూ మంత్రి పదవుల కోసం తమకున్న పరిచయాలతో లాబీయింగ్ చేస్తుంటే ఈ ఇద్దరు మాత్రం...పార్టీలో చంద్రబాబు తర్వాత అంతటి అధికారం చెలాయించే చినబాబు లోకేష్‌ను ప్రసన్నం చేసుకుంటే తమ పని సులువు అవుతుందని భావించారట. పార్టీలో నెంబర్ టూగా ఉన్న లోకేష్ దృష్టిలో పడితే తమ స్థానం పదిలమనే ఆలోచనతోనే వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తల్ని టార్గెట్ చేశారనే టాక్ వినిపిస్తోంది.
తమ లక్ష్యం నెరవేరాలంటే వైఎస్‌ఆర్‌సీపీలోని చిన్నా చితకా నాయకులు, క్యాడర్‌ను లక్ష్యంగా చేసుకుంటే వర్కవుట్ కాదని భావించారట. అందుకే గుడివాడలో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వెనిగండ్ల రాము వైఎస్‌ఆర్‌సీపీ కీలక నేత, మాజీ మంత్రి కొడాలి నానిని టార్గెట్ చేశారని తెలుస్తోంది. గుడివాడలో ఎలాగైనా గెలవాలనుకున్న చంద్రబాబు కోరిక తీరింది కాబట్టి...కొడాలి నానిని కూడా ఇబ్బంది పెడితే పార్టీ దృష్టి ...చినబాబు దృష్టి తనపై పడుతుంది....అప్పుడు మంత్రి పదవి రేసులో తన పేరు కూడా ఉంటుందనే ఆలోచన చేశారట వెనిగండ్ల రాము. ఈ ఆలోచనతోనే కౌంటింగ్ పూర్తయిన రోజు రాత్రి కొడాలి నాని కార్యాలయంపై దాడి చేయించిన వెనిగండ్ల రాము..తర్వాత కొడాలి నాని ఇంటి పైకి కూడా కొంత మందిని టీడీపీ గూండాలను ఉసిగొల్సి పార్టీ వర్గాల్లో చర్చకు తెరతీసారట.
గుడివాడలో వెనిగండ్ల రాము అనుసరించిన స్ట్రాటజీనే గన్నవరంలో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన యార్లగడ్డ వెంకట్రావ్ కూడా అమలు చేశారట. కొడాలి నాని తర్వాత టీడీపీ ఓడించాలనుకున్న నేతల్లో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా ఉన్నారు. అటు గుడివాడతో పాటు ఇటు గన్నవరంలోనూ టీడీపీ గెలవడంతో కచ్చితంగా తనకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని యార్లగడ్డ ఆశపడ్డారట.
అందుకే విజయవాడలోని వల్లభనేని వంశీ ఇంటి పై టీడీపీ గూండాలు ... కిరాయి మూకలతో దాడులకు పాల్పడ్డారని తెలుస్తోంది. వంశీ ఇంటిపై కత్తులు...కర్రలు...రాళ్లతో దాడి చేశారు. భారీగా మోహరించిన పోలీసులు అతికష్టం మీద వంశీ ఇంటి పరిసరాల నుంచి టీడీపీ గూండాలను తరిమికొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. వంశీ ఇంటిపైకి యార్లగడ్డ వెంకట్రావ్ మనుషులతో పాటు విజయవాడ సెంట్రల్ నుంచి గెలిచిన బొండా ఉమా కూడా తన గూండాలను పంపించి దాడి చేయించారని తెలుస్తోంది.
టీడీపీకి, ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు , లోకేష్ కు టార్గెట్ లిస్ట్ లో ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇళ్ళపై అటాక్ చేయడం వల్ల అధిష్టానంతో పాటు చినబాబు దృష్టిలో తాము హీరోలుగా నిలుస్తామని...తద్వారా క్యాబినెట్ లో చోటు దక్కడం ఖాయమని యార్లగడ్డ వెంకట్రావు, వెనిగండ్ల రాము, బొండా ఉమా భావించారట.
కట్ చేస్తే.. చంద్రబాబు మంత్రుల జాబితా ప్రకటించాక వారి ఆలోచనలు తారుమారై..ఆశలు ఆవిరయ్యాయట. కూటమి క్యాబినెట్ లో యార్లగడ్డకు కానీ ... వెనిగండ్ల రాముకి కానీ.. బోండా ఉమాకు కానీ చోటు దక్కపోవడంతో ముగ్గురూ షాక్‌కు గురయ్యారట. చినబాబును బుట్టలో వేసుకుందామని ఆలోచిస్తే... మొత్తానికే మోసం వచ్చిందని... ఇప్పుడేం చేయాలో అంటూ దిక్కులు చూస్తున్నారని కృష్ణా జిల్లాలో టాక్ నడుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment