IPL 2024: కోహ్లి, వార్నర్‌ సరసన చేరిన హిట్‌మ్యాన్‌ | Sakshi
Sakshi News home page

IPL 2024: కోహ్లి, వార్నర్‌ సరసన చేరిన హిట్‌మ్యాన్‌

Published Mon, Apr 8 2024 10:23 AM

IPL 2024 MI VS DC: Rohit Sharma Becomes Third Player In IPL History To Score 1000 Plus Runs Against Multiple Opponents - Sakshi

ఐపీఎల్‌ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న (ఏప్రిల్‌ 7) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ముంబై ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్‌ కేవలం 27 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 49 పరుగులు చేసి అలరించాడు. 

13 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద రోహిత్‌ ఓ అరుదైన క్లబ్‌లో చేరాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 1000 పరుగులు (34 మ్యాచ​్‌ల్లో 1026 పరుగులు) పూర్తి చేసిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. రోహిత్‌కు ముందు విరాట్‌ కోహ్లి మాత్రమే ఢిల్లీపై 1000 పరుగులు మార్కును తాకాడు. కోహ్లి ఢిల్లీపై 28 ఇన్నింగ్స్‌ల్లోనే 1030 పరుగులు చేశాడు. 

రోహిత్‌ ఢిల్లీపై 1000 పరుగులు పూర్తి చేయడంతో మరో రికార్డు కూడా ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో ఒకటి, అంతకంటే ఎక్కువ జట్లపై 1000 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన మూడో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. హిట్‌మ్యాన్‌ ఢిల్లీతో పాటు కేకేఆర్‌పై కూడా 1000 పరుగులు పూర్తి చేశాడు. రోహిత్‌కు ముందు డేవిడ్‌ వార్నర్‌ (పంజాబ్‌, కేకేఆర్‌), విరాట్‌ కోహ్లి (ఢిల్లీ, సీఎస్‌కే) మాత్రమే ఐపీఎల్‌లో ఒకటి అంతకుమించి జట్లపై 1000 పరుగులు పూర్తి చేశారు. 

కాగా, ఢిల్లీతో మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై.. రోహిత్‌ శర్మతో పాటు ఇషాన్‌ కిషన్‌ (23 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్‌ పాండ్యా (33 బంతుల్లో 39; 3 ఫోర్లు, సిక్స్‌), టిమ్‌ డేవిడ్‌ (21 బంతుల్లో 45 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రొమారియో షెపర్డ్‌ (10 బంతుల్లో 39 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. 

235 పరుగల భారీ లక్ష్య ఛేదనలో ట్రిస్టన్‌ స్టబ్స్‌ (25 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 71 పరుగులు నాటౌట్‌), పృథ్వీ షా (40 బంతుల్లో 66; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) ఢిల్లీని గెలిపించేందుకు విఫలయత్నం​ చేశారు. స్టబ్స్‌ చివరి వరకు పోరాడినప్పటికీ ఢిల్లీ లక్ష్యానికి 30 పరుగుల దూరంలో నిలిచిపోయింది.  


 

Advertisement
Advertisement