సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. ఈ కలను నెరవేర్చుకోవడానికి చాలామంది అహర్నిశలు కష్టపడుతుంటారు. సంపాదించిన డబ్బును జాగ్రత్తగా పొదుపు చేసినా, బ్యాంకుల నుంచి వంటివి తీసుకున్నా.. అంతా ఇల్లు కోసమే. ఇల్లు కొనేందుకు లేదా కట్టుకోవడానికి బ్యాంక్స్ లోన్ మంజూరు చేస్తాయి. హోమ్ లోన్ పొందే వ్యక్తి తప్పకుండా కొన్ని అంశాలను తెలుసుకోవాల్సి ఉంటుంది.
సిబిల్ స్కోర్ - ఒక బ్యాంక్ లోన్ ఇవ్వాలంటే.. సదరు వ్యక్తికి తప్పకుండా మంచి సిబిల్ స్కోర్/క్రెడిట్ స్కోర్ కలిగి ఉండాలి. ఉన్న సిబిల్ స్కోరును బట్టి లోన్ ఇవ్వడం జరుగుతుంది. సిబిల్ స్కోర్ 750 కంటే ఎక్కువ ఉంటే.. అలాంటి వారు సులభంగా కొంత తక్కువ వడ్డీకి లోన్ పొందవచ్చు.
అవసరమైన డాక్యుమెంట్స్ - హోమ్ లోన్ తీసుకోవాలనుకునే వారు బ్యాంకులకు లేదా ఇతర ఏదైనా లోన్ ఇచ్చే సంస్థలకు కొన్ని డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆదాయ లేదా ఆస్తి పత్రాలు మాత్రమే కాకుండా పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ వంటివి కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఉద్యోగం చేసేవారైతే మూడు నెలల సాలరీ స్లిప్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
ప్రాసెసింగ్ ఫీజు - ఏ లోన్ తీసుకున్న దానికి కొంత ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజు పర్సనల్ లోన్ తీసుకునే వారికి కొంత ఎక్కువగా ఉంటుంది. హోమ్ లోన్ లేదా వెహికల్ లోన్ తీసుకునే వారికి మాత్రం కొంత తక్కువగా ఉంటుంది. హోమ్ లోన్ తీసుకునేవారికి 0.5 నుంచి 1 శాతం ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. లోన్ తీసుకునే ముందే వివిధ చార్జీలు, ఫీజుల గురించి పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంటుంది.
లోన్ డ్యూరేషన్ (కాల వ్యవధి) - లోన్ తీసుకునేవారు కాల వ్యవధిని కూడా నిర్ణయించుకోవాలి. ఒక వ్యక్తి అర్హతను బట్టి బ్యాంకులు గరిష్టంగా 30 సంవత్సరాల వరకు కాల వ్యవధిని అందిస్తాయి. అయితే వీలైనంత త్వరగా లోన్ పూర్తి చేసుకోవడానికి తక్కువ కాల వ్యవధిని ఎంచుకోవడం చాలా ఉత్తమం. డ్యూరేషన్ వ్యవధి ఎక్కువగా ఉంటే వడ్డీ భారం కూడా ఎక్కువగా ఉంటుంది.
వడ్డీ రేటు - లోన్ తీసుకునే వ్యక్తి ప్రధానంగా వడ్డీ రేటును గురించి తెలుసుకోవాలి. ప్రభుత్వ బ్యాంకులతో పోలిస్తే.. కొన్ని ప్రైవేట్ సంస్థలు భారీ వడ్డీలకు లోన్స్ అందిస్తాయి. కాబట్టి ఎక్కడైతే తక్కువ వడ్డీకి లోన్ లభిస్తుందో తెలుసుకుని లోన్ తీసుకోవడం ఉత్తమం. ఈ వడ్డీ రేటు రేపో రేటు మీద ఆధారపడి ఉంటుంది.
ఈఎంఐ - లోన్ తీసుకునే వ్యక్తి.. తాను ఎంచుకునే కాల వ్యవధిని బట్టి ఈఎంఐ ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు. ఇది పూర్తిగా లోన్ తీసుకునే వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. అంటే సంపాదన, ఖర్చులు వంటి వాటిని బేరీజు వేసుకుని ఈఎంఐ ఎంత కట్టాలనేది నిర్ణయించుకోవచ్చు. లోన్ ఈఎంఐ అనేది సంపాదనలో 45 శాతం కంటే ఎక్కువ కాకుండా ఉంటే ఉత్తమమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? తప్పకుండా ఇవి తెలుసుకోండి
ఇవి మాత్రమే కాకుండా హోమ్ లోన్ ప్రీ పేమెంట్, పన్ను రాయితీలు, హోమ్ లోన్ ఇన్సూరెన్స్, లోన్ డీఫాల్ట్ వంటి విషయాలను గురించి కూడా ముందుగా తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకున్న తరువాత హోమ్ లోన్ తీసుకోవాలి. బ్యాంకులు లోన్ ఇస్తున్నాయి కదా ఎగబడి తీసుకున్నారంటే.. ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment