2024 లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలను ఎన్నికల సంఘం జూన్ 4న వెల్లడించనుంది. మరోవైపు గత కొన్నేళ్లుగా పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న హింసను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సుమారు 400 కంపెనీల కేంద్ర బలగాల మోహరింపును జూన్ 19 వరకు పొడిగించాలని నిర్ణయించింది.
పశ్చిమ బెంగాల్‌లో శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించిన అనంతరం 400 కంపెనీల కేంద్ర బలగాల మోహరింపును జూన్ 19 వరకు పొడిగిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని సున్నితమైన ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు జూన్ 19 వరకు కేంద్ర బలగాల భద్రతా సిబ్బందిని మోహరించనున్నామని ఎన్నికల సంఘం అధికారి తెలిపారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 స్థానాలకు ఓటింగ్ జరిగింది. నేడు (సోమవారం) కొన్ని బూత్‌లలో రీపోలింగ్ జరుగుతోంది. ఓట్ల లెక్కింపు ముగిసిన రెండు రోజుల వరకూ అంటే జూన్ 6 వరకు కేంద్ర బలగాలను మోహరించాలని ఎన్నికల సంఘం గతంలో నిర్ణయించింది. అయితే ఇప్పుడు దీనిని ఈ నెల 19 వరకూ కొనసాగించాలని సంబంధిత అధికారులు నిర్ణయించారు.
బీజేపీ నేత, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఇటీవల ఎన్నికల సంఘానికి చెందిన ప్రత్యేక పరిశీలకునితో సమావేశమయ్యారు. అలాగే కోడ్ ముగిసిన తర్వాత కూడా మూడు నెలల పాటు కేంద్ర బలగాలను రాష్ట్రంలోనే ఉంచాలని గవర్నర్‌తో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.
Comments
Please login to add a commentAdd a comment