కోహ్లి, రోహిత్‌ వికెట్లు తీసిన భారత టెకీ.. దిమ్మతిరిగే బ్యాక్‌గ్రౌండ్‌! | Saurabh Netravalkar: Techie who got Kohli and Rohit Once rattled Yuvraj Singh Stump | Sakshi
Sakshi News home page

T20 WC: కోహ్లి, రోహిత్‌ వికెట్లు తీసిన భారత టెకీ.. దిమ్మతిరిగే బ్యాక్‌గ్రౌండ్‌!

Published Thu, Jun 13 2024 12:27 PM | Last Updated on Thu, Jun 13 2024 1:06 PM

Saurabh Netravalkar: Techie who got Kohli and Rohit Once rattled Yuvraj Singh Stump

సౌరభ్‌ నేత్రావల్కర్‌.. క్రికెట్‌ వర్గాల్లో ప్రస్తుతం మారుమోగిపోతున్న పేరు. ఈ రైటార్మ్‌ పేసర్‌ అండర్‌-19 కప్‌-2010 ఎడిషన్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు.

దేశవాళీ క్రికెట్‌లో ముంబై జట్టుకు ఆడిన నేత్రావల్కర్‌.. టీమిండియా ప్రస్తుత కెప్టెన్‌, ముంబైకర్‌ రోహిత్‌ శర్మకు జూనియర్‌. అదే విధంగా వరల్డ్‌ నంబర్‌ వన్‌ టీ20 బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌తో కలిసి ముంబై డ్రెస్సింగ్‌ రూం షేర్‌ చేసుకున్నాడు.

అంతేకాదు.. జాతీయ క్రికెట్‌ అకాడమీ(ఎన్సీఏ)లో.. భారత జట్టు ప్రస్తుత హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు బౌలింగ్‌ చేసిన ఘనత కూడా సౌరభ్‌ నేత్రావల్కర్‌ సొంతం.

ప్రత్యర్థిగా ఉన్న టీమ్‌లో  ధోని, కోహ్లి
ముంబై తరఫున రంజీలు ఆడిన నేత్రావల్కర్‌.. ఎన్సీఏలో యువరాజ్‌ సింగ్‌ వికెట్‌ పడగొట్టడం ద్వారా 2009లో వెలుగులోకి వచ్చాడు. ఈ క్రమంలో బీసీసీఐ కార్పొరేట్‌ ట్రోఫీలో ఆడే అవకాశం దక్కించుకున్న ఈ పేస్‌బౌలర్‌.. యువరాజ్‌ సింగ్‌, రాబిన్‌ ఊతప్ప, సురేశ్‌ రైనాలతో కలిసి డ్రెస్సింగ్‌రూం పంచుకున్నాడు.

అప్పుడు వీరి జట్టుకు ప్రత్యర్థిగా ఉన్న టీమ్‌లో మహేంద్ర సింగ్‌ ధోని, విరాట్‌ కోహ్లి వంటి స్టార్లు ఉండటం విశేషం. ఇక అంచెలంచెలుగా ఎదిగి అండర్‌ క్రికెట్‌ వరల్డ్‌కప్‌ ఆడే అవకాశం దక్కించుకున్న సౌరభ్‌ నేత్రావల్కర్‌.. 2010 నాటి ఆ ఈవెంట్‌లో టీమిండియా తరఫున లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు.

అగార్కర్‌, జహీర్‌ ఖాన్‌ వంటి దిగ్గజాలు ఉండటంతో
అయితే, సీనియర్‌ లెవల్‌లో మాత్రం అడుగుపెట్టలేకపోయాడు ఈ ముంబైకర్‌. అజిత్‌ అగార్కర్‌, జహీర్‌ ఖాన్‌ వంటి దిగ్గజాలు ఉన్న జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అయినప్పటికీ పట్టుదలని నేత్రావల్కర్‌ 2013లో రంజీల్లో అరంగేట్రం చేశాడు.

అయితే, సరైన అవకాశాలు రాకపోవడంతో తిరిగి చదువు మీద శ్రద్ధ పెట్టాడు. ముంబైలో కంప్యూటర్‌ సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన అతడు.. ఉన్నత విద్యనభ్యసించేందుకు అమెరికా వెళ్లిన సౌరభ్‌ నేత్రావల్కర్‌కు 2015లో న్యూయార్క్‌లోని కార్నెల్‌ యూనివర్సిటీ నుంచి ఆహ్వానం అందింది.

యాప్‌ రూపకర్త 
ప్లేయర్‌ అనాలిసిస్‌ చేసేందుకు వీలుగా అతడు రూపొందించిన క్రిక్‌డీకోడ్‌ యాప్‌నకు ఫిదా అయిన యూనివర్సిటీ యాజమాన్యం అతడికి స్కాలర్‌షిప్‌ కూడా ఇచ్చింది.

కార్నెల్‌ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్‌ పూర్తి చేసిన  సౌరభ్‌ నేత్రావల్కర్‌కు శాన్‌ ఫ్రాన్సిస్కోలోని ఒరాకిల్‌ సంస్థ ఉద్యోగం ఆఫర్‌ చేసింది. అయితే, అక్కడే మళ్లీ తిరిగి క్రికెట్‌ ఆడటం మొదలుపెట్టాడు నేత్రావల్కర్‌.

అలా అమెరికా జట్టులో చోటు
ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి నిబంధనల సరళింపు నేపథ్యంలో.. H1B కార్డ్‌ హోల్డర్‌గా ఉన్న నేత్రావల్కర్‌కు 2018లో యూఎస్‌ఏ జట్టులో అడుగుపెట్టే అవకాశం దక్కింది. మూడేళ్ల పాటు కెప్టెన్‌గానూ వ్యవహరించాడతడు.

ఈ నేపథ్యంలో యూఏఈతో టీ20 మ్యాచ్‌ సందర్భంగా 2019లో సౌరభ్‌ నేత్రావల్కర్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత పపువా న్యూగినియాతో మ్యాచ్‌తో వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు.

ఇప్పటి వరకు అమెరికా తరఫున 48 వన్డేలు ఆడిన సౌరభ్‌ నేత్రావల్కర్‌ 73 వికెట్లు తీశాడు. 30 టీ20లలో కలిపి 31 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.  

టీ20 ప్రపంచకప్‌-2024లో సత్తా చాటి
తొలిసారిగా మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న అమెరికా తరఫున బరిలోకి దిగిన నేత్రావల్కర్‌ పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 18 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. మహ్మద్‌ రిజ్వాన్‌(9), ఇఫ్తికార్‌ అహ్మద్‌ రూపంలో కీలక బ్యాటర్లను అవుట్‌ చేసి పాక్‌ జట్టును కష్టాల్లోకి నెట్టాడు. పాక్‌ పై విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.

ఇక టీమిండియాతో మ్యాచ్లోనూ సౌరభ్‌ నేత్రావల్కర్‌ అద్భుత ప్రదర్శనతో మెరిశాడు.‌ స్టార్‌ బ్యాటర్‌, ఓపెనర్‌ విరాట్ కోహ్లిని గోల్డెన్‌ డకౌట్‌గా వెనక్కి పంపిన నేత్రావల్కర్‌.. మరో ఓపెనర్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(3) వికెట్‌ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో అమెరికా భారత్‌ చేతిలో ఓడిపోయినా ఈ టెకీ మాత్రం తనదైన ముద్ర వేయగలిగాడు. ఈ క్రమంలో సౌరభ్‌ నేత్రావల్కర్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి.

కాగా ఒరాకిల్‌లో పనిచేస్తున్న నేత్రావల్కర్‌.. టీ20 ప్రపంచకప్‌ ఆడేందుకు దాదాపు నెల రోజుల పాటు సెలవు(జూన్‌ 17 వరకు) పెట్టినట్లు సమాచారం. ఒకవేళ అమెరికా సూపర్‌-8కు గనుక క్వాలిఫై అయితే తన లీవ్‌ను పొడిగించుకుంటాడు.

పేటెంట్‌ ఉంది
నెట్టింట సెర్చ్‌ క్వెరీలో భాగంగా అత్యంత వేగంగా ఆటోకంప్లీట్‌ అయ్యే వినూత్న అల్గారిథమ్‌ను సౌరభ్‌ నేత్రావల్కర్‌ రూపొందించాడు. ఇందుకు సంబంధించి అతడి వద్ద పేటెంట్‌ రైట్‌ కూడా ఉంది.

ఇంకో అల్గారిథమ్‌ పేటెంట్‌ కోసం అతడు అప్లై చేశాడు. ఈ విషయాలను నేత్రావల్కర్‌ స్వయంగా క్రిక్‌బజ్‌తో పంచుకున్నాడు. తాను ఒక కోడర్‌ అని.. SQL(లాంగ్వేజ్‌) & C విభాగంలో పనిచేస్తానని పేర్కొన్నాడు.

 కేవలం ఉద్యోగం, క్రికెట్ మాత్రమే కాదు సంగీతంలోనూ నేత్రావల్కర్‌కు ప్రావీణ్యం ఉంది.‌‌​ ఇక అమెరికాపై టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్యకుమార్‌ యాదవ్‌కు ఈ 32 ఏళ్ల పేసర్‌.. ‘‘బ్రదర్‌’’ అంటూ శుభాకాంక్షలు తెలియజేయడం నెట్టింట వైరల్‌గా మారింది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement