దేశంలోని తూర్పు రాష్ట్రమైన ఒడిశాలో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. ఫలితాలు జూన్ 4న వెల్లడికానున్నాయి. ఒడిశాలో అధికార బిజూ జనతాదళ్ తిరిగి అధికారంలోకి వస్తుందా? లేక అక్కడి ప్రజలు ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వబోతున్నారా? అనేది జూన్ 4న తేలిపోనుంది.
ఒడిశాలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు మే 13 నుంచి జూన్ ఒకటి మధ్య నాలుగు దశల్లో జరిగాయి. యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అందించిన ఒడిశా లోక్‌సభ ఎన్నికల ఫలితాల అంచనాల ప్రకారం రాష్ట్రంలో బీజేపీ 18 నుంచి 20 సీట్లు గెలుచుకుంటుందని, బీజేడీకి కేవలం రెండు సీట్లు మాత్రమే వస్తాయని అంచనా వేసింది. నేటి చాణక్య ఎగ్జిట్ పోల్ ప్రకారం ఒడిశాలోని మొత్తం 16 స్థానాలను బీజేపీ గెలుచుకోనుంది. జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీ 15 నుంచి 18 సీట్లు గెలుచుకోనుండగా, బీజేడీ 3 నుంచి 7 సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విషయానికొస్తే ఒడిశాలో బీజేపీ, బీజేడీ పార్టీలకు సమాన స్థానాలు వస్తాయనే అంచనాలున్నాయి.
ఒడిశాలో అధికార బిజూ జనతాదళ్ (బీజేడీ) వరుసగా ఆరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నామని ప్రకటించింది. అయితే 147 మంది సభ్యుల ఒడిశా అసెంబ్లీలో అధికార మార్పు ఖాయమని బీజేపీ చెబుతోంది. కాగా ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ప్రకటించిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ప్రకారం నవీన్ పట్నాయక్ అధికార పార్టీ బిజూ జనతా దళ్‌కు 62 నుంచి 80 సీట్లు రావచ్చు. మరోవైపు బీజేపీకి కూడా 62 నుంచి 80 సీట్లు వస్తాయనే అంచనాలున్నాయి. ఈ ఎగ్జిట్ పోల్ డేటా ప్రకారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అసెంబ్లీలో ఐదు నుండి ఎనిమిది స్థానాలను గెలుచుకోనుంది. ఈ ఎగ్జిట్ పోల్స్‌లో పేర్కొన్న విధంగానే ఫలితాలుంటే ఒడిశాలోని నవీన్ పట్నాయక్ ప్రభుత్వం చిక్కుల్లో పడే అవకాశాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment