ప్రచార ఖర్చులపై ప్రత్యేక దృష్టి | Sakshi
Sakshi News home page

ప్రచార ఖర్చులపై ప్రత్యేక దృష్టి

Published Fri, May 10 2024 1:30 PM

-

వివరాలు చెప్పాల్సిందే..

ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పోటీలో నిలిచే అభ్యర్థులు ఖర్చు చేసిన ప్రతి రూపాయికీ లెక్కలు చూపించాల్సిందే. ఖర్చుల వివరాలన్నీ ఎన్నికల కమిషన్‌కు చెప్పాల్సి ఉంటుంది. పరిమితికి మించి ఖర్చు చేస్తే అనర్హత వేటు తప్పదు.

– సురేష్‌బాబు, కాకినాడ జిల్లా ఆడిట్‌ అధికారి,

ఎక్స్‌పెండిచర్‌ నోడల్‌ అధికారి

నామినేషన్‌ దాఖలు నుంచి

ఫలితాల వరకూ లెక్కింపు

బిల్లులతో సహా వివరాలు అప్పగించాల్సిందే

పరిమితి దాటితే అనర్హత వేటే..

కాకినాడ సిటీ: సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచార ఖర్చులపై ఎన్నికల కమిషన్‌ (ఈసీ) దృష్టి సారించింది. లోక్‌సభ అభ్యర్థుల వ్యయ పరిమితిని రూ.95 లక్షలుగా, అసెంబ్లీ అభ్యర్థుల వ్యయ పరిమితిని రూ.40 లక్షలుగా ఈసీ నిర్ణయించింది. నామినేషన్‌ దాఖలు చేసినప్పటి నుంచి ఫలితాలు వచ్చే వరకూ అభ్యర్థుల ఖర్చుల వివరాలను ఈసీ నియమించిన పరిశీలకులు లెక్కిస్తారు. అభ్యర్థి తన ఎన్నికల ప్రచారానికి చేస్తున్న ఖర్చును నిబంధనలకు అనుగుణంగా లెక్కించాలి. సభలు, సమావేశాలు, ర్యాలీలు, ప్రకటనలు, వాల్‌ పోస్టర్లు, వాహనాలకు సంబంధించిన వ్యయాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది.

ధరలకు అనుగుణంగా ఖర్చు

మార్కెట్‌ ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతున్న నేపథ్యంలో ఖర్చులను అంచనా వేయడానికి ధరల ద్రవ్వోల్బణ సూచిని ఎన్నికల కమిషన్‌ ప్రామాణికంగా తీసుకుంటుంది. అభ్యర్థి ఏదైనా ప్రాంతీయ బ్యాంకు ఖాతా తెరచి, దాని ద్వారా ఎన్నికల ఖర్చుల లావాదేవీలు నిర్వహించాల్సి ఉంటుంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన 30 రోజుల లోపు అభ్యర్థులు తమ ఖర్చు వివరాలను బిల్లులతో సహా అధికారులకు అప్పగించాలి. లేకుంటే అభ్యర్థిపై అనర్హత వేటు పడుతుంది.

పక్కాగా పరిశీలన

ఓటర్లను డబ్బులతో, ఇతర ప్రలోభాలతో మభ్యపెట్టకుండా ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించే లక్ష్యంతో ఖర్చులను ఈసీ నియంత్రిస్తోంది. ప్రతి రోజూ అభ్యర్థులు ఎక్కడెక్కడ ప్రచారాలు నిర్వహిస్తున్నారు.. ప్రచారంలో భాగంగా ఎంత ఖర్చు చేస్తున్నారనే అంశాలపై ఈసీ ఎప్పటికప్పుడు వ్యయ పరిశీలన చేయిస్తుంది. వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సంస్థలు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, నిఘా బృందాలు, వీడియో సర్వైలెన్స్‌ బృందాలు ఈ సమాచారం సేకరిస్తాయి. అభ్యర్థుల ఖర్చుల పరిశీలనకు ఆడిట్‌ బృందాలు పని చేస్తూంటాయి. ఆయా పార్టీల అభ్యర్థులు నిర్వహించే సభలతో పాటు ర్యాలీలు, రోడ్‌షోలలో ఖర్చు చేసే కుర్చీల నుంచి భోజనం, టీ, కాఫీ వరకూ అన్నీ లెక్కిస్తారు.

Advertisement
 
Advertisement
 
Advertisement