టీ20 వరల్డ్‌కప్-2024లో బార్బడోస్ వేదికగా ఒమాన్-నమీబియా మధ్య జరిగిన మ్యాచ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించింది. విజయం కోసం ఇరు జట్ల ఆటగాళ్లు సమాన స్థాయిలో పోరాడడంతో మ్యాచ్ ఫలితం సూపర్ ఓవర్‌లో తేలింది. ఒమాన్‌పై సూపర్ ఓవర్‌లో నమీబియా విజయం సాధించింది.
సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా.. డేవిడ్ వీస్, ఎరాస్మస్ చెలరేగడంతో 6 బంతుల్లో 21 పరుగులు చేసింది. అనంతరం 22 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఒమన్ 6 బంతుల్లో వికెట్ కోల్పోయి కేవలం1 0 పరుగులు మాత్రమే చేసింది. సూపర్ ఓవర్ బౌలింగ్ చేసిన డేవిస్ వీస్ ఒమన్ బ్యాటర్లకు ఎటువంటి ఛాన్స్ ఇవ్వలేదు.
చెలరేగిన నమీబియా బౌలర్లు..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఒమాన్.. నమీబియా బౌలర్ల దాటికి 19.4 ఓవర్లలో కేవలం 109 పరుగులకే కుప్పకూలింది. నమీబియా పేసర్ రూబెన్ ట్రంపెల్మాన్ 4 వికెట్లతో ఒమన్ పతనాన్ని శాసించగా.. ఆల్‌రౌండర్ డేవిస్ వీస్ 3, కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ రెండు, స్కోల్జ్ ఒక్క వికెట్ సాధించారు. ఒమన్ బ్యాటర్లలో ఖలీద్ కైల్(34) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ మక్సూద్(22) పరుగులతో రాణించాడు.
వారెవ్వా మెహ్రాన్ ఖాన్..
110 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా కూడా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి సరిగ్గా 109 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. కాగా ఈ మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు రావడంలో ఒమన్ ఆల్‌రౌండర్ మెహ్రాన్ ఖాన్ కీలక పాత్ర పోషించాడు.
ఆఖరి ఓవర్‌లో నమీబియా విజయానికి కేవలం 5 పరుగులు మాత్రమే అవసరమవ్వగా.. ఒమన్ బౌలర్ మెహ్రాన్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి తన జట్టును పోటీలో ఉంచాడు. కానీ దురదృష్టవశాత్తూ సూపర్ ఓవర్‌లో ఒమన్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌలింగ్ చేసిన మెహ్రాన్ ఖాన్ కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment