దేశంలోని ఉత్తరాదిన ఎండలు దంచికొడుతున్నాయి. ఈ పరిస్థితుల నేపధ్యంలో పంజాబ్, హర్యానాతో సహా వాయువ్య, మధ్య , తూర్పు భారతదేశంలోని 12 రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు వడగాలులు వీచే అవకాశం ఉన్నదని భారత వాతావరణశాఖ(ఐఎండీ) తెలిపింది.
పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, జమ్మూ డివిజన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్ , ఒడిశాలోని కొన్ని చోట్ల నేడు (సోమవారం) కూడా వడగాలులు కొనసాగవచ్చని ఐఎండీ పేర్కొంది. గడచిన 24 గంటల్లో ఈ రాష్ట్రాలతో పాటు జార్ఖండ్‌లో కూడా తీవ్రమైన వడగాలులు వీచాయి. రానున్న మూడు రోజుల్లో ఉత్తర భారతదేశంలో గరిష్ట ఉష్ణోగ్రత రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది.
మరోవైపు వేసవి పరిస్థితులను, రుతుపవనాలను ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆసుపత్రులు, ఇతర బహిరంగ ప్రదేశాలలో ఫైర్ ఆడిట్, ఎలక్ట్రికల్ సేఫ్టీ ఆడిట్‌లను క్రమం తప్పకుండా నిర్వహించాలని అధికారులను ప్రధాని ఆదేశించారు. ఈ ఏడాది రుతుపవనాలు సాధారణంగానే ఉంటాయని, కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగానే ఉంటాయని ప్రధానికి అధికారులు ఈ సమావేశంలో వివరించారు.
ఉత్తర భారతంలోని ప్రజలు వేడిగాలులకు చెమటలు కక్కుతుండగా, దక్షిణాదినగల కేరళ భారీ వర్షాలతో అతలాకుతలమవుతోంది. రాష్ట్రంలోని ఎర్నాకులం జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. అలాగే 11-20 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
అసోంలో వరద పరిస్థితులు కొనసాగుతున్నాయి. 10 జిల్లాల్లో ఆరు లక్షల మందికి పైగా ప్రజల జీవనం అస్తవ్యస్తమైంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలను ఖాళీ చేయించిన అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కోపిలి, బరాక్, కుషియార నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment