T20 World Cup 2024: ఇరగదీస్తున్న సిరాజ్‌ మియా.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో..! | IND Vs USA, T20 World Cup 2024: Yuvraj Singh Presents Fielding Medal To Mohammed Siraj After Stunning Catch | Sakshi
Sakshi News home page

T20 World Cup 2024: ఇరగదీస్తున్న సిరాజ్‌ మియా.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో..!

Published Thu, Jun 13 2024 5:43 PM | Last Updated on Thu, Jun 13 2024 6:28 PM

T20 World Cup 2024: Siraj Won Best Fielder Of The Match In Ireland And USA Matches

ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌ 2024లో టీమిండియా పేసర్‌, హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ ఇరగదీస్తున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లో అతను రెండుసార్లు బెస్ట్‌ ఫీల్డర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు (ఆన్‌ ఫీల్డ్‌ అద్భుతమైన ప్రదర్శనతో పాటు క్లిష్టమైన క్యాచ్‌లు అందుకున్నందుకు ఇచ్చే అవార్డు)  గెలుచుకున్నాడు. 

తొలుత ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ అవార్డు గెలుచుకున్న సిరాజ్‌ మియా.. తాజాగా యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో మరో మారు బెస్ట్‌ ఫీల్డర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డుకు ఎంపికయ్యాడు. ఆన్‌ ఫీల్డ్‌లో అద్బుతమైన ప్రదర్శనలకు గుర్తుగా టీమిండియా మేనేజ్‌మెంట్‌ ఈ అవార్డు బహుకరిస్తుంది.

సిరాజ్‌ మొదటి సారి అవార్డు గెలుచుకున్నప్పుడు ఓ కుర్రాడు మెడల్‌ను బహుకరించగా.. రెండో సారి టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ మెడల్‌ను ప్రధానం చేశాడు. స్పెషలిస్ట్‌ పేసర్‌గా గుర్తింపు తెచ్చుకున్న సిరాజ్‌ మెగా టోర్నీలో రెండు సార్లు బెస్ట్‌ ఫీల్డర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకోవడంతో టీమిండియా అభిమానులు హర్షం​ వ్యక్తం చేస్తున్నారు. 

పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో సిరాజ్‌ బ్యాటింగ్‌లోనూ చాలా ఉపయోగకరమైన పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌ ఆఖర్లో సిరాజ్‌ చేసిన 7 పరుగులు టీమిండియా గెలుపుకు దోహదపడ్డాయి. ఆ మ్యాచ్‌లో టీమిండియా పాక్‌పై 6 పరుగుల తేడాతో గెలుపొందింది.

ఇదిలా ఉంటే, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో టీమిండియా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచి గ్రూప్‌-ఏలో టాపర్‌గా సూపర్‌-8కు అర్హత సాధించింది. భారత్‌.. గ్రూప్‌ దశలో తమ చివరి మ్యాచ్‌ను జూన్‌ 15న కెనడాతో ఆడనుంది. ఫ్లోరిడాలో జరిగే ఈ మ్యాచ్‌ భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌కు వరుణుడు ముప్పు పొంచి ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 

మరోవైపు గ్రూప్‌-ఏలో మూడు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్‌ ఓడి, మరో మ్యాచ్‌ టై కావడంతో పాకిస్తాన్‌ సూపర్‌-8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ గ్రూప్‌లో పాక్‌ యూఎస్‌ఏ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటుంది. యూఎస్‌ఏ తదుపరి ఐర్లాండ్‌తో ఆడబోయే మ్యాచ్‌లో గెలిచినా.. లేక ఆ మ్యాచ్‌ రద్దైనా ఆ జట్టే సూపర్‌-8కు అర్హత సాధిస్తుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement